ఈ అపర దుర్గామాత హఠాత్తుగా దెయ్యంగా కనిపిస్తోంది. ఒక్కరోజు ఆమె భజన చేయకపోయినా... ఆమెనో ఆ కుటుంబాన్నో ఒక్క మాట అన్నా... ఎవరైనా అంటే ఊర్కున్నా తీవ్ర తప్పిదంగా పరిగణించే సంస్కృతిలో ఒక్కసారిగా మార్పు కనిపిస్తోంది. ఏకంగా ఆమే లక్ష్యంగా తిట్ల దండకాలు మొదలవుతున్నాయ్. "సోనియా నాయకత్వంలో ఇక కాంగ్రెస్ కు భవిష్యత్తు లేద"ని వెంకటస్వామి చేసిన వ్యాఖ్యల వెనుక ఆయన ఉక్రోషం, కోరికలూ ఏమైనా ఉండనివ్వండి. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు అత్యంత ఆందోళనాకరంగా దిగజారిపోతున్న తీరును, రానురానూ కుక్కలు చింపిన విస్తరిలాగా మారిపోతున్న నిజాన్ని కాకా ఎపిసోడ్ స్పష్టం చేస్తోంది. మొన్నమొన్నటిదాకా 33 ఎంపీ సీట్లతో యూపీయే ప్రభుత్వ మనుగడకు చాలా కీలకంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు AICC పెద్దలకు మింగుడు పడకుండా మారింది. వైఎస్ ఆకస్మిక మరణం తరువాత పార్టీ పరిస్థితి ఇలా వేగంగా దిగజారడానికి డిల్లీ వ్యూహరాహిత్యానికి తోడు, రాష్ట్ర నేతలపై వారికున్న తేలికభావమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. వేరే రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడే హన్మంతరావు, కేకే, జైపాల్ వంటి వీరవిధేయులు ఎక్కువగా ఉండటం, సొంత బలం ఏదీలేకపోయినా గొప్పనాయకులుగా ఫోజులు కొట్టడం, డిల్లీ ఏం చెప్పినా నోరు మూసుకుని అంగీకరించడం ఇక్కడే ఎక్కువ. వైఎస్ బతికి ఉన్నప్పుడు ఆయనను కాదని ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితి డిల్లీది. నచ్చినా నచ్చకపోయినా అనేకసార్లు వైఎస్ పైనే ఆధారపడింది. 2009 ఎన్నికల్లోనూ అధిక సీట్లు రావడంతో ఇక ఏపీ కాంగ్రెస్ పై ఆయనకు పూర్తి స్థాయి పట్టు వచ్చేసింది. పదవులపై ఎవరికి ఎన్ని ఆశలున్నా ఎవరూ నోరు మెదపలేని కాలమది. కానీ ఆయన మరణం తరువాత ఒక్కసారిగా పార్టీ అదుపుతప్పింది. మేం ఏది చెప్పినా అందరూ శిరసావహిస్తారు, మేం చెప్పిందే ఫైనల్, ఇకపైనైనా డిల్లీ చెప్పిందే చెల్లుబాటు కావాలి అనే ధోరణి సోనియా కోటరీలో పెరిగిపోయింది. దీనికితోడు ఇక్కడి పరిస్థితులపై సరైన అవగాహన కల్పించేవాడు లేకపోవడం, చాడిలతో సోనియా వరుసగా అన్నీ తప్పుడు నిర్ణయాలను తీసుకోవడం మొదలుపెట్టారు. వీటిల్లో పార్టికి బాగా నష్టపరిచింది జగన్ పట్ల సోనియా వైఖరి. ఈ వ్యవహారాన్ని టాకిల్ చేయడంలో AICC ఏమాత్రం చాణక్యాన్ని చూపలేకపోయింది. జగన్ దూరమైనా పర్లేదనే భావనతో పాటు, వైఎస్ ఇమేజ్ నుంచి పార్టీని విడదీసే ప్రయోగాల్లో పడింది. పార్టీయే అల్టిమేట్ అనే ఫీలింగ్ క్రియేట్ చేసి, రాష్ట్రంలో మేం చెప్పినట్టే నడవాలనే ధోరణి కనబరిచింది. ఇక్కడే పార్టీ వరుస తప్పులకు శ్రీకారం చుట్టినట్టైంది. ఇక్కడ రాష్ట్రవ్యాప్త సానుకూలత ఉన్న నేత ఎవరూ లేకపోవడం, జనంలో మాస్ ఇమేజ్ ఉన్న నేత ఎవరూ లేకపోవడం, ఉన్న నేతలంతా జిల్లా స్థాయి మించకపోవడం వంటి వాస్తవాలను మరిచింది. టెంపరరీ అనుకున్న రోశయ్యను కొనసాగించడం ఒక తప్పయితే, ఆయన సమయంలో తెలంగాణా శక్తులు ఆడించిన ఒక ఆటకు ఏకంగా డిల్లీ కూడా అడుగులు వేయడం మరో తప్పిదం. తెలంగాణా పేరిట కేసీఆర్ దీక్షను మొదలుపెట్టించడం నుంచి, డిసెంబర్ 9న తెలంగాణా అనుకూల ప్రకటన ఇప్పించడం వరకూ ఒక డ్రామా వాళ్లు అనుకున్నట్టే సాగింది. కానీ సీమాంధ్ర నేతలు మేల్కుని తమదైన శైలిలో వ్యవహారాన్ని చక్కదిద్దుకోవడం మొదలెట్టేసరికి తెలంగాణా శక్తుల పాచికలు పనిచేయడం మానేశాయి. మోసగించిందంటూ తెలంగాణా, విడదీసే ప్రయత్నం చేసిందంటూ సీమాంధ్ర.... రెండు ప్రాంతాల్లోనూ సోనియా పేరెత్తితే చాలు జనం చీత్కరించే దుస్థితి వచ్చేసింది. ఎటూ వెళ్లలేని అయోమయంలో "మూడు నెలల్లో జగన్, తెలంగాణ సమస్యలను తేల్చేస్తా" అన్న ఓ పిచ్చోడి మాటలు నమ్మి పెద్దగా సీనియారిటీ లేని, అసలు ఆ పదవిని ఏరకంగానూ తగని కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసింది. ఒకవైపు వేగంగా దిగజారిపోతున్న పార్టీ బలం, మరో వైపు అల్లాటప్పా అనుకున్న జగన్ కాస్తా రోజురోజుకూ బలపడిపోవడం డిల్లీకి మరింత వణుకు పుట్టించాయి. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి కీలకమనుకున్న ఏపీలోనే ఈ దుస్థితి డిల్లీకి కలవరాన్ని సృష్టించింది. అందుకే మరో రెండు వ్యూహాలని రచించుకుంది. ఆల్రెడీ బేరసారాల కోసం తలుపులు తెరిచి ఉంచుకున్న కేసీఆర్ తో ఒకవైపు మాట్లాడుతూనే, ఇంకోవైపు సీమాంధ్రలో ఓ క్రౌడ్ పుల్లర్ కావాలని భావించి చిరంజీవితోనూ బేరాలు మొదలెట్టింది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో అవిశ్వాసం ఎదురైతే గట్టెక్కడంతో పాటు భవిష్యత్తు వ్యూహాలూ అందులో దాగున్నాయి. మళ్లీ ఏదో ఓ తెలంగాణ కాలయాపన ప్రకటన చేస్తే చాలు ఇటు కేసీఆర్, అటు ఎలాగూ వీర సమిక్యవాదిగా తనే ముద్ర వేసుకున్న చిరంజీవి కలిసి పార్టీకి ఎక్కువ స్థానాలు ఇప్పిస్తారని ఆశపడింది. కానీ అసలే కిరణ్ ను గద్దె ఎక్కించిన తీరుతో కోపంతో రగిలిపోతున్న సీనియర్లకు చిరంజీవితో AICC నేరుగా మంతనాలు చేయడం చిర్రెక్కిస్తోంది. అసలే తెలంగాణ పల్లెల్లో తిరగలేని దుస్థితిలో ఉన్న తెలంగాణ నేతలకు ఈ వ్యవహారం గొంతుకు అడ్డం పడినట్టయింది. అందుకే రాష్ట్రపతిని చేయలేదనే కోపంతో ఉన్న వెంకటస్వామిని ముందు నిలిపి తమ నిరసనను ఘాటుగానే డిల్లీకి వినిపించారు. ఒకవైపు జగన్, మరోవైపు తెలంగాణ, ఇంకోవైపు తీవ్ర అసహనంతో రగిలిపోతున్న కొందరు మంత్రులు, సీనియర్లు, ప్రజల్లో వేగంగా పెరుగుతున్న వ్యతిరేకత, ఏమాత్రమూ పనిచేయని కిరణ్ పాచిక.... ఇంకోవైపు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కనిపిస్తున్న నిరాశా సూచికలు, ప్రభుత్వం పైన అసంతృప్తి సోనియాను ఫ్రస్టేషన్ లోకి నెట్టేస్తున్నాయి.
ఎలాగూ ఇక యూపీయే రాదు, ఎండీయే వచ్చేట్లు లేదు, లెఫ్ట్ ఫ్రంట్ ను జనం నమ్మరు... అందుకని మరో పటిష్టమైన కూటమిని నిర్మించే కసరత్తు ఒకటి డిల్లీ కేంద్రంగానే జోరుగా సాగుతోంది. శరద్ పవార్ దీనికి సారథి కాగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రణబ్ లాంటివాళ్ళూ తోడ్పాటు ఇవ్వనున్నారు. ఈ స్థితిలో కోటరీనే నమ్ముకున్న సోనియా మరిన్ని తప్పులు చేయకమానరు. కోటలో మహారాణిలాగా ఆజ్ఞలివ్వడమే కానీ ఆమెకున్న రాజకీయ పరిణతి, అవగాహన, వ్యవహారాల్ని చక్కదిద్దే తెలివిడీ ఆమెకెక్కడివి? నాడు ఇందిరా గాంధీ ఐతే మొత్తం తనే చూసుకునేది. ఇప్పుడూ పరిస్థితి అలాగే ఉందనుకుంటే అది ఆమె పొరపాటే. కనీసం ఏపీకి సంబంధించి ఎటూ అదుగు వేయలేని చిక్కుముడి పడిపోయింది. ఇంకా రానురానూ భజించిన నోళ్లు తిట్ల దండకాన్ని అందుకోవడం, పూలు విసిరిన చేతులే రాళ్లు విసరడం సాధారణమవుతుందేమో..! ఆ దేవతనే వీథుల్లో దెయ్యంగా చూపిస్తారేమో...!!
0 Comment :
Post a Comment