fvz

Wednesday, October 07, 2009

మా సీమ దౌర్భాగ్యం ఇదొక కన్నీటి గాధ. మా సీమ తో ప్రకృతి ఆడుకుంటున్న చెలగాటం. కరువు తో మొహం వాచిన మా నెత్తిన కుంభ వృష్టి కురిపించి, ఇంకో సారి వర్షాం అంటే భయపడే లాగ , వరద కన్నా కరువే మేలు దేవుడా అని మేము అనుకునేలాగా ....నీటిని అడగటమే మా సీమ జనాల నేరం అని...వరుణుడు వేసిన శిక్ష.నిన్న గాక మొన్నే మా సీమ కరువు ని అనుభవించి, బాధ పడి పోరాడి కసి పెంచుకున్న ఒక వుద్యమ కారుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రాజెక్ట్ లు కట్టడం మొదలు పెట్టాడు. మా సీమ కే కాదు, కరువు వున్నా ప్రతి వాడ కి నీళ్లు ఇవ్వాలని , ఈ తెలుగు నెల రైతు ఎవడు నీరు లేదని ఏడవ కూడదు అని మహా భాగీరదుడిని అవాహన చేసుకొని ...సముద్రుడి ప్రియుడిని చేరి వొదిగి పోవాలని ఉవ్విళ్ళూరుతున్న నదీమ తల్లిని కరువు బిడ్డల దాహం తీర్చు తల్లీ అని దారి మల్లించ ప్రయత్నించిన స్వాప్నికుడు. తాను శపించిన సీమ తలరాతని మార్చజూసిన అపర బాగీరదుడిని ఆ తధాగతుడు తీసుకెళ్ళాడు , సీమ కు శాపం కొనసాగిస్తున్నాడు. సస్యశ్యామల మయిన గోదావరి డెల్టా ని కట్టడానికి సర్ ఆర్ధర్ కాటన్ ని అనుమతించిన దేవుడు.... అదే కాటన్ దొర మా సీమ కు పెన్నార్ డెల్టా ని కట్టబోతుంటే ఆయన్ని దేశం నుండి వెల్లిపోయేలా చేసాడు. అయన తర్వాత అంతటి వాడు రాజశేఖరుని లోకం నుండే వెల్లిపోయేలా చేసాడు.పోతిరెడ్డి పాడు, హంద్రీ నీవ, తెలుగు గంగ, తుంగబధ్ర , గాలేరు నగరి, కుందూ....ఏ నదుల మీద అయితే నీటికి అడ్డువేసి మా కరువుని తరిమి వేద్దాము అని ఆ భగీరధుడు అనుకున్నాడో ఆ నదులనే పొంగించి మమ్మల్ని నీట ముంచిన వూ దేవుడా ....నీ అంతటి క్రూరుడు ఇంకోడు లేడు. మనిషి కి నిన్ను విచారించే అధికారం ఇస్తే ఏ కోటి సార్లో వురివేసి వుండే వాడు. కరువుతో గరుకయిన సీమ చెయ్యిని మృదువు చేయాలనుకున్న మా తర తరాల కలతో రాక్షస క్రీడ ఆడుకుంటున్న నీచుడివి నువ్వు.మా కోసం తెగించే నాయకుడిని దారుణంగా తీసుకెళ్ళావు. చేత కాని , చీము లేని, తోలు మందం నేతలని అధికార పీఠం ఎక్కిన్చావు. ఇంక మొదలు పెట్టావు నీ క్రూర నీచ రాక్షస ఆనంద క్రీడ. ఏ నదుల మీద ఆనకట్టలు కలలుగాన్నమో ఆ నదులనే పొంగించావు. మా సీమ ని ముంచావు. ప్రజల బాధని తన బాధగా స్పందించే వాడు లేనపుడు, చేతగాని దద్దమ్మలు వున్నపుడు.....అసలే దురద్రుష్టవంతులము అయిన మా సీమ జనం తో ఆడుకుంటున్నావు. వీర దీరుడిని నువ్వు తీసుకెళ్ళి , వెర్రి చూపులు చూస్తూ పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళని మా మీదికి వదిలావు. నీళ్లు వచ్చేది మాకు చెప్పలేదు . పర్లేదు. నీళ్లు వస్తున్న చెప్పలేదు. పర్లేదు. నీళ్లు వచ్చినా పలకరించలేదు. సరే. ఇప్పుడు నీళ్లు తగ్గుతున్నాయి. అయినా ..అయినా ..సీమ మొహం చూసే వాడు లేడు. మా ప్రజల ప్రాణాలు కాపాడే వాడు లేడు. తుంగ చుట్టుముడితే , కృష్ణ పొంగుతుంటే ప్రాణాలు గుప్పట్లో పెట్టుకుని సహాయం కోసం చూస్తున్న మా సీమ జనాలు ఇంకా వేలకొలది మంది గ్రామాలలో చెట్లకి పుట్లకి వున్నారు. మాకు హెలికాప్టర్ లు లేవు, మర పడవలు లేవు...మాట సాయం చేసే వాడు కూడా లేడు.మా శ్రీశైలం ఇంకా 895 అడుగుల ఎత్తులో వుంది. ఇంకా నీళ్లు వస్తూనే వున్నాయి. మాకు సహాయ శిబిరాలు కావాలి. మాకు అన్నం కావాలి. మాకు నీళ్లు కావాలి. మమ్మల్ని భుజం తట్టే వాడు కావాలి. మా రాజశేఖరుడు కావాలి. 4 లక్షల మంది నిరాశ్రయులు అయిన మా సీమ కి పట్టుమని పది పునరావాస కేంద్రాలు కూడా లేవు. మా ఆకలిని పట్టించుకుంటున్న వాడూ లేడు. నిన్నటి దాక ఆత్మాభిమానంతో వున్నంతలో తిని బ్రతికిన సీమ ప్రజా అన్నమో రామచంద్ర అని ఆర్తనాదాలు చేస్తున్నారు. వో సీమ పుత్రుడా , వో మహానీయుడ ఎక్కడున్నావు. మా సీమ రక్తం మరగక మునుపే , మా ఆగ్రహం కట్టలు తేన్చుకోక మునుపే వచ్చెయ్.కృష్ణ , గుంటూరు తప్ప సీమ ప్రాంతం గుర్తుకు రాదా. కృష్ణ , గుంటూరు జిల్లాలకి కలిపి 100 సహాయక శిబిరాలు వున్నాయి. రెండు లక్షల మందికి వంద సహాయక శిబిరాలు వుంటే ....నాలుగు లక్షల మంది నిరాశ్రయులు, నిస్సహాయులు, ఆకలి గొన్న వాళ్ళకి ఎన్ని సహాయక శిబిరాలు వున్నాయి? కోస్తా లంక గ్రామాలకి తర తరాల వరద లని ఎదుర్కునే అనుభవం వుంది. ఆ గ్రామాలకి ప్రభుత్వ సహాయం లేకుండా సొంతంగా తెప్పలు, పడవలు సమకూర్చుకునే సత్తా వుంది. కోస్తా కి మంచి చేయవద్దని, వచ్చే ముప్పుని ఆపొద్దని మేము అనము. కాని ఇంకా పూర్తిగా ముప్పు రాని కోస్తా గ్రామాలకి అంత పెద్ద ఎత్తున సహాయం చేస్తున్న ప్రభుత్వ పెద్దలు, మా సీమ మరభూమి కి ఆ సాయం లో పది శాతం కూడా చేయలేరా? మీ కోస్తా పంటలకి నీరు కోసం నీళ్లు మా శ్రీశైలం లో నిలబెట్టుకోవాలి, అవి పొంగితే మేము మునగాలి , మునిగినా కనికరం చూపని ప్రభుత్వం తో మా చావులు మేము చావాలి. ఇంకా ఎన్నాళ్ళు అని తెగించిన వొకే వొక దీరుడిని మా దౌర్భాగ్యం కొద్ది ఆ దేవుడు తీసుకెళ్ళాడు.మా వాడూ లేకనే మేము అరిచినా పట్టించుకునే వాడూ లేడు. అయన తప్ప అంతా వెధవలు మిగిలారు. శిల్ప మోహన్ రెడ్డి మహా వీరుని అనుకున్నాము. భూమా కొదమ సింహం అనుకున్నాము. SPY రెడ్డి అపర దాన కర్ణుడని అనుకున్నాము. తూ....మీవి ఒక బ్రతుకులేనా? కోట్ల కొలది డబ్బులుఎలేక్షన్స్ లో ఖర్చు పెడతారు . ఇప్పుడు పడి రూపాయలు కూడా ఖర్చు పెట్టి బాదితులకి అన్నం పెట్టలేరా. ప్రభుత్వం తో పోరాడి ఇంకా మరికొన్ని సహాయక సిభిరాలు , ఆహార కేంద్రాలు ఏర్పాటు చేయలేరా. శిల్పా , అస్సలు నువ్వు మంత్రివా? ఎన్ని సార్లు వరద ప్రాంతం లో పర్యటనలు చేసావు ? ఎంత మంది భుజం మీద చేయి వేసి ధైర్యం చెప్పావు? నీ ట్రస్ట్ ఏమయింది ? రాజశేఖరుని స్ఫూర్తి తో , ప్రోత్సాహం తో ట్రస్ట్ పెట్టాను, రాజకీయం చేస్తున్నాను అన్నావు , మరి అయన పోరాట పటిమ, సొంత ప్రాంత అభిమానం , తెగింపు నేర్చుకోలేదా. మామూలు సమయాల్లో మీరు వ్యాపారం చేసుకున్నా సరే అనుకున్నాము .....ఆపత్ సమయం లో కూడా చేతగాని వాడిలాగా కూర్చుంటే ....చరిత్ర మిమ్మలిని క్షమించదు. సంవత్సరాల తరబడి రాజశేఖరుని వెంట తిరిగి చివరికి మీరు నేర్చుకుంది ...తప్పించుకుని తిరగటం , పిచ్చి చూపులు చూడటం ఇవేనా ? ఆ కుందూ నది వరద లో దూకి చావలేక పోయారా ?రోశయ్య నువ్వు ముఖ్యమంత్రివా? మా రాజశేఖరుని కూడా మంధలించగల పెద్దయనవి అని నీ మీద ఎనలేని గౌరవం వుండేది . మరి ఇప్పుడో? పనిచేయని అధికారులని కూడా అరవలేని చేతకాని వాడివి అని నిరూపించుకున్నావు. రాజశేఖరుని స్ఫూర్తి కొనసాగిస్తాను అని బీరాలు పలకటం కాదు........ఆ వేగం, హుంకరింపు, అధికారులని పరిగెత్తించే కోపం అవసరం. విపత్తులో చేయవలసింది సామ, దాన పద్ధతులు కాదు....దండోపాయమే. నొసటి మీద హుంకరింపు వుండాలి. కడుపులో చల్ల కదలని వాడి లాగ చేత కాని మాటలు మాట్లాడటం కాదు. రాజశేఖరా ఎంత పని చేసి పోయావయా ?వర్షం పడని శాపాలు, కరువు తో కాపురం, కరువు తీర్చే వాడిని తీసుకుపోయా దయలేని దేవుడు, వరదలతో శపించే ప్రకృతి , చేతకాని దద్దమ్మ నాయకులు ......ఇంకేన్నాల్లురా ఈ సీమ గుండె కోత ? ఇంకేన్నాల్లురా ఈ ఎదురీతలు? ఇంకా ఎన్ని నాళ్ళు ప్రకృతి తో ఈ పోరాటాలు ? రాజశేఖరా , మళ్ళీ ఎప్పుడు వస్తావురా ?

0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top