fvz

Friday, May 20, 2016

ఎంద చాటా... మనిషిని తినేస్తున్న చాటింగ్ వ్యసనం


ఎంద చాటా... మనిషిని తినేస్తున్న చాటింగ్ వ్యసనం
చాటలు దేనికి వాడతారు? బియ్యంలో రాళ్లేరుకోవడానికి... ఏమీ తోచకపోతే విసనకర్రలా విసురుకోవడానికి ఈ రెండు కార్యక్రమాల వల్ల వ్యక్తికి, కుటుంబానికి ప్రయోజనాలుండేవి. కాని ఇప్పుడు ఇంకో కొత్త చాటొచ్చి పడింది. అదేనండీ చాట్... వాట్సప్ చాట్.రాళ్లల్లో బియ్యం ఏరుకున్నట్టుంది. ఈ చాట్లలో పనికొచ్చేవి తక్కువ, పనికి రానివి ఎక్కువా కాబట్టి.  రాళ్లల్లో బియ్యం ఏరుకోవడమే ఎక్కువ.
 
భార్య: హాయ్...
భర్త: హలో..
భార్య: ఏం చేస్తున్నారు...
భర్త: పెద్దగా ఏం లేదు...
భార్య: టైమ్ రెండయ్యింది.
భర్త: రెండయ్యిందా.. అరె.. చూడలేదే.
భార్య: ఇక కిందకు దిగొచ్చుగా భోజనానికి.
భర్త: ఇదిగో ఇప్పుడే వస్తున్నా.
 
వాట్సప్‌లో భార్యభర్తల సంభాషణ ఇది. డ్యూప్లేలో నివాసం. పైన భర్త ఉంటే కింద నుంచి భార్య సాగించిన సంభాషణ ఇది. అతి మొదలు పూర్వం మనుషులు మాట్లాడుకునేవారు. ఒకరి ఇళ్లకు మరొకరు పోయి. ఒకరి పెళ్లికి మరొకరు పోయి. శుభకార్యం, చావు, కచ్చేరి దగ్గర, టీ స్టాళ్ల వద్ద, స్కూళ్లూ కాలేజీలలో, ఆఫీసుల్లో... ఒకరికొకరు ఎదురుపడితే మాట్లాడుకునేవారు. ఒకరిని ఒకరు చూసుకుంటూ మాట్లాడుకునేవారు. ఒకరి గురించి మరొకరు మాట్లాడుకునేవారు. ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారు. కాని పక్కనున్న మనిషితో కాదు. ఎక్కడో ఉన్న మనిషితో. ఇంటికొచ్చిన మనిషితో కాదు ‘ఆన్‌లైన్’లో ఉన్న మనిషితో. ఎదురుగా ఉన్న మనిషిని పట్టించుకోకుండా ఎక్కడో ఉన్న మనిషి కోసం తాపత్రయ పడే వింత మనస్తత్వం ఇప్పుడు ‘వాట్సప్’ వల్ల వచ్చి పడింది. ఫోన్‌కు ఖర్చవుతుందని, మెసేజ్‌లు చేస్తే బిల్లు పడుతుందని భయం ఉండేది. వాట్సప్ ఉంటే ఆ భయం ఏమీ లేదు. ఎన్ని గంటలైనా చాట్ చేసుకోవచ్చు. ఎంత మందితోనైనా చాట్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లైనా చాట్ చేసుకోవచ్చు. నెట్‌కు పే చేయాలి. చాట్‌కు కాదు. కనుక ప్రతి ఒక్కరూ వాట్సప్‌కు ఆదరణ చూపారు. సమాచారం, ఫొటోలు, సంభాషణ సత్వరమే జరుపుకోవడానికి వీలు చూపే ఈ యాప్ మితంగా వాడుకుంటే మేలు. కాని శృతిమించితే ఇప్పుడది భయంకరమైన వ్యసనంగా మారే పరిస్థితి వచ్చేసింది.
 
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్...
స్మార్ట్‌ఫోన్‌లు చేతికొచ్చి వాట్సప్ యాప్ పెట్టుకున్నాక మొదట చేసేపని అందరికీ హాయ్ చెప్పడం. ఆ తర్వాత చేసే పనంతా చెవులు రిక్కించడమే. మనం చెప్పిన హాయ్‌కు బదులుగా ఎవరైనా హాయ్ చెప్తే బీప్ వస్తుంది. బీప్ వచ్చిన వెంటనే సెల్ చేతిలోకి తీసుకొని వాట్సప్‌లోకి వెళ్లి ఆ సమాధానం చెప్పిందెవరో చూడాలి. వెంటనే ఒక స్మైలీని రెస్పాన్స్‌గా పడేయాలి. మళ్లీ ఎవరు సమాధానం ఇస్తారా ఎదురు చూడాలి. గుడ్‌మార్నింగ్ చెప్పడం అలవాటవుతుంది. అందరికీ ‘గుడ్‌మార్నింగ్స్ ఫ్రెండ్స్’ అని చెప్తే ఒక ఆనందం. ఒట్టి గుడ్ మార్నింగ్ కాకుండా ఏదైనా కొటేషన్ ఉన్న కార్డ్ పోస్ట్ చేయడం నెమ్మదిగా అలవాటవుతుంది. ‘లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు హేట్ ఆన్ పీపుల్... గుడ్ మార్నింగ్’ అనే కొటేషన్‌తో ఉదయాన్నే వాట్సప్‌లో పోస్ట్ చేశాక మళ్లీ దానికి సమాధానం కోసం ఎదురు చూపు. ‘అబ్బ... చాలా మంచి కోట్ పెట్టావ్’ అని ఆ ఫ్రెండ్ రెస్పాండ్ అయితే ఆనందం... ఆ వెంటనే స్మైలీ పోస్టింగ్. ఇలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంతమందికి... వాళ్ల సమాధానాలు... ప్రత్యుత్తరాలు... ఎంత టైమ్ వేస్ట్.
 
డిస్ప్లే పిక్చర్...
వాట్సప్ వ్యసనంలో పడ్డాక దానిని సజీవంగా ఉంచే వ్యసనం ‘డిస్‌ప్లే పిక్చర్’. వాట్సప్ మన ఫొటోను పెట్టుకునే ఏర్పాటు చేయడంతో కొందరికి రోజుకొక ఫొటో పెట్టడం అలవాటవుతుంది. ఇవాళ పడుకునే ముందు రేపేం ఫొటో పెట్టాలా అనే ఆలోచన. ఆ డిస్‌ప్లే ఫొటో చూసి ఫ్రెండ్స్ స్పందించి చాలా బాగున్నావ్... ఎక్కడ దిగావ్ అని అడిగితే ఆనందం. ఈ డిస్‌ప్లే కోసం సెల్ఫీల వలయంలో దిగాలి. గుడి దగ్గర సెల్ఫీ, మార్కెట్ దగ్గర సెల్ఫీ, భార్య/భర్తతో సెల్ఫీ, పిల్లలతో... తెలిసిన స్నేహితులకు తెలిసిన ముఖాలు... కాని మళ్లీ మళ్లీ పెట్టే వ్యసనం అలవాటవుతుంది. వీటి కోసం బట్టలు, కంటి అద్దాలు, అలంకరణ నగలు... ఇవి అదనంగా అవసరమవుతాయి. ఇతరులు పెట్టే ఫొటోలతో పోల్చి చూసుకోవడం... పోటీ పడటం... ఫలితంగా ఆశాంతిని కొని తెచ్చుకోవడం వాట్సప్ వల్ల వచ్చే అదనపు అనారోగ్యాలు.
 
గ్రూపుల తలనొప్పి...
పూర్వం కుటుంబాలు కలిసి మాట్లాడుకునేవి. కాని ‘మై ఫ్యామిలీ’ అని వాట్సప్ గ్రూప్ ఒకటి పెట్టుకుంటే చాలు. అందులోనే అన్ని పలకరింపులు అయిపోతాయి. మళ్లీ ఇక్కడ స్త్రీలకు రెండు ‘మై ఫ్యామిలీ’లు ఉంటాయి. భర్త తరఫు ఫ్యామిలీ ఒకటి. పుట్టింటి ఫ్యామిలీ ఒకటి. ఇక్కడి పోస్టింగులు వేరే. అక్కడి పోస్టింగులు వేరే. ఇక భర్త/భార్య ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక ఆ ఉద్యోగస్తులతో ఒక వాట్సప్ గ్రూప్. పాత కాలేజీ మిత్రులతో ఒక గ్రూప్. అపార్ట్‌మెంట్‌లో ఉంటే అపార్ట్‌మెంట్‌లో ఉన్నవారందరితో ఒక గ్రూప్. ఆధ్యాత్మికత ఉంటే ఆధ్యాత్మిక ఆలోచనలు పంచుకునేవారితో ఒక గ్రూప్. జోక్స్ ఇష్టపడుతుంటే జోక్స్ షేర్ చేసేవారందరితో ఒక గ్రూప్... ఈ గ్రూప్‌లో రెగ్యులర్‌గా ఎవరో ఒకరు పోస్టింగులు చేస్తూ ఉంటారు. బీప్స్ మోగుతూ ఉంటాయి. ప్రతి దానికీ తెరిచి చూడాలనే తాపత్రయం. ఇక దేని మీదా ధ్యాస నిలవదు. ఒక్క నిమిషం చేతిలో నుంచి ఫోన్ దూరమైతే ప్రాణం పోతున్నంత పని. ఇవన్నీ మనుషులకు కొత్త సతమతాలు తీసుకొస్తున్నాయి.
 
ఏకాంతంలో అంతరాయం...
రోజంతా భర్త పని చేసి ఇంటికొస్తాడు. రోజంతా ఇంటి పని పిల్లల బాగోగులతో భార్య రాత్రికి కొంత తీరుబడి చేసుకుంటుంది. ఇద్దరూ రిలాక్స్ అయ్యి మాట్లాడుకునే సమయంలో దొరికిన ఆ కాస్త సమయాన్ని వాట్సప్ మెసేజస్ చెక్ చేసుకోవడానికి ఇటీవల భార్యాభర్తలు ఉపయోగిస్తున్నారని పరిశీలనల్లో తేలుతోంది. ఎవరో పంపిన వీడియోను చూసి భార్య నవ్వుతుంటే ఎవరో షేర్ చేసిన అడల్ట్ జోక్‌లో భర్త తల మునకలుగా ఉంటాడు. ఈ వ్యవహారం కాలక్రమంలో ఇరువురి మధ్యా దూరం పెంచుతోంది. ఒకరు అటెన్షన్ కోరుతున్నప్పుడు మరొకరు అది భార్య కాని భర్త కాని వాట్సప్‌లో మునిగి ఉంటే ఎదుటివారికి చిర్రెత్తుకొచ్చి కొట్లాటలు జరుగుతున్న పుణ్యం వాట్సప్‌కే దక్కుతోంది.
 
అతిథులకు అమర్యాద...
ఇంతకుముందు ఇంటికి ఎవరైనా వస్తే వారిని కూచోబెట్టి టీవీ చూస్తూ మాట్లాడటం ఒక అమర్యాదగా ఉండేది. కాని ఇప్పుడు ఎవరు ఎదురుగా ఉన్నా వారితో మాట్లాడుతూనే వాట్సప్ చెక్ చేయడం చాలా మందికి నిత్యానుభవంగా మారింది. దీనివల్ల ఎదుటివారు మనసు కష్టపెట్టుకొని మెల్లగా బంధాలు అనుబంధాలు స్నేహాలు దూరమయ్యి తెలియని సాంఘిక బహిష్కరణ వాట్సప్ వల్ల జరుగుతోంది.
 
అనవసరపు ఆందోళన...
వాట్సప్‌లో మెసేజ్ చేస్తే అది అవతలి వారు చూస్తే వెంటనే ‘టిక్’ మార్క్ వస్తుంది. మరి వారు చూసి కూడా సమాధానం చెప్పకపోతే? ఎందుకు చెప్పలేదు అనే ఆందోళన. మనం మధ్యాహ్నం రెండింటికి మెసేజ్ పెడితే వాళ్ల వాట్సప్ స్టేటస్‌లో లాస్ట్ సీన్ (ఆఖరున ఎన్నింటికి వాడింది) మధ్యాహ్నం నాలుగున్నర అని చూపిస్తుంది. అంటే మన మెసేజ్ చూసి కూడా సమాధానం చెప్పట్లేదంటే ఏమని? ఈ అశాంతి ఒకటైతే మూడు నాలుగు రోజులుగా వాట్సప్‌లో ఫలానావారు ఎటువంటి మెసేజూ పెట్టకపోతే అదొక అశాంతి. కొందరు ఎప్పుడు చూసినా ఆన్‌లైన్‌లో ఉంటారు. అంటే రాత్రి పదకొండు గంటలకు కూడా ఆన్‌లైన్‌లో ఉంటారు. ఈ సమయంలో కూడా ఆన్‌లైన్‌లో ఉన్నారంటే ఏం చేస్తున్నట్టు అని మరో ఆందోళన. ఇవన్నీ వాట్సప్ వ్యసనపరుల జీవితాలను కొరికి తినేస్తున్నాయి.
 
దారి మళ్లించాలి
వాట్సప్‌ను మితంగా వాడటం, కొన్ని సమయాల్లోనే వాడటం, మిగిలిన సమయాన్ని ఇష్టమైన వ్యాపకాలలోకి మళ్లించడం మంచిదని నిపుణులు అంటున్నారు. మద్యం, డ్రగ్స్ వలే మెదడు ఈ వ్యసనానికి అలవాటు పడటం ప్రమాదం అని సూచిస్తున్నారు. ముందు మనం ఈ వ్యసనానికి లోనయ్యాం అని గ్రహించి అటు పిమ్మట దానిని వదలించుకునే ప్రయత్నం గట్టిగా చేయకపోతే  చాటింగ్ చేటుకు చిత్తయిపోక తప్పదు.  - శశి వెన్నిరాడై
 
సోషల్ మీడియా  దుష్ర్పభావాలు
ఫేస్‌బుక్, వాట్సప్.. ఏదైనాసరే మొదట తినేసేది మన సమయాన్ని! కొత్తలో ఉత్సాహంగా మొదలై తర్వాత వ్యసనంగా మారి టైమ్‌ను బలితీసుకుంటుంది. సోషల్ నెట్‌వర్కింగ్ అంతా స్మార్ట్ ఫోన్‌లోనే ఆపరేట్ చేసుకునే వీలుండడం వల్ల రకరకాల సైట్లు అరచేతిలో కనిపిస్తున్నాయి. వీటి ప్రభావం టీనేజర్స్ మీద ఎక్కువగా ఉండి క్రైమ్‌రేట్ పెరిగే ప్రమాదం ఉంటోందని ఇటీవలి అధ్యయనాలు వెల్లడిచేస్తున్నాయి. వీటివల్ల కావాల్సిన దానికన్నా ఎక్కువ సమాచారం అందుబాటులో ఉండడం వల్ల కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఆ గందరగోళంలో మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని మానసిక నిపుణులు చెప్తున్న సత్యం.
     
అలాగే ఫేస్‌బుక్, వాట్సప్‌లలో వ్యక్తిగత సమాచారం అంతా ఉంచడం వల్ల సైబర్ బుల్లీయింగ్ జరిగే ప్రమాదాలు ఎక్కువ అంటున్నారు సాంకేతిక నిపుణులు. అంతేకాదు వాట్సప్ గ్రూపులు, ఫేస్‌బుక్ పోస్టింగ్‌ల వల్ల ఎన్నో విషయాలు చర్చకు రావడం ఎంత నిజమో రచ్చకావడమూ అంతే వాస్తవం అంటున్నారు. వీటివల్ల అనవసరపు కవ్వింపులు, జోక్యాలు ఎక్కువై మనుషుల మధ్య స్నేహసంబంధాలు దెబ్బతింటున్నాయట.

0 Comment :

 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top