ఈ హెరిటేజ్ పాల బాలుడికి రాజకీయం తెలీదు అంటూ టీడీపీ నాయకులు సెటైర్లు వేసుకుంటున్నారు. సోమవారంనాడు ప్రధాన ఆంగ్ల దినపత్రిక ఎకనామిక్ టైమ్స్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడిన మాటలు ఎంతో అపరిపక్వంగానూ, అపహాస్యం పాలయ్యేవిగానూ వున్నాయంటూ సెటైర్లు వినబడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో మొత్తం 42 పార్లమెంటు సీట్లకుగాను సగానికి పైగా తమ పార్టీ గెలుచుకుంటుందని... అవతల రాహుల్‌గాంధీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూని కోట్ చేస్తూ మాట్లాడిన లోకేష్... తన విషయం దగ్గరకు వచ్చేసరికి ఇలా తమ పార్టీ సగం సీట్లను మాత్రమే గెలుచుకుంటుందని చెప్పడం అతడి రాజకీయ పరిణితి ఏ స్థాయిలో వుందో తెలిసిపోతుందంటూ ఒక్కసారిగా వెబ్‌సైట్లలో కామెంట్లు కనిపిస్తున్నాయి. రాహుల్‌ని అమూల్ బేబీతో పోల్చినవాళ్లే ఈ చంద్రబాబునాయుడుగారబ్బాయిని హెరిటేజ్ పాలబాలుడు అంటే తప్పేముంది అంటూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో కామెంట్లు కనిపించాయి.
రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిని ఎన్నో ఆటుపోట్లతో రాజకీయ సవాళ్లను ఎదుర్కొన్న చంద్రబాబు... తన కొడుకు విషయంలో కొంచెం శ్రద్ధ వహిస్తే బాగుండేదంటూ ఒక సీనియర్ తెలుగుదేశం నాయకుడు నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. మొత్తంమీద లోకేష్ ఇటువంటి అపరిపక్వమైన మాటలతో ఇలాగే తన రాజకీయ జీవితానికి బాటలు వేసుకుంటే బొక్కబోర్లా పడటం ఖాయమంటూ అతన్ని సిన్సియర్‌గా ఫాలో అవుతున్న ఒక యువ నాయకుడు చెప్పడం గమనార్హం.
ప్రశ్న- ఆంధ్రప్రదేశ్‌లో మీ పార్టీ పరిస్థితి ఏంటి..?
జవాబు- రాష్ర్ట విభజన జరిగితే సీమాంధ్రలో టీడీపీ తప్పకుండా విజయం సాధిస్తుంది. తెలంగాణాలో మా పార్టీకి సవాళ్లు ఎదురవుతాయి. దక్షిణ తెలంగాణాలో బలంగానేవున్నా... ఉత్తర తెలంగాణాలో కొన్నిచోట్ల బలహీనంగా వున్నాం. అందువల్ల నార్త్ తెలంగాణాలోనే బలం పుంజుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సివుంటుంది.
ప్రశ్న- 42 పార్లమెంట్ సీట్లలో ఎన్నింటిని మీ పార్టీ కైవసం చేసుకుంటుంది..?
జవాబు- మాకు దాదాపు 20 లేదా 21 సీట్లు రావచ్చు. కొన్ని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సివుంటుంది. మా పార్టీ బలహీనంగా వున్నచోట్ల ప్రధానంగా నేను తీవ్రమైన కృషి చేయాల్సివుంటుంది. ఆయా నియోజకవర్గాలేవో నాకు తెలుసు. ఏదిఏమైనా 20 లేదా 21 సీట్లను తప్పకుండా గెలుచుకుంటామన్న ఆశ మాకుంది.
ప్రశ్న- రాహుల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్య్వూపై మీ అభిప్రాయమేంటి..?
జవాబు- ఒక నాయకుడిగా రాహుల్ పడుతూ లేస్తున్నాడని అనుకుంటున్నాను. ఆయనకు మంచి ఐడియాలు వుండవచ్చు... కానీ, పార్టీ నాయకుడిగా ఆయన చేసిందేమీలేదు. మీరు జవాబుదారిగా వుండాలనుకుంటే ‘ఇంటి’ నుంచే(సంస్థాగతంగా) కృషి చేయాల్సివుంటుంది.