fvz

Saturday, February 07, 2015

ఒబామాకు ఇండియాను కామెంట్ చేసే అర్హత ఉందా?!


వేరే దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అంటే అమెరికాకు ఎంత ముచ్చటో! పెట్రోల్ నిల్వలున్న దేశాల్లో ప్రజలు స్వాతంత్ర్యం కోరుకొంటున్నారు అంటూ.. అక్కడ దిగబడే అమెరికా ఇండియా వంటి మెతక దేశాలకు శుద్ధులు చెప్పడంలో కూడా ముందుంటుంది! తను అనుసరించలేని.. తను విఫలమైన వ్యవహారాల్లో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తుంటుంది. ఇండియాలో మత సామరస్యత దెబ్బతింటోందని, ఇక్కడ మత విశ్వాసాలు అసహన సంఘటనలు ఎదుర్కొంటున్నాయని అమెరికా అధ్యక్షుల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు! 

బహుశా ఢిల్లీలో రెండు మూడు చర్చిలపై జరిగిన దాడుల ను దృష్టిలో ఉంచుకొని ఒబామా గారు ఈ మాట మాట్లాడిఉండవచ్చు. చాలా చిన్న సంఘటనలను పట్టుకొని మత విశ్వాసాలకు ఎదురైన విఘాతాలుగా అభివర్ణిస్తుండవచ్చు. అయినా ఈ హిందూఅతివాదులను ఈ విషయంలో నిందించాలి. వీళ్లు చేసే ఆకతాయి పనులు అమెరికా వంటి దేశం ఇండియాపై వేలెత్తి చూపే పరిస్థితిని కల్పిస్తున్నాయి. 


అమెరికా జాతి, మత సహనంలోఎంతటి శుద్ధపూసో ఇక్కడ ప్రస్తావించుకోవాలి. చరిత్రలు తవ్వనక్కర్లేదు... ఒక్కో సంఘటనలనూ ప్రస్తావించనక్కర్లేదు.. దాదాపు మూడు నెలల క్రితం అమెరికాలో నల్లజాతిపౌరులు రోడ్డుకెక్కిన విషయాన్ని ప్రస్తావిస్తే చాలు అమెరికా జాతకం బయటపడుతుంది. అక్కడ జాతి వివక్ష ఎంతలా రాజ్యం ఏలుతోందో అర్థం అవుతుంది.  


ఒక అమెరికన్ నల్లజాతి కుర్రాడు. పేరు మైఖేల్ బ్రౌన్. మిస్సోరి రాష్ట్రంలోని ఫెర్గుసన్ ప్రాంతానికి చెందిన వాడు. రోడ్డు మీద ఆడుతూపాడుతూ ఉత్సాహంగా వెళుతున్నాడు. ఇంతలో ఒక పోలీస్ కు వాడి మీద అనుమానం వచ్చింది. తన చేతిలో గన్ ను కుర్రాడి మీదకు ఎక్కుపెట్టి "హ్యాండ్సప్..'' అన్నాడు. అయితే యుక్తవయసులో ఉన్న ఇగో తోటో ఏమోకానీ ఆ నల్లజాతి కుర్రాడు చేతులు పైకెత్తలేదు. చురచుర చూస్తూ నిలుచున్నాడు...అంతే విల్సన్ అనే ఆ పోలీస్ కు కోపం వచ్చింది.. ఆ కుర్రాడిని కాల్చి చంపేశాడు! నిర్ధాక్షిణ్యంగా ఆ కుర్రాడి జీవితాన్ని అంతం చేశాడు. చచ్చిపడి ఉన్న కుర్రాడి వద్ద ఎలాంటి ఆయుధం కానీ, గన్ కానీ లేదని తేల్చారు. దీంతో సదరు పోలీస్ పై కేసు నమోదైంది. 


ఆ తర్వాతే వ్యవహారం అడ్డం తిరిగింది. నిర్ధాక్షిణ్యంగా ఒక యువకుడిని కాల్చి చంపితే.. పోలీసు అయినా అతడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.అమెరికా చట్టాలు అవే చెబుతున్నాయి. అయితే ఆ తెల్లజాతి పోలీసుపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ వ్యవహారంపై విచారించడానికి ఏర్పాటు అయిన గ్రాండ్ జ్యూరీ.. విల్సన్ ను నిర్దోషిగా అని తేల్చింది!  ఆ యువకుడిపై అనుమానంతోనే పోలీసు కాల్పులు జరిపాడు తప్ప.. అతడి తప్పేం లేదని జ్యూరీ అభిప్రాయపడింది! 


అసలు పోలిస్ కు ఆ అనుమానం ఎందుకు కలిగింది? ఆ యువకుడు నల్లజాతి వాడు అయినందునే కదా? అంటూ అమెరికన్ సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. ఆందోళననలు అందుకొన్నారు. ర్యాలీలు, ధర్నాలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, విధ్వంసం... కొన్ని రోజుల పాటు అమెరికాలో గత ఏడాది నవంబర్ లో ఈ ఆందోళన కార్యక్రమాలు అలజడిసృష్టించాయి. నల్లజాతి పౌరులంతా ప్రభుత్వంపై పోరాటమే చేశారు. జాతి వివక్ష తో ఇలాంటి దారుణాలు ఇంకెన్నాళ్లు? అంటూ నిలదీశారు! ఎంతో కష్టపడితే కానీ అమెరికన్ ప్రభుత్వం ఈ ఆందోళనను సద్దుమణిగేలా చేయలేకపోయింది.  


ఈ సంఘటన ఏ మధ్యయుగంలో జరిగినది కాదు.. మూడు నెలల కిందట జరిగిన వ్యవహారం ఇది. మరి ఇప్పుడు ఎవరైనా చెప్పవచ్చు.. అమెరికాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయా? ఇండియాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయా?! ఇక్కడ మత పరమైన విధ్వేషాలు రగిలినా.. విధ్వంసం జరిగినా.. అందులోరాజకీయ పార్టీల స్వార్థం... విషం చిమ్మే ఇస్లామిక్ ఉగ్రవాదమే కారణం. అయితే అమెరికాలో ప్రభుత్వ వ్యవస్థలు జాతి వివక్షను ఊపిరిగా పీల్చుకొంటున్నాయి.  


ప్రతి 28 గంటలకూ ఒక నల్లజాతి పౌరుడు అమెరికన్ పోలీసుల చేతిలో చంపబడుతున్నాడని అమెరికన్ అధ్యయనాలే చెబుతున్నాయంటే.. అక్కడిపరిస్థితి ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. అమెరికాను ఏలుతోంది ప్రజాస్వామ్యపు ప్రభుత్వం కాదు.. తెల్లజాతి దురహంకారం నిండిన ప్రభుత్వం అని చెప్పవచ్చు. వ్యవస్థ అంతా తెల్లజాతి కనుసన్నల్లో నడుస్తోందని అర్థం చేసుకోవచ్చు. నల్లజాతి పౌరులు వివక్షకు ఎంతలా వివక్షకు గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.  


నల్ల జాతి ప్రజల వైపు అనునిత్యంఅనుమానపు చూపులే! పైకి మేడిపండులా కనిపించే అమెరికన్ సొసైటీ పొట్టనిండా పురుగులే! అంత వరకూ ఎందుకూ.. ఇండియాకు రిపబ్లిక్ డేకు అతిధిగా వచ్చినప్పుడు ఒబామా మహనీయుడే చెప్పుకొన్నాడు... తను కూడా జాతి వివక్ష బాధితుడినేని! 


మరి అలాంటి తన దౌర్భాగ్యపు దేశాన్ని సంస్కరించకుండా.. ఇండియాకు నీతులు చెబుతూ.. ఇండియాలో ప్రస్తుత పరిస్థితులను గనుక మహాత్ముడు చూస్తే కన్నీళ్లు పెడతాడు అంటూ ఒబామా అర్థం లేని మాటలను నిస్సిగ్గుగా వల్లెవేస్తున్నాడు. నల్ల జాతి వాడే అయినా.. అగ్రరాజ్య పీఠంలో కూర్చొన్నందున ఒబామాకు తెల్ల కామెర్లు సోకినట్టుగా ఉన్నాయి. బాధిత జాతివాడిగానే ఉంటూ.. గురివింద మాటలు మాట్లాడుతూ.. తమ జాతినే మోసం చేస్తున్నట్టుగా ఉన్నాయి ఒబామా మాటలు! మరి ఇలాంటి ఒబామాకు ఇండియా మత సహనం గురించి, జాతి సహనం గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందా?! 

Source: GA


0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top