జగన్ తో రాజకీయ కాపురం చేయటం కష్టమా!!!
* మాట్లాడింది 3 నిమిషాలే, అందులో 'మన దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు' అనే నామ స్మరణ 12 సార్లు.
* మైకు దొరికింది కదా అని సమయం సందర్భం పరిణితి లేని ప్రసంగాల తో ఎలపరం పుట్టిస్తున్న జగన్.
* వెనకటికి ఎవడో ఒక పేషెంట్ యాక్సిడెంట్ అయ్యి కాలో చేయో పోగుట్టుకొని, ఆపరేషన్ చేయించుకోకుండా ఫార్ముల-ఒన్, ఒలింపిక్ రేస్ లో పాల్గొనాలి అన్నాడంట. జగన్ నోట జాతీయ పార్టీ అనే మాట వింటుంటే ఇదే చందాన ఉంది.
మొదటగా ఇక్కడ ఒక్కసారి 'రాజశేఖర రెడ్డి' (పెద్దాయన) గారిని గుర్తు చేసుకుందాం. తన తుది శ్వాస వరకూ రాజకీయ జీవితంలో ఇద్దరు వ్యక్తులనే అమితంగా ఇష్టపడ్డాడు, అభిమానించాడు. వాళ్లే మన దేశపు మాజీ ప్రధానులు 'ఇందిరా' మరియు 'రాజీవ్' గాంధీలు. విచిత్రంగా ఈ ఇద్దరు గాంధీలు (తల్లీ,కొడుకు) భారత దేశపు ప్రధాన మంత్రులు గా పదవుల్లో కొనసాగుతుండగా హత్యగావించబడ్డారు.
పెద్దాయన ముఖ్యమంత్రి అయిన తరువాత కొన్ని పధకాలకు (రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ... ) వీళ్ళ పేర్లు పెట్టి తన గుండెల్లో ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. కానీ రాజశేఖర రెడ్డి తన రాజకీయ ప్రాసంగాలలో ఎక్కడా కూడా గాంధీలు అలా, ఇలా దేశాన్ని డెవలప్మెంట్ చేసారు, ఈ పధకాలు పెట్టారు అని ఊక దంపుడు ప్రసంగాలు ఏనాడు చెప్పలేదు.
ఇదే మన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి లో కొనసాగుతుండగా హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. తమ నాయకుడు ఇక ఈ లోకం లో లేరు అని తెలుసుకున్న సగటు 600 ఫై చిలుకు అభిమానులు తమ ప్రాణాలను తృణ ప్రాయంగా వదిలేసారు. చనిపోయిన ఏ ఒక్క కుటుంబం వాళ్ళు , తమ దగ్గరికి వచ్చి ఒదార్చమని అడగలేదు. ఈ 600 ఫై చిలుకు ప్రాణాలను అడ్డం పెట్టుకొని, ఓదార్పు రాజకీయ ఊరేగింపులు సాగించాడు మన జగన్. ఎంతగా అంటే ఒక్క రోజులో 'రాజశేఖర రెడ్డి' గారి పేరుని 600 సార్లు స్మరించి సగటు అభిమాని గుండెల్లో పెద్దాయన పట్ల ఉన్న ఇష్టాన్ని తుడుచుకు పోయేలా చేసాడు.
600 ఫై చిలుకు కుటుంబాలను ఓదార్చటానికి ఎంత సమయం కావాలీ ? ఒక నాయకుడికి ఆరు వందల ఫైగా కుటుంబాలను ఓదార్చటానికి ఎంత సమయం పడుతుంది. మహా ఐతే మూడు నెలలు, ఆరు నెలలు లేదా సంవత్సర కాలం సరిపోదా!! ఎవరూ వచ్చి తమని ఒదార్చమని అడగకుండానే, జగన్ తనంతట తానే ఇచ్చిన మాట కోసం కట్టుబడాలి అని ఓదార్పు ఊరేగింపులు సంవత్సరాలు, సంవత్సరాలు మొత్తం చేసుకుంటూ పోతుంటే జనాల్లో చవకబారిపోయి, ఉన్న విశ్వాసం సన్నగిల్లిపోయింది. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొనే విధంగా వ్యవహరించాడు. జగన్ కి తోడుగా సాక్షి పేపర్, ఛానల్ నిలిచింది.
ప్రతీ క్షణం, ప్రతీ గంటా, ప్రతీ రొజూ ఒక నేత గారి గురించి చర్చలు, స్మృతులు, పద్యాలు,పాటలు, జగన్, షర్మిలా, విజయమ్మ ప్రసంగాలు వేసి వేసి సగటు ప్రేక్షకుడికి అసహ్యం కలిగేలా చేయటానికి సాక్షి పూర్తిగా తోడు నిలిచింది. ఉరూరా విగ్రహాలు పెడితేనో, ఒక మనిషి పేరు రోజులో 600 సార్లు స్మరిస్తోనో, ఒక మనిషి ఫోటో రోజు పత్రికల్లో, టి.విల్లో ప్రింట్ చేస్తేనో చెప్పిందే పదే పదే చెప్తోనో, విశ్వాసం, విలువలు, విశ్వసనీయత ఉంది అని నమ్మరు జనాలు.
అభిమానం అనేది సామాన్యుడికైన, నాయకుడి కైన వాళ్ళ మనస్సు, గుండె లోతుల్లో ఉంటుంది, దాన్ని ఎప్పటికీ ఎవరూ చేరపలేరు. ఈ చిన్న విషయాన్ని గుర్తించకుండా ఒక మహానేత పేరుని పదే,పదే,పదే జపించడం, ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని పదే,పదే,పదే తిట్టడం మానుకోవాలి.
ఓటమి అన్నది జీవితంలో చివరి అధ్యాయం కాదు. ఇంకా చాలా పుటలు, చాలా అధ్యాయాలు వుంటాయి. అయితే ఆ పుటలు, అధ్యాయాలు ఎవరికి వారే రచించుకోవాలి. విజయగీతాలుగా మలుచుకోవాలి. అలా కాకుంటే పదేళ్లు ప్రతిపక్షంలో వున్న చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కాగలిగేవారు కాదు. కానీ ఇంతటి సామర్ధ్యం వైఎస్ జగన్ కు వుందా అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే పరస్థితులు అలాంటివి. జగన్ వైఖరీ అలాంటిదే.
ముందు పరిస్థితులను చూదాం. ఏ రాజకీయ పార్టీకైనా, నాయకులకైనా అధికార వియోగం అన్నది అత్యంత బలహీనక్షణం కింద లేక్క. ఆ బలహీనక్షణంలో నాయకులు ఏం చేస్తారో,పార్టీ ఏమవుతుందో ఎవరికీ తెలియదు. నాయకుడు బలమైన వాడయితేనే ఈ పరిస్థితిని తట్టుకోగలడు. వచ్చే అయిదేళ్లు రాజకీయపార్టీలకు ఓ విధంగా విరామ కాలం లాంటివి. ఎందుకంటే, ఎప్పుడూ లేనట్లగా, దాదాపు అన్ని ఎన్నికలు ఒకేసార కట్టకట్టుకు జరిగిపోయాయి. పంచాయతీ, మండల, జిల్లాపరిషతల్, మున్సిపల్, కార్పొరేషన్, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిసిపోయాయి. మహా అధ్భుతం జరిగితే తప్ప ఇప్పట్లో ఎన్నికలు వచ్చే దాఖలాలు లేవు. ఎన్నికలు అనే కార్యక్రమమమే పార్టీల మనుగడకు చాలా చాలా కీలకమైనది.
ఆ లక్ష్యం దగ్గరలో వుంటేనే, నాయకులు పార్టీని, పార్టీ ప్రజలను అలక్ష్యం చేయకుండా ముందుకు సాగుతుంది. ఇప్పుడు దేని కోసం కార్యకర్తలు, చోటా మోటా నాయకులు వైకాపాతో అంటకాగాలి? ఎమ్మెల్యేలు సరే, ఏదో వారి వారి పరిచయాలు, వారికి వున్న అవకాశాల బట్టి, అలా అలా ముందుకు పోతారు. పైకి ఎన్ని చెప్పినా, అవసరమైతే, అధికార పక్షంతో అంటకాగుతారు. వీళ్లని చేరదీస్తాం..వాళ్లని చేరదీయం..బద్ధ వైరుథ్యాలున్నాయి లాంటి పదాలు ఇప్పుడు గాలికి కొట్టుకుపోయాయి. ఎవరు వస్తే వారిని చేరదీయడమే లక్ష్యంగా చేసుకుంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే వైరి వర్గాన్ని ఎలాగైనా కూకటి వేళ్లతో లేపాలి. అందువల్ల వీరు వెళ్తారు..వారు వెళ్లే అవకాశం లేదు అనే శషభిషలు వుండేందుకు వీలు లేదు. ఈ పరిస్థితి నుంచి పార్టీని కాపాడుకోవడం అంటే కేవలం నాయకుడి వైఖరి పైనే ఆధారపడి వుంటుంది. ఆ సంగతి తర్కించే ముందు ఇంకో పరిస్థితి చూదాం.
టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు నిర్మొహమాటంగా కొన్ని వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ నానా భ్రష్టు పట్టిపోవడంతో, ప్రజలు విసిగిపోయి, తెలుగుదేశాన్ని ఎన్నుకున్నారన్న సంగతి విస్మరించరాదన్నారు. నిజంగా ఇది నికార్సయిన పరిశీలన. విజయం సాధించిన ఏ పార్టీ అయినా ఎందుకు విజయం సాధించాం అన్నది గుర్తెరికి, ఆ పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడం అన్నది కీలకం. అంటే చంద్రబాబు ప్రజల మనోగతాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో వున్నారన్నది స్పష్టమవుతోంది. అంటే దాదాపు ప్రజా వ్యతిరేకంగా వెళ్లే ఆలోచన ఆయనలో లేదు. మరోపక్క ఆయన ఏయే వర్గాలు ఈ సారి తమకు కొత్తగా సహకరించాయన్నది కూడా గుర్తించారు. ఎన్జీవోలు, బ్రాహ్మణులు తొలిసారిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేసారని బాబే చెప్పారు. వారిని విస్మరించమని ఆయన సభాముఖంగా మహానాడులో వెల్లడించారు. దానా దీనా అర్థమయ్యేదేమిటంటే, ప్రజలు లేదా, వివిధ వర్గాల మనోభావాలు దెబ్బతినకుండా, పార్టీ పట్ల వారి అభిమానం చెదరకుండా పాలన సాగించాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలిసిపోతోంది.
అంటే జగన్ లేదా వైకాపాకు అటు కాలం సహకరించే అవకాశం ఎలాగూ లేదు. అధికారపక్షం అవకాశం ఇచ్చే ఆలోచనలో లేదు. నిజంగా ఇది క్లిష్ట పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో నాయకులను నిభాయించి, కార్యకర్తలను సమీకరించి, కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవాల్సి వుంది. కానీ కార్యక్రమాలంటే ఏముంటాయి. ప్రభుత్వం ధరలు పెంచితే ఆందోళన, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఉద్యమించడం. కానీ తెలుగుదేశం పార్టీ అటువంటి అవకాశం ఇచ్చేలా లేదు. ఒక వేళ పొరపాటున ధరల పెంపు లాంటి వ్యవహారాలున్నా, అది మరో రెండేళ్ల తరువాత కానీ ఇప్పట్లో వుండదు. అంతవరకు నాయకులు, కార్యకర్తలను పట్టి వుంచడం ఎలా? ఇందుకు ఒక్కటే మార్గం, జగన్ నాయకుల, కార్యకర్తల మనసెరిగి ప్రవర్తించడమే. ఒక నికార్సయిన రాజకీయ వేత్తగా ఎదగడమే.
నిజానికి ఇక్కడ జగన్ కు వున్న అవరోథాల సమస్య కూడా వుంది. తెగించి మాట్లాడేందుకు, నిర్ణయం తీసుకునేందుకు అతగాడికి కేసుల గుదిబండ అడ్డువస్తోంది. వాటి నుంచి ఇప్పట్లో తప్పించుకునే మార్గం కనిపించడం లేదు. కానీ అలా అని మరీ అడ్డగోలుగా, దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటే పార్టీ ప్రజల్లో పల్చనవుతుంది. మోడీ ప్రధాని కాగానే అభినందించడం వరకు ఓకె.. కానీ మా మద్దతు కూడా మోడీకే అని హడావుడిగా, ప్రకటిస్తే, ప్రజలు ఏమనుకుంటారు? కేసుల కోసం శరణుజొచ్చారు అనుకుంటారు. మరి అంత హడావుడి పడినవారు, పోలవరం ఆర్డినెన్స్ పై అందరూ తలా మాట అంటుంటే, పార్టీ విధానం ఇది అని ఎందుకు ప్రకటించలేదు. పోనీ తెలంగాణలో వున్నా నాయకులతో సమస్య వస్తుంది అనుకుంటే, మధ్యేమార్గంగా నైనా జగన్ ఎందుకు మాట్లాడ లేదు. ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక పార్టీ వదిలి పోతున్నపుడు, ప్రకటనలు చేస్తుంటే, పార్టీ నాయకుడిగా తన మాట తాను ఎందుకు చెప్పలేదు. ఎక్కడో బెంగుళూరులో కూర్చోవడం అంటే అది జనాలకు దూరమైనట్లు వుంటుందని అర్థం చేసుకోవాలి కదా?
మీడియాకు దూరం దూరం
అంతెందుకు రాజకీయనాయకుడి బతుకు సగం మీడియాలోనే వుంటుంది. కానీ సాక్షి అనే పత్రిక పెట్టడం ద్వారా జగన్ మిగిలిన మీడియాను శతృవుగా చేసుకున్నారు. బాబు అనుకూల మీడియా సంగతి అలా వుంచండి. మిగిలిన మీడియా అంటే సంస్థలు కాదు జర్నలిస్టులు. మీడియా వ్యవహారాలు చిత్రంగా వుంటాయి. సాక్షి పత్రిక చాలా వరకు ఓ వర్గం జర్నలిస్టులను దగ్గరకు తీసింది. అదీ కాకుండా జర్నలిస్టుల్లో రెండు మూడు వర్గాలున్నాయి. యూనియన్లున్నాయి. ఎప్పటి నుంచో, జర్నలిస్టు నేతలమని చెప్పుకుంటూ, అధికార పార్టీకి దగ్గరగా వుంటూ వారి భోగాలు వారు అనుభవిస్తున్నవారి పట్ల మిగిలిన జర్నలిస్టులకు కినుక వున్నమాట వాస్తవం.
జగన్ ఆ తరహా జర్నలిస్టులనే దగ్గరకు తీయడంతో మిగిలిన వారికి సహజంగానే తెలియని వ్యతిరేకత ఏర్పడింది. వీరు ఏం చేస్తారు అనుకోవడం పెద్ద విషయం కాదు. కానీ నీటి బొట్టు నీటిబొట్టు కలిసిన చందంగా, ప్రజల్లో ఈ తరహా జనం తమను ఎవరైనా అడిగితే జగన్ కు వ్యతిరేకంగా చెబుతారు కానీ, అనుకూలంగా కాదు. ఈ అభిప్రాయాలు ఇలా ఇలా జనాల్లోకి వెళ్లిపోయి, కొండలై కూర్చున్నాయి,. చిత్రమేమిటంటే చంద్రబాబు అధికారంలోకి రాగానే ఏ వర్గం మీడియా నేతలైతే జగన్ వెనుక వున్నారో, వాళ్లే వెళ్లి ముందుగా కలిసి అభినందించి, నవ్వుతూ ఫొటోలు దిగి, ఫేస్ బుక్ ల్లో షేర్ చేసి, ఇప్పుడూ తాము అధికారం వైపే వున్నామని చెప్పకనే చెప్పేసారు. అయితే బాబుది జగన్ టైపు వ్యవహారం కాదు, ఆయన ఏ ఒక్కరినీ గుడ్డిగా ఎంటర్టైన్ చేయరు.
అసలు సాక్షి తన పేరుతో పెట్టడమే జగన్ చేసిన పెద్ద తప్పిదం. తను చేస్తున్నది తప్పు లేదా, వివిధ వర్గాల పెట్టుబడులు అందులోకి రప్పిస్తున్నాం అన్నప్పుడు బుర్ర వున్నవాడు ఎవరైనా ఆ సంస్థను తన పేరిట వుంచుకుంటాడా? హత్య చేసిన వాడు కత్తిని బొడ్లో దోపుకు తిరిగినట్లు? దాంతో మిగిలిన మీడియా సంస్థలన్నీ వ్యతిరేకం అయిపోయాయి. పైగా సాక్షి అనేది జగన్ పత్రిక,.అన్నది జనాల్లోకి వెళ్లడంతో, దాని క్రెడిబులిటీ తగ్గిపోయింది. ఒక్కోసారి నిజాలు గొంతు చించుకున్నా జనం నమ్మే స్థితిలో లేకుండా పోయింది. ఇదే వేరెవరి పేరుతో అయినా వుండి వుంటే, ఈ కేసుల్లో సగం వుండేవి కాదేమో? ఇప్పటికీ జగన్ మీడియాకు దూరమే. ఎన్నికల ముందు కానీ, ఎన్నికల సమయంలో కానీ, ఆ తరువాత కానీ జగన్ ఇంటర్వూ అన్నది ఎక్కడైనా చదివారా..చూసారా.. ఎంత సేపూ జాతీయ మీడియానే. నోరు తెరిచి ఇంటర్వూ అడిగానా ఇవ్వని వ్యవహారం. అసలు పార్టీకి అంటూ మీడియా సెల్ వుందా..దాన్ని ఎవరు చూస్తున్నారు..అదెలా నడుస్తోంది అన్నది జగన్ కు పట్టిన దాఖలాలు లేవు.
సర్వేలే సర్వేలు
ఇక జగన్ పార్టీకి పట్టిన మరో జాఢ్యం సర్వేలు. గడచిన మూడేళ్లుగా వైకాపా చేసినన్ని సర్వేలు మరే పార్టీ కూడా చేయదేమో? ఒక్కోసారి ఒక్కో నాయకుడు, ఒక్కోసారి ఒక్కో అనుచరుడు. వెళ్లడం సర్వేలు చేసి రావడం. పనిలో పనిగా చిలక్కొట్టులు కొట్టి రావడం. దాంతో సర్వేకి సర్వేకి పొంతన లేకుండా పోయింది. అదే సమయంలో జగన్ కు తన చుట్టూ వున్న ఏ ఒక్క నాయకుడిపైనా నమ్మకం లేకుండా పోయింది. నా అనుకున్నవాళ్లంతా సర్వేలను అడ్డుపెట్టుకుని తినేసిన వాళ్లే అని పార్టీ వర్గాల టాక్. దాంతో జగన్ కు ఎవర్నీ నమ్మలేని పరిస్థితి. అంటే తన స్వంత మనుషులు కూడా నిజయతీ, తన పట్ల విశ్వాసంగా పనిచేసేలా జగన్ వ్యవహరించలేకపోయారు. జగన్ దగ్గర రెండే వైనాలు. ఒకటి అతిగా దగ్గరకు తీయడం, రెండోది దూరం పెట్టడం. రెండూ మంచివి కావు.
నాయకులను తన కనుసన్నలలో, తన భయ భక్తులలో వుంచుకోవడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారు. కొణతాల లాంటి విశ్వాస పాత్రుడి అభీష్టానికి వ్యతిరేకంగా దాడి వీరభద్రరావును తెచ్చారు. పోనీ నిలబెట్టుకున్నారా...ఎన్నికలు కాగానే దాడి దారి దాడిదే. మరి ఇప్పుడు ఎవరు దిక్కు మళ్లీ కొణతాలే. ఇలాంటి తప్పిదాలు,.జగన్ చాలా చేసారు. నాయకులు జగన్ తమ వాడు అన్న నమ్మిక కలిగించలేపోయారు. దగ్గరకు వెళ్లాలంటే భయం. మూడ్ ఎలా వుంటుదో అని అనుకునేలా వుంటుంది అక్కడి పరిస్థితి అని చెబుతుంటాయి వైకాపాలోని వర్గాలు. అదెంతవరకు నిజమో? చిత్రమేమిటంటే, జగన్ కు తెలిసో, తెలియకుండానో అతని చుట్టూ, బంధువులు, సన్నహితుల వర్గాలు కొన్ని వున్నాయి. బయట వీరు జగన్ పై ప్రేమతో వారి వ్యవహారాల వారు నడుపుతుంటారు.
కానీ చివరి నిమిషం వచ్చేసరికి, ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలనేసరికి వాళ్లకి ఏమీ అవకాశం వుండదు. దాంతో ఆ వ్యవహారాల బెడిసి కొడతాయి. ఇప్పుడిప్పుడే పైకి వచ్చే ప్రయత్నం చేస్తున్న ఓ వెబ్ సైట్ ఓనర్ని ఈ తరహా వర్గాలు ఓ క్లబ్ లో కలిసాయి. జగన్ కు అనుకూలంగా రాయమని అడిగాయి. ఆ పెద్ద మనిషి, అసలు జగన్ ను ఓసారి కలవనివ్వడం చూదాం అన్నాడట. అలాగే, దానికేం భాగ్యం అని మరి కనిపించలేదు. ఎందుకంటే వారికి జగన్ ను కలిపించడం అన్నది అసాధ్యం. ఇలాంటి కృష్ణానగర్ కబుర్లు చాలా వినిపిస్తుంటాయి. వీళ్లు చేసే అరకొర ప్రయత్నాలు కూడా అలాగే బెడిసి కొట్టి పార్టీకి చేటు తెచ్చాయి.
ఖండనలేవీ?
వైకాపాపై వచ్చిన ఏ ఆరోపణని జగన్ తన నోటితో ఖండిచిన పాపాన పోలేదు. సభల్లో ఎన్నడూ లేనిది చంద్రబాబు చాలా ఆగ్రహంతొ ఊగిపోయిన సంఘటనలు వున్నాయి. కానీ జగన్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తేగా. విశాఖలో కడప ముఠాలు దిగాయి అన్నది ప్రచారం. జగన్ వెళ్లి జగదాంబ జంక్షన్ లో కూర్చుని, ఒక్క కడప రౌడీని లేదా, ముఠా వాడిని ఇక్కడకు తీసుకువచ్చి చూపించండి, నేను, నా తల్లి, విశాఖ బరి నుంచి తప్పుకుని వెళ్లిపోతాం అని, సవాల్ చేసి వుంటే? కనీసం కొంతయినా ప్రజల్లో రియాక్షన్ వచ్చేదిగా. ఓ పూట లేదా ఓ రోజు అలా దీక్షగా అక్కడే వుండిపోతే, ఎలా వుండి వుండేది. తిరుపతి కొండపైకి చెప్పులతో వెళ్లారని వార్తలు వినవచ్చినపుడు, 'నేను వెళ్లలేదు' అని ఎందుకు స్పష్టం లేయలేదు. వైకాపా క్రిస్టియన్ల పార్టీ అని బ్రాహ్మణులు దూరం అవుతున్నపుడు, మీరూ..నా వాళ్లే అన్న ప్రకటన ఎందుకు చేయలేదు. ఇలాంటి రిపేర్లు చేయాల్సినవి ఎన్నో, ఏ ఒక్కటీ జగన్ పట్టించుకోలేదు. ఇప్పటికీ అదే పరిస్థితి.
అన్నింటికి మింది ఆర్థిక వ్యవహారాలు. జగన్ ఓదార్పు యాత్రలకు, షర్మిల యాత్రలకు ఎక్కడి ఏర్పాటు అక్కడి నాయకులు చేస్తూ వచ్చారు. ఓ విధంగా చెప్పాలంటే, చేసి చేసి ఆరపోయారు. తాము చేసింది చెప్పి, ఇంకా ఖర్చుచేస్తామని చెప్పి, టికెట్ లు తెచ్చుకున్న వారు ఎన్నికల వేళ చేతులెత్తేసారు. అప్పులు చేసిన వారు చేసారు. లేని వారు లేదు. వైకాపా వాళ్లు వేలు పంచుతున్నారట అన్నది ప్రచారం. తీరా చూస్తే పైసా తీయని వైనం. 'అంటే మాకు మాత్రమే ఇవ్వలేదన్నమాట,. అని ఎవరికి వారు అనుకుని' కేండిడేట్ లపై కోపాలు పెంచుకున్నారు. పోనీ ఖర్చు చేసి గెల్చిన వారు ఏమన్నా బావుకున్నారా అంటే బుట్టా రేణుక పరిస్థితి. బాకీ దారులందరికీ నోట్లు రాసిచ్చి, ఇళ్లమీదకు తెచ్చుకున్నారని వినికిడి. ఆ బాధలు తట్టుకోలేక పార్టీ వీడిై, అధికార పార్టీ వైపు అడుగులేయబోయి అభాసయ్యారు. ఇప్పుడు ఆమె బాధ ఎవరు తీరుస్తారు?
ఎక్కడుంటారు?
జగన్ ఎక్కడుంటారు..అన్నది ఇప్పటికీ కార్యకర్తలకు తెలియదు. పార్టీ ఆఫీసు, రోజులో ఇంత సమయం అక్కడుండడం, తనను కలవాలనుకునే వారికి ఓ మార్గదర్శనం చేసే వ్యవస్థ ఏదీ వైకాపా వున్నట్లు కనిపించదు. దీంతో నాయకులకు, కార్యకర్తలకు జగన్ కు మధ్య దూరం పెరిగిపోయింది. పార్టీలో టికెట్ లు ఆశించిన వారిని జగన్ ను కలుస్తుంటారా అంటే ఒకటే సమాధానం, ఓసారి ఎప్పుడో కలిసాం..ఒక్కసారి మించి ఎక్కువగా జగన్ ను పార్టీ కార్యాలయంలో దగ్గరగా చూసిన నాయకులను వేళ్ల మీద లెక్కపెట్టుకొవాల్సిందే.
ఏం చేయాలి ?
ఇప్పుడు అయిదేళ్లు పార్టీ నిలబడాలంటే జగన్ ముందు తన జనం లో వుండాలి. పార్టీ కార్యాలయంలో అందుబాటులో వుండాలి. నాయకుల వ్యక్తిగత సమస్యలు కూడ చూడాలి. వ్యక్తిగత సమస్యలు వుంటే తీర్చే ప్రయత్నం చేయాలి. నాయకులను వీలయినంత బిజీగా వుంచుతూ, ఖర్చులు వారి నెత్తిన రుద్దేయకుండా చూసుకోవాలి. పదేళ్ల పాటు టీడీపీ బతికి వుండడానికి పార్టీ కార్యాలయ నిర్వహణది కీలక భాగస్వామ్యం అంటే కాదనేందుకు లేదు. నాయకులకు ఖర్చులు చెల్లించడం, పార్టీ కార్యాలయంలో భోజన, వసతి సదుపాయాలు అందించడం వంటివి నిరంతరం జరుగుతుంటాయి. అక్కడ పార్టీ ఎలా ఆదుకునే వారిని అలా ఆదుకుంటూనే వుంటుంది. జగన్ కూడా ఈ తరహా వ్యవహారాలపై దృష్టి సారించాలి. చురుకైన వారిని ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చి, అధికార ప్రతినిధులుగా తయారుచేసుకోవాలి. నాయకులకు ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ అందించాలి.
కానీ ఇవన్నీ జగన్ చేయగలరా అంటే అనుమానమే. ఎందుకంటే ఆయనకు ప్రతి ఒక్కటీ స్వయంగా పర్యవేక్షించాలి. ఎవర్నీ నమ్మలేరు. నమ్మినవారు సక్రమంగా వుండేలా చూడలేరు. రైట్ పర్సన్ ఎట్ రైట్ ప్లేస్ అన్నది జగన్ కు చాతకాని విద్య. ఎన్టీఆర్, చంద్రబాబు తమ సామాజిక వర్గం వారిని చేరదీసినా, వారు ఆ స్థానానికి నిష్ణాతులుగా పనికి వస్తారంటేనే తెచ్చారు. దాని వల్ల ఉభయత్రా ప్రయోజనం వుంటుంది. నార్ల తాతారావు, కాకర్ల సుబ్బారావు, కోనేరు రామకృష్ణారావు, ఇలా ఎన్ని ఉదాహరణలైనా వుంటాయి. వారిని కాదని మరో దీటైన వారిని చూపించండి అంటే చెప్పలేని పరిస్థితి. పార్టీ వ్యవహారాల్లో కూడా అంతే సుజన, నామా, కంభపాటి, గరికపాటి, ఇలా అందరూ అందరే.
జగన్ కు కూడా సామాజిక వర్గ ప్రేమ వుంటే వుండొచ్చు. కానీ దుర్భిణీ వేసి వెతుక్కుని తెచ్చుకోవాలి. అంతే కానీ, చివర్న రెండు అక్షరాలున్నవాడినల్లా చేరడదీయడం కాదు. అసలు సమస్య,..ఇవన్నీ జగన్ కు ఎవరు చెబుతారు? ఎవరికి ఆయన ఆ అవకాశ ఇస్తారు. మీడియా వార్తలు, వ్యాసాలు చదివే అవకాశం వుందా..అన్నీ అనుమానాలే. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మారతారని, మారి పార్టీని పటిష్టం చేసుకుంటారని, చేసుకుని, వచ్చే ఎన్నికల దిశగా నడిపిస్తారని ఆశించడం, అత్యాశే అవుతుందేమో? తెలుగుదేశం పార్టీ చేజేతులా పాడుచేసుకుంటే తప్ప, బాబు ఆ పని ఈ సారి ఛేయరు గాక చేయరనే అనుకోవాలి.