వీరిద్దరూ నోరులేని మూగప్రాణులను అక్కున చేర్చుకుని పోషిస్తున్న దయార్ద్రహృదయులు.
‘అంబా’ శీర్షికన 2010 ఏప్రిల్ 30న సాక్షి ఫ్యామిలీ మొదటిపేజీలో ఈ దంపతుల గోసేవను గురించిన వార్తాకథనం ప్రచురితమైంది.
‘తల్లిపాలు లేని పక్షంలో చంటిబిడ్డలకు ఆవుపాలు పట్టమంటారు. అలాంటి గోవులను చివరికాలంలో కోతకు పంపడం మాకెందుకో బాధ కలిగించింది. మేం మధ్యతరగతి జీవులం. అయినా ఆవులకు కొంతలో కొంతయినా బాసటగా నిలవాలనుకున్నాం. కబేళాకు వెళుతున్న గోమాతలను సింహాచలం తీసుకువచ్చాం. రాజవీధిలోని చిన్నజాగాలో వాటిని సాకడం మొదలెట్టాం’ రత్నప్రభ వివరించారు. చేస్తున్న సేవ మంచిదే అయినా ఆర్థికంగా చాల ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇలాంటి సమయంలో వీరు చేస్తున్న మంచి పనిని ప్రపంచానికి చూపించగలిగింది సాక్షి .
‘ఆరోజు ఇప్పటికీ మాకు గుర్తేనండీ. మేం చేస్తున్న గోసంరక్షణపై సాక్షి వెలువరించిన వ్యాసం మా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. వార్తా కథనం ప్రచురితమైననాటినుంచి రెండు మూడు నెలలపాటు ఫోన్లు వస్తూనే ఉండేవి. వందల్లో ఉత్తరాలొచ్చాయి. అంతేకాదు వంద, రెండు వందలు ఇలా కొంతమంది దాతలు మనీ ఆర్డర్లు కూడా చేశారు. ఆసమయంలో ఆ నిధి గోసంరక్షణకు ఎంతగానో ఉపకరించింది. అంతెందుకు. సాక్షి ఫ్యామిలీలో ఆ వ్యాసాన్ని చూశాకనే ఉదారంగా ఒక పెద్దాయన ముందుకు వచ్చారు. మిందివానిపాలెంలో తనకున్న స్థలాన్ని గోశాలకోసం తాత్కాలికంగా వాడుకోమని మాకిచ్చారు. ఇప్పుడు అక్కడే గోసేవ నిర్వహిస్తున్నాం. సాక్షి బలంతో పదహారు ఆవులు కాస్తా ఇప్పుడు ఏభై ఆవులయ్యాయి. వీటికి దాహం తీరుస్తున్నప్పుడు, వీటి మేను నిమిరినప్పుడు నాకు సాక్షి పత్రిక గుర్తుకొస్తూనే ఉంటుంది. సాక్షి ఫ్యామిలీలో వచ్చే కథనాలు మానవత్వానికి ప్రతీకలుగా ఉంటాయి. సామాజిక మార్పునకు దోహదపడతాయి’ శ్రీరామచంద్రమూర్తి వివరించారు.
‘సాక్షి పత్రిక, ఛానెల్ ఇటీవల ఎదుర్కొంటున్న అవరోధాలను తల్చుకుంటే మా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి.మేం దేవుణ్ణి ప్రార్థించినప్పుడు కూడా సాక్షికి న్యాయం జరగాలనే మాటను ఆ భగవంతునికి విన్నవించుకుంటున్నాం. రాజకీయంగా కక్షలుంటే రాజకీయంగానే తీర్చుకోవాలే తప్పనిచ్చి పత్రికలమీదికి వాటిని మళ్లించడం దురదృష్టకరం. గోవుల ఆశీస్సులు కూడా సాక్షికి నిండుగా ఉంటాయి. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా సాక్షి వాటిని ఛేదించుకుని జనం గుండె చప్పుడుగా ఎప్పటికీ మిగిలి ఉంటుంది.’ ఆర్ద్రమైన హృదయంతో రత్నప్రభ చెప్పుకొచ్చారు.
ఆమె మాట్లాడుతుంటే నోరులేని ఆవులు సైతం తమ ఆశీస్సులు సాక్షికి అందిస్తున్నట్టు మోరలు సాచి అంబారావాలు చేశాయి. గంగడోళ్లు కదిలిస్తూ సాక్షిని దీవించాయి.
0 Comment :
Post a Comment