వాస్తవానికి దగ్గుబాటి ఈ లేఖను ఫిబ్రవరి నెలలోనే రాసినప్పటికీ....తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్న బాలకృష్ణ వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో తానీ లేఖను బయట పెడుతున్నానని దగ్గుబాటి మార్చి నెలలో మీడియా సాక్షిగా చెప్పారు. అప్పుడు ఈ లేఖ తెలుగు నాట ఎంతో సంచలనం సృష్టించింది. కాంగ్రెస్‌లో కొనసాగుతున్నందుకు నిరసనగా బాలకృష్ణ, గుంటూరు జిల్లా కారంచేడు గ్రామంలోని తన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సంఘటన జరిగిన అనంతరం తాను బాలకృష్ణకు రాసిన లేఖను దగ్గుబాటి విడుదల చేశారు.
'బాలయ్య! నీకు గుర్తుందా ? మీ నాన్న తన ఆఖరి ఘడియల్లో ఓ రోజు నీతో ఓ విషయం చెప్పారు. ''నీవు నా కొడుకువు. చంద్రబాబును చంపెయ్, రక్తంతో తడిసిన ఆ కత్తిని తెచ్చి నాకు చూపించు'' అన్నారు. ఆయన ఉద్దేశం నిజంగా చంద్రబాబును నీవు చంపాలనికాదు. చంద్రబాబు కారణంగా తాను ఎంత బాధ పడుతున్నానో చెప్పడమే ఆయన ఉద్దేశం. ఆనాడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఓ సీడీలో కూడా నిక్షిప్తం చేసుకున్నావు' అని బాలయ్యనుద్దేశించి దగ్గుబాటి ఆ లేఖలో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా 1995, ఆగస్టులో ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటుకు సంబంధించిన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. వెన్నుపోటు పాపంలో తనకు కూడా భాగస్వామ్యం ఉందంటూ దగ్గుబాటి పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశారు.
ఈ లేఖను బయటపెట్టినప్పుడు దగ్గుబాటి వేంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన భార్య పురంధేశ్వరి లోక్‌సభకు ఎంపికై కేంద్రంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఓటుకు కోట్లు కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు నైతికత, విలువల గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో నాటి సంఘటనలను గుర్తు చేయడం సమంజసంగా భావించాం. దగ్గుబాటి రాసిన లేఖ నాటి పత్రికలను తిరగేస్తే ఇప్పటికీ కనిపిస్తుంది. గూగుల్ సెర్చ్‌లో వెతికినా దొరుకుతుంది.
0 Comment :
Post a Comment