సల్మాన్‌కు ప్రస్తుతానికి జైలు తప్పిస్తూ హైకోర్టు వ్యవహరించిన తీరు అతని అభిమానులను ఆనందపరిస్తే, సామాన్యులను నివ్వెరపరిచింది. వారం, పదిరోజుల బెయిలు కాదు, కేసు విచారణను జూన్ 15కు వాయిదా వేసి అప్పటిదాకా బెయిలట! అంతేకాదు, జడ్జిగారు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఒత్తిళ్లు తట్టుకుని సెషన్స్ కోర్టు జడ్జి ఐదేళ్ల శిక్ష వేస్తే (పదేళ్ల దాకా వేసే అవకాశం వుంది) 'అప్పీలుపై విచారణ జరిగి నిర్ణయం తీసుకునే వరకూ అతణ్ని జైల్లో వుంచాల్సిన కేసు కాదిది..'' అనేశారు హైకోర్టు జడ్జి. పన్నెండున్నరేళ్లపాటు విచారించి, వెలువరించిన 240 పేజీల తీర్పును యీ జడ్జిగారు ఎప్పుడు చదివారో ఏమో? సల్మాన్ కారు తోలినంత వేగంగా చదివి వుంటారు. బుధవారం నాడు కింది కోర్టు తీర్పు వెలువడింది. సాయంత్రానికే హైకోర్టు రెండు రోజుల బెయిలు యిచ్చింది. రెండు రోజులయ్యేసరికి యిదిగో ఐదువారాల బెయిలు యిచ్చేసింది. ఈ కేసు విషయంలో సల్మాన్ ప్రవర్తన గమనించినవారికి యీ బెయిలుకు అతను తగినవాడా కాదా అన్నది సులభంగానే తోస్తుంది. అతనికి డ్రైవింగు లైసెన్సు లేదు, తప్ప తాగాడు, డ్రైవింగు సీటులో కూర్చుని నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారకుడయ్యాడు. ఇది ప్రాసిక్యూషన్ వాదం. అది తప్పు అని డిఫెన్సువారు వాదించారు, సహజం. అతను డ్రైవింగు సీటులో లేడంటారు వారు. అదే నిజమైనా ప్రమాదం జరిగిన తర్వాత అతను పారిపోవడమేమిటి? తన డ్రైవరు కొందరు మనుష్యులపై బండి పోనిచ్చేస్తే పోలీసులకు ఫోన్ చేసి తెలియపరచవద్దా? క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చూడవద్దా? కేసు నడుస్తూండగా ఎన్ని రకాల వింత వాదనలు చేస్తూ, స్టేటుమెంట్లు మారుస్తూ పోయాడో చూడండి. అతని వ్యక్తిగతమైన అలవాట్లు పక్కన పెడదాం, కానీ చట్టం పట్ల అతని నిర్లక్ష్యం వన్యమృగాల వేట కేసు విషయంలో స్పష్టమైంది కదా. ఇటువంటి వాడి హక్కుల గురించి జడ్జిగారు ఫీలై పోతున్నారు. అప్పీలు పిటిషన్‌ను అనుమతించి, పెండింగులో వుంచిన తర్వాత, ఆయన హక్కులకు భంగం కలిగించడం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. మరి చనిపోయిన, గాయపడిన వారి హక్కుల మాటేమిటి?
ఫుట్‌పాత్‌ల మీద పడుక్కునే వారికి హక్కులుండవు అని సల్మాన్ అభిమానులు ట్వీటవచ్చు. ఫుట్‌పాత్‌లపై వాహనాలు నడిపే హక్కు వుందా? సమయానికి డ్రైవరు లేడు, ఎవరో కిడ్నాపర్‌ను లేదా హంతకుణ్ని పట్టుకోవడానికి వేగంగా వెళుతూంటే అనుకోకుండా ప్రమాదం జరిగింది అనేందుకు లేదు. డ్రైవరు వున్నాడు, తను తాగి వున్నాడు, డ్రైవరును తప్పుకోమని తాను స్టీరింగు పట్టుకున్నాడు. వేగంగా బండి తోలాడు. ఎందుకు? అదొక వేడుక! హైదరాబాదులో ఓఆర్‌ఆర్‌పై మోటారుసైకిళ్ల పందాలు వేసుకునే డబ్బున్న కుర్రాళ్ల తరహాలో ఒక ఎడ్వెంచర్! ఓఆర్‌ఆర్ ఖాళీగా వుంటుంది, వాళ్లు కూడా ఎవరూ లేని పొద్దున్న సమయాన్ని ఎంచుకుంటారు. ఇక్కడ సల్మాన్ అర్ధరాత్రి సాహసానికి దిగాడు. బొంబాయి నగరవీధుల సంగతి అతనికి తెలియనిది కాదు. అక్కడే పుట్టి పెరిగాడు. అతని సహనటులు కొందరు అలా పేవ్‌మెంట్లపై పడుక్కునే పైకి వచ్చారు.
కానీ విజయమో, వీరస్వర్గమో అన్న థీమ్‌తో సల్మాన్ స్టీరింగు పట్టాడు. పూటుగా తాగి, తోలి, క్షేమంగా యిల్లు చేరగలిగితే సల్మాన్‌కు విజయమన్నమాట, మధ్యలో ప్రమాదం జరిగితే అవతలివాళ్లకు వీరస్వర్గమన్నమాట! చచ్చిపోయిన పేదల పట్ల సల్మాన్‌కు వ్యక్తిగతమైన కక్ష లేదు... నిజమే, జాలీ లేదు. ఆ తర్వాత పశ్చాత్తాపమూ లేదు. నాగయ్యగారు సినిమా హీరో అయ్యాక కారు కొని వేగంగా నడిపేవారు. ఓ రోజు బీచ్ రోడ్డులో ఓ కుక్క కారు కింద పడింది. ఒక ప్రాణి ఉసురు తీశాను, నాకు డ్రైవింగు చేసే అర్హత లేదు అనుకుని పశ్చాత్తాపపడి అప్పణ్నుంచి డ్రైవింగు జోలికి వెళ్లలేదు. ఆయనపై ఏ న్యాయస్థానమూ కేసు పెట్టలేదు. అయినా తనకు తానే శిక్ష వేసుకున్నాడాయన. సల్మాన్ మళ్లీ డ్రైవింగు చేశాడో లేదో మనకు తెలియదు, కానీ తాగుడు మాత్రం మానలేదు. మద్యం వలన జరిగిన అనర్థమిది అని గుర్తించి, మద్యపానం మానేసి, దాని గురించి వుచితంగా ప్రచారం చేసి వుంటే అది ఒక పద్ధతి. ప్రచారం చేస్తే తప్పు ఒప్పేసుకున్నట్లవుతుంది అనుకుంటే కనీసం మానేసి వూరుకోవలసినది. ''మేయర్ ఆఫ్ కేస్టర్‌బ్రిజ్'' అని థామస్ హార్డీ నవల వుంది. డబ్బులేని ఒక తాగుబోతు, తాగుడు మైకంలో తన భార్యను, కూతుర్ని యింకోడికి అతి తక్కువ మొత్తానికి అమ్మేస్తాడు. మైకం దిగాక తన తప్పు గ్రహించి పశ్చాత్తాప పడతాడు. అప్పుడు తన వయసు 21 కాబట్టి, మరొక 21 ఏళ్లు మద్యానికి దూరంగా వుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ తర్వాత కష్టపడి పైకి వచ్చి, పేరు సంపాదించి కేస్టర్‌బ్రిజ్ అనే వూరికి మేయరు కూడా అవుతాడు. కానీ గతం తాలూకు నీడలు అతన్ని వెంటాడుతూనే వుంటాయి. ఇంకో అమ్మాయిని ప్రేమిస్తాడు, పెళ్లాడదామంటే పాతభార్యతో చట్టపరంగా విడాకులు తీసుకోలేదు, ఆ విషయం బయటకు వస్తే మానహాని. ఇలా సతమతమై జీవితం చిందరవందర అవుతుంది. ఒక రాత్రి మద్యపానం అతని జీవితాన్ని కలకాలం వేధిస్తుంది. తప్పు చేస్తే చట్టం నుండి తప్పించుకోలేరు అనే నీతినే ''లే మిజెహాబ్లా'' (ద మిజరబుల్స్) అనే ఫ్రెంచ్ నవల చెపుతుంది. విక్టర్ హ్యూగో రాసిన యీ నవలను తెలుగులో ''బీదలపాట్లు'' పేరుతో రెండు సార్లు తీశారు. (దాని తమిళ వెర్షన్ ''ఏళై పడుం పాటు'' ను కాస్త ఆధునీకరించి కొన్నాళ్లకు ''జ్ఞాన ఒళి'' అనే పేరుతో తమిళంలో శివాజీతో తీశారు).
పేదగా వుండగా చేసిన దొంగతనం చిన్నదే, కానీ చట్టం వెంటాడుతుంది - డబ్బు సంపాదించి, పేరు, వేషం మార్చుకుని పెద్దమనిషిగా అవతరించినా! జావర్ అనే పోలీసు అధికారి యీ కేసును వదిలిపెట్టడు, ఎన్ని మంచిపనులు చేసినా కడకు హీరోకు శిక్ష పడేట్లా చేస్తాడు. సల్మాన్ మారిపోయాడు, వారెవరికో విరాళాలు యిచ్చాడు, కేసు కొట్టేయాలి అని సోషల్ మీడియాలో అడావుడి చేసేవారు గాలి జనార్దనరెడ్డి గురించి కూడా యిలాగే ఫీలవుతారా? వెంకటేశ్వరస్వామికి కిరీటం యిచ్చాడు కాబట్టి గనులు దోచినా వదిలేయాలి అంటారా? నా బోటి వాడు ఇన్‌కమ్‌టాక్సు కట్టడం మానేసి, ఆ డబ్బుతో ఆసుపత్రిలో రోగులకు రొట్టెముక్కలు పంచుతానంటే ఒప్పుకుంటారా? దేని దారి దానిదే! ధర్మరాజు ధర్మమూర్తి, స్వర్గానికి తీసుకెళ్లబోయే ముందు నరకం చూపించి, దానిలో వాళ్ల తమ్ముళ్లు నరకబాధలు పడుతున్నట్లు భ్రమ కల్పించి మనక్షోభ కలిగించారు. అదేమంటే అబద్ధంలా తోచే నిజం - అశ్వత్థామ హతః కుంజరః - చెప్పావు కాబట్టి అన్నారు. ఒక ఋషి చిన్న పిల్లాడిగా వుండగా వేడుక కోసం తుమ్మెదలకు ముళ్లు గుచ్చేడట. శూలశిక్ష పడింది. ఇదేమిటి? అంటే చిన్నప్పుడు చేసినదానికి... అన్నాడు యమధర్మరాజు. 'బాల్యంలో తెలిసీ తెలియక చేసినదానికి యింత శిక్షా? నీకు శాపం యిస్తున్నా' అన్నాడు ఋషి. శాపం యిస్తే యియ్యి కానీ శిక్ష తప్పదు, తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే! అన్నాట్ట ఆ సమవర్తి.
ఇది భారతీయ సంస్కృతి. మరి న్యాయాధీశులు యివన్నీ చదివి తీర్పిస్తారో, లేక యిష్టాయిష్టాల బట్టి యిస్తారో తెలియదు. పురాణాల సంగతి వదిలేయండి, ఈ నేటి సమాజంలో కూడా ఉద్యోగి 40 ఏళ్ల సర్వీసులో సంస్థకు ఎన్ని లాభాలైనా చేకూర్చవచ్చు, ఒక్క ఖాతా విషయంలో చిన్న పొరపాటు జరిగినా చట్టప్రకారం శిక్ష తప్పదు. దానికీ, దీనికీ ముడిపెట్టరు. సత్యం రామలింగరాజు కేసులో ఏమైంది? ఎంతోమందికి ఉద్యోగాలిచ్చారు, భారత ఐటీ రంగానికి ప్రతిష్ట తెచ్చారు, అయితే మాత్రం జైల్లో కూర్చోబెట్టలేదా? సల్మాన్ విషయంలో బెయిల్ యిచ్చినంత మాత్రాన ఆయన పారిపోతాడా? అంటున్నాడు యీ జడ్జిగారు. రామలింగరాజు మాత్రం పారిపోతాడా? విదేశాల్లో సగం షూటింగు చేశాం, మిగతా సగం పూర్తి చేయకపోతే సినిమా నాశనమై పోతుంది, దానిపై ఆధారపడిన వందలాది కుటుంబాలు రోడ్డున పడతాయి అంటూ సల్మాన్ సినిమా నిర్మాత రేపు అనుమతికై అభ్యర్థించవచ్చు, యిలాటి జడ్జి అనుమతి దయచేయించవచ్చు కూడా.
ఇలాటి బెనిఫిట్ లక్షలాది కేసుల్లో నిరాకరిస్తున్నారు, సల్మాన్‌కు ఎందుకు మినహాయింపు? బయట వుంటే సాకక్షులను ప్రభావితం చేస్తారు అంటూ రామలింగరాజును లోపల కూర్చోపెట్టారు - ఆయనే నేరం ఒప్పేసుకుని బయటపెట్టినా! మరి సల్మాన్ ఆ పని చేయడన్న గ్యారంటీ వుందా? కేసులో కీలకసాక్షి రవీంద్ర పాటిల్ సంగతేమైందో చూడండి. అతను మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున సల్మాన్‌కు బాడీగార్డు. ప్రమాదం జరగగానే సల్మాన్ పారిపోగా, బాధ్యత గుర్తెరిగి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినవాడు. ఉన్నదున్నట్టు చెప్పి ఆపదలు తెచ్చుకున్నాడు. సల్మాన్ తరఫు న్యాయవాదులు అతన్ని అనేక రకాలుగా ఒత్తిడి చేసి పిచ్చెక్కించారు. ప్రభుత్వం అతని ఉద్యోగం పీకేసింది. అతను ముంబయి విడిచి వెళ్లిపోయాడు. న్యాయవాదులకు భయపడి కోర్టుకి సరిగా రాకపోతే, కోర్టు జైలుకి పంపింది. చివరకు బిచ్చగాడిగా మారి, మద్యానికి బానిసై, క్షయ వ్యాధితో చచ్చిపోయాడు. సల్మాన్ డ్రైవరు కూడా సాక్ష్యం మార్చాడు. సల్మాన్‌కున్న వీర ఫాలోయింగ్ చూసి, అతను ఎవరినైనా కాల్చినా, కోసినా, నంజుకు తిన్నా తప్పు లేదు అని వీరంగం వేస్తున్న అభిమానుల సందడి చూస్తే ఏ సాక్షికైనా నోరు పెగలదు. సినిమా పరిశ్రమలో అతని పక్షాన కాకుండా న్యాయం పక్షాన మాట్లాడిన వారెవరైనా వున్నారా? సినిమా పరిశ్రమకు యితను చేసిన ఉద్ధరింపు ఏమిటి? తన సహనటి అయిన ఐశ్వర్యా రైతో అతను ఫోన్‌లో ఎంత తీరుగా మాట్లాడాడో నీరా రాడియా టేపుల్లో తెలిసింది. జింకలను వేటాడిన మదం, మనుష్యులపైకి కారు పోనిచ్చిన నిర్లక్ష్యం, పొగరు, దబాయింపు - ఏమీ తగ్గలేదని ఆ టేపులు చెపుతున్నాయి.
మరి ఎందుకు సినిమావాళ్లంతా అతని యింటికి క్యూలు కడుతున్నారు? అతను హీరో కాబట్టి! అదే ఒక చిన్న హీరో అయితే, మాజీ హీరో అయితే, ఫ్లాప్ హీరో అయితే పట్టించుకునేవారా? సల్మాన్ సినిమాలు యింకా ఆడుతున్నాయి కాబట్టి సినీరంగం, నిర్మాతలు, నిర్మాతల వెనక వున్న ఫైనాన్షియర్లు, కార్పోరేట్లు, వారికి దన్నుగా నిలిచే రాజకీయ నాయకులు మద్దతుగా నిలబడ్డారు. ఈ హంగామా అంతా చూసి జడ్జిగారు తడబడి వుండవచ్చు. హైకోర్టులో అప్పీలు విచారణ సమయంలో ఏదైనా జరగవచ్చు. అమిత్ షా కేసు యిటీవలే చూశాం. కానీ యీ లోపున బెయిలు యివ్వడమే ఆశ్చర్యకరం. అతను ఒక్కరోజు కూడా జైలుకి వెళ్లకూడదని కొన్ని వర్గాలు పట్టుదలతో వున్నట్టున్నాయి. బలరాజ్ సహానీ అనే హిందీ సినిమా నటుడు మంచి కారెక్టరు యాక్టరే కాక, వామపక్షవాది కూడా. కార్మికోద్యమంలో, ఇప్టా అనే ప్రగతిశీల కళాకారుల సంఘంలో చురుగ్గా పాల్గొనేవాడు. దాని కారణంగా ప్రభుత్వం కేసులు పెట్టి జైల్లో పెట్టింది. షూటింగు వున్న రోజుల్లో ఆయన పోలీసు ఎస్కార్ట్‌తో స్పాట్‌కు వచ్చి నటించి మళ్లీ జైలుకి వెళ్లేవాడు. సల్మాన్ విషయంలో కూడా సాంతం బెయిలు యిచ్చే బదులు, యిలాటి వెసులుబాటు యిచ్చి అతను ప్రస్తుతం కమిట్ అయిన సినిమాల పూర్తికి కోర్టు సహకరించవచ్చు.
కానీ అలా చేయకపోవడంతో సల్మాన్ జైలుకి వెళ్లడు అనే ధీమాతో యీ విరామంలో అనేకమంది నిర్మాతలు కొత్త ఆఫర్లతో అతని వద్దకు రావచ్చు. ఈ కేసు అంతిమంగా ఏమౌతుందో వేచి చూడాలి. ఈ లోపున మాత్రం తోస్తున్నదేమిటంటే - నువ్వు ఒక మంచి నటుడవై, నీ సినిమాలు హిట్ అవుతూ వుంటే చాలు, ఏం చేసినా చెల్లిపోతుంది. మరి యీ సూత్రం సంజయ్ దత్ విషయంలో ఎందుకు వర్తించలేదు? అని అడిగితే యిప్పుడే సమాధానం చెప్పడం కష్టం. దాన్నీ చాలా ఏళ్లు లాగారు. చివరకు లోపలకి పంపారు, అయినా మాటిమాటికీ ఏదో కారణం చెప్పి పెరోల్‌మీద బయటకు వచ్చేస్తున్నాడు. ఈ పోలిక వస్తుందనే భయం కూడా సల్మాన్‌కు వుందని కాబోలు యీ మధ్య కోర్టులో అసందర్భంగా తను 'హిందూ-ముస్లిం' అని చెప్పుకున్నాడు. తల్లి హిందువు, తండ్రి ముస్లిం అని అర్జంటుగా గుర్తు చేశాడు. సంజయ్ విషయంలో దీనికి విపర్యంగా తల్లి ముస్లిం, తండ్రి హిందువు. క్రిమినల్ కేసుల్లో కూడా క్షేత్రప్రధానమా? బీజప్రధానమా అనేది కూడా చర్చనీయాంశం అవుతుందని నేనెన్నడూ వూహించలేదు. దేశంలో చాలా వింతలు జరుగుతున్నాయి. వాటిలో యిదీ ఒకటిలా వుంది.
-MBS Prasad (మే 2015)
1 Comment :
Post a Comment