పెళ్లి పందిట్లోనే పెళ్లి కొడుకుని చితక్కొట్టారు
ఎంగేజ్‌మెంట్ ఎప్పుడో అయిపోయింది. ఇంకాసేపైతే పెళ్లి కూడా అయిపోయేది. తాళి కట్టి ఏడడుగులు వేయడం మినహా పెళ్లి పందిట్లో జరిగే తంతు అంతా పూర్తయ్యింది. ముహూర్తం ప్రకారం జీలకర్ర బెల్లం కూడా పెట్టారు. ఇంతలోనే వరుడు ప్లేటు ఫిరాయించాడు. ఈ అమ్మాయి నాకు నచ్చలేదు.. తాళి కట్టనంటూ మొండికేశాడు.
జరిగింది తెలుసుకుని నివ్వెరపోయిన వధువు బంధువులు పెళ్లి కొడుకుని చితక్కొట్టారు. పెళ్లికి సిద్ధమైన వధూవరులిద్దరికీ ఇది రెండో పెళ్లి. ముందు అన్నీ చర్చించుకున్న తర్వాతే పెళ్లికి సిద్ధమయ్యారు. అబ్బాయికి కట్నంగా రూ.18 లక్షలు, 20 తులాల బంగారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఓ ఫ్లాట్ కూడా కట్నంగా రాయించుకున్నారని వధువు కుటుంబసభ్యులు వాపోతున్నారు.
ఇంత జరిగాక పెళ్లి చేసుకోనని మొరాయిస్తే ఎలా అని వధువు తల్లిదండ్రులు ఎంత బతిమాలినా పెళ్లి కొడుకు పట్టించుకోలేదు. ఇక ఇలా మాటల్తో చెబితే లాభం లేదనుకున్న వధువు తరుపు బంధువులు అబ్బాయి ఒళ్లు హూనం చేసి పోలీసులకు అప్పగించారు. మా అమ్మాయి మంచిదే అయినప్పటికీ, ''అమ్మాయి క్యారెక్టర్ ఎటువంటిది'' అని ఆరాతీశాడని వధువు తరుపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ పెళ్లి సంబంధం మ్యారేజ్ బ్యూరో ద్వారా కుదిరినట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు వరంగల్ జిల్లా హన్మకొండలోని ఓ ఫంక్షన్ హాలు వేదికయ్యింది. వరుడు ప్రదీప్ రెడ్డిది మెదక్ జిల్లా సిద్ధిపేట, వధువుది వరంగల్ జిల్లా గూడూరు.
0 Comment :
Post a Comment