వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరాజయానికి కారణాలని విశ్లేషించే పని మొదలైపోయింది. ఎక్కడ సభలు పెడితే అక్కడ తండోపతండాలుగా రాలిపడ్డ జనాన్ని చూసి...అవన్నీ ఓట్లనo భ్రమల్లో మితిమీరిన ఉత్సాహాన్ని పెంచుకోవడం, దాంతో పాటు క్షేత్రస్థాయి ప్రజల మనోగతాల్ని అంచనాలు వేసుకోలేకపోవడం జగన్ చేసిన మొదటి తప్పు. పైగా సర్వేల పేరుతో ఆయనకు వచ్చి పడ్డ నివేదికలన్నీ తప్పుల తడకలేనంటూ పార్టీ సీనియర్ నాయకులు ఒకరు అసహనాన్ని వ్యక్తం చేశారు. సరైన శాంపిల్ సైజ్ తీసుకోకుండా నిర్వహించే సర్వేల ఫలితాలు కచ్చితంగా తప్పుడు అంచనాలకే దారితీస్తాయన్న నిజాన్ని జగన్ పట్టించుకోకపోవడం ప్రధాన కారణం. ఈ విషయంలో జరిగిపోయిన తప్పిదాన్ని ఇప్పటికీ పార్టీ అధినేత గుర్తించడం లేదన్నది ఆయన వాదన.
ఇక రెండో కారణం... మొదటినుంచి (జైల్లో వున్నప్పుడు) కూడా జగన్ అభ్యర్ధుల ఎంపికలో చూపించిన అత్యుత్సాహం పార్టీ యంత్రాంగాన్ని పటిష్ట పర్చుకోలేకపోవడం, నియోజకవర్గ ఇంచార్జ్‌లను నియమించుకోవడంతో పాటు వారి పని తీరుతెన్నులను బేరీజు వేసుకోవడానికి, విశ్లేషించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేకపోవడం.
ఇక మూడో కారణం...ఒకరిద్దరు జర్నలిస్టుల మీద అతిగా ఆధారపడి వాళ్లు చెప్పే మాటల్ని మాత్రమే తనకనుగుణంగా మల్చుకుని వ్యూహ రచనలో తప్పటడుగులు వేయడం. గతంలో ఈ వ్యవహారాల్ని కొంతమంది సీనియర్ నేతలు ఆయన దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ఆయననుంచి పెద్దగా స్పందన రాలేదు. దాంతో వారంతా మిన్నకుండిపోవాల్సి వచ్చింది. కొంతమంది జగన్ స్నేహితులు కూడా నిస్సహాయులుగానే మిగిలిపోయారు.
నాలుగో కారణం... పార్టీ అభ్యర్థులుగా ఎంపికైన వారినుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసి అంతటితో సరిపెట్టేసి ఎన్నికలప్పుడు వుండే ఖర్చు విషయంలో సహాయం చేయలేకపోవడం.
ఇక చివరిది...ఐదోది జగన్ యాటిట్యూడ్ సమస్య. ‘టూకీగా చెప్పాలంటే అతని వ్యవహారశైలి!’. ఎవర్నీ నమ్మకపోవడం, పార్టీ కీలక యంత్రాంగాన్ని రూపొందించుకోవడం గానీ, వారికి బాధ్యతల్ని అప్పజెప్పడం గానీ, కనీసం వారితో తరచూ సమావేశాలు నిర్వహించి అభిప్రాయాల్ని తెలుసుకోవడంలో గానీ లోపాల్ని సవరించుకోవడంలో గానీ సరైన ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవు. అతని వ్యవహారశైలితో విసిగి వేసారిన కొంతమంది నేతలు బయటికొచ్చేస్తే మరికొంతమంది మాత్రం తమతమ అవసరాల కోసం మిన్నకుండిపోయారు. ఇవి జగన్ పార్టీ ఘోరపరాజయానికి ప్రధాన కారణాలు.
0 Comment :
Post a Comment