అభిప్రాయం
‘‘ఎక్కడి నీచు లెక్కడి హీనులెంతటి తులువలు / ఎంతటి భ్రష్టు లెచ్చటి దుష్టు లెక్కడి నష్టజాతకులీ నాయకులు / నా తెలుగు జాతికి శాపంగా దాపురించారో’’ అంటారు మహారథి. ఈ మాట అక్షరాలా మన నారా చంద్రబాబు నాయుడికి వర్తిస్తుంది. మధిర సుబ్బన్న దీక్షితులు రాసిన కాశీమజిలీ కథల్లో పాఠకులను భయపెట్టే ఒక మహావట వృక్షం ఉంటుంది. అంతకంటే భయంకరమైన అవినీతి వృక్షం తెలుగు జాతికి సంక్రమించింది. ఒకే పెరడులో పెరిగి శాఖోపశాఖలుగా విస్తరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఎదగనీయకుండా వ్యవస్థల్ని కూడా భయపెడుతున్న ఈ ‘నారా’ అవినీతి వృక్షం మూలాల్లోకి వెళ్లి ఒక్కసారి పరిశీలిద్దాం.
చంద్రబాబుకు నారావారి పల్లెలో ఒక చిన్న పూరిల్లు, రెండెకరాల పొలం మాత్రమే ఉంది. అనుకోకుండా 1978లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయి ‘ఇందిరా కాంగ్రెస్’ ఏర్పడింది. అప్పుడున్న పరిస్థితుల్లో ఇందిరాగాంధీ ఎవ్వరడిగినా టిక్కెట్ ఇచ్చింది. ఆ విధంగా ‘నారా’వారు టిక్కెట్ సంపాదించి ఆమె ప్రభంజనంలో ఎమ్మెల్యేగా గెలిచాడు. అప్పుడతని నెల జీతం 350 రూపాయలు. పాకాల నారాయణస్వామి, గల్లా రాజగోపాల్ నాయుడు ఆర్థిక సాయం అందించడంతో ఎమ్మెల్యేగా గెలుపొందాడు.
అయితే రాజకీయాల్లో సీనియారిటీ, సిన్సియారిటీ పనికి రాదనుకున్నాడు. మంత్రి కావాలనే ఆశతో అన్ని అడ్డదారులు తొక్కటం ప్రారంభించాడు. అమాయకుడైన అంజయ్యగారి అల్లుణ్ణి, పట్టుకొని, అతనిని ప్రలోభపెట్టి చేసి 1980లో మంత్రి పదవి కొట్టేశాడని ఆ రోజుల్లోనే ఒక కాంగ్రెస్ నాయ కుడు ఆక్షేపించాడు. మంత్రిగా అతని జీతం 2,500 రూపాయలు. అదే విధానంలో సంజయ్ గాంధీతో పరిచయం పెంచుకున్నాడు.
ఇక మంత్రి పదవి చేపట్టిన దగ్గర్నుండి అతని అవినీతి యాత్ర ప్రారంభమైంది. తిరుపతిలో 1970– 80లలోనే విష్ణుప్రియ హోటల్ కొన్నాడు. ఆ తరువాత భువనేశ్వరి కార్బైడ్ ఫ్యాక్టరీని ప్రారంభించాడు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ అవ్వడంతో ఆ రోజుల్లో సినిమావాళ్ళ దగ్గర కూడా డబ్బులు కాజేసేవాడని స్వయంగా దాసరి నారాయణ రావుగారు నాతో చెప్పారు. ఆ పరిచయాలతోనే 1981లో ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో అతని వివాహం జరిగింది.
1982 ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినపుడు ఇతడు కాంగ్రెస్‌లోనే ఉండి ఎన్టీఆర్‌ను ఓడిస్తానని ప్రగల్భాలు పలికాడు. తెలుగుదేశం పార్టీ 200 సీట్లతో గెలవటంతో అప్పటికప్పుడు పార్టీలో చేరతానని వచ్చేశాడు. అప్పటికే అతని మీద అనేక కథలు ప్రచారంలో ఉన్నందువల్ల ఎన్టీఆర్ తిరస్కరించారు. అప్పుడు గర్భిణిగా ఉన్న భువనేశ్వరిని ముందుపెట్టి ఎన్టీఆర్ మీద ఒత్తిడి తెచ్చి పార్టీలో చొరబడ్డాడు.
కార్యకర్తగా చేరిన చంద్రబాబు నంబర్ 2 పొజిషన్ కోసం అప్పటివరకు ఆ స్థానంలో ఉన్న నాయకులందరినీ ఏదో ఒక వంకతో బయటకు పంపేశాడు. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జానారెడ్డి, ఉపేంద్ర, కె.ఇ. కృష్ణ మూర్తి, వసంత నాగేశ్వరరావు... వీరంతా ఎన్టీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రులుగా మెలిగినవారు. బయటకు వెళ్లాక చంద్ర బాబు నీచ రాజకీయాన్ని గురించి తీవ్రంగా విమర్శ చేయటం గమనించదగిన అంశం. అప్పటినుండి పార్టీలో ‘ఏకులా వచ్చి మేకులా’ తయారయ్యాడు.
ఎన్టీఆర్‌కు రాజకీయ అవగాహన లేకపోవటంతో పార్టీ బాధ్యతనంతా అతనికి అప్పజెప్పటంతో పార్టీ వ్యవహారాలే కాక ప్రభుత్వంలో కూడా రాజ్యాంగేతర శక్తిగా తయారయ్యాడు. దానికితోడు ఎన్టీఆర్ అతనిమీద ఉంచిన అపారమైన విశ్వాసంతో ఎవరు తనను కలిసినా ‘బాబును కలవండి’ అని చెప్పటంతో పార్టీలో, ప్రభుత్వంలో అతనికి హద్దు లేకుండా పోయింది. జూబ్లీహిల్స్‌లో 1,200 గజాలు కొని మంచి భవనం కట్టించాడు. ఆ గృహ ప్రవేశానికి ఎన్టీఆర్ గారిని కూడా ఆహ్వానించాడు. ఆ భవనం చూసి ఆశ్చర్యపోయిన ఎన్టీఆర్ ‘ఇంత డబ్బు నీకెక్కడిది? ఎలా కట్టించావు?’ అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడు.
చంద్రబాబు అవినీతి మీద ‘ఈనాడు’ పేపరు ప్రభుత్వాన్ని అనేకసార్లు హెచ్చరించింది. బ్లాటింగ్ పురుషోత్తం (మద్రాసు) వద్ద రెండున్నర కోట్లు ముడుపులు తీసుకున్న విషయం పార్టీలో, బయటా పెద్ద చర్చనీయాంశమైంది. అప్పటికి నష్టాల్లో నడుస్తున్న ‘విష్ణుప్రియ’ హోటల్‌ను సి.ఎం. బలరామిరెడ్డికి బలవంతంగా అంటకట్టి, కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అతనిని కడప జడ్పీ ఛైర్మన్గా చేశాడు. అదే విధంగా మూతపడివున్న భువనేశ్వరి కార్బైడ్ ఫ్యాక్టరీని రేణుకాచౌదరికి అంటగట్టి ఎన్టీఆర్‌ను బలవంతంగా ఒప్పించి రెండవసారి రాజ్యసభకు పంపించాడు.
1988లో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం సాలీనా వ్యవసాయంపై వచ్చే ఆదాయం 36,000 రూపాయలుగా చూపించాడు. వ్యవసాయ భూమి తప్ప తనకు వేరే ఆస్తిపాస్తులుగానీ, ఆదాయ మార్గాలుగానీ లేవని వెల్లడించాడు. అప్పుడు భార్య భువ నేశ్వరి ఆస్తి సుమారు 400 గ్రాముల బంగారం, 50,000 రూపాయల నగదు. తరువాత ఏ పదవిలో లేడు గనుక సంపాదించే అవకాశమే లేదు.
1989 ఎన్నికల్లో తన ఆదాయం 2,16,000, అగ్రికల్చర్ ఆదాయం 36,000గా చూపించాడు. 1992లో 14 కోట్ల 75 లక్షల పెట్టుబడి అంచనాలతో ‘హెరిటేజ్ గ్రూపు’ సంస్థను స్థాపించటం జరిగింది. దాని పెట్టుబడులకు కూడా పార్టీలో అసెంబ్లీ టిక్కెట్లు ఇప్పిస్తానని పార్టీ మనుషుల చేత లక్షల రూపాయల షేర్లు కొనిపించాడు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు లక్షల రూపాయల ముడుపులు తీసుకొని కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు అప్పజెప్పాడని నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి బహిరంగంగానే విమర్శించాడు.
నెల్లూరు జిల్లా బాలాయపల్లెలో 600 ఎకరాల్లో టేకు మొక్కలు నాటి వాటిని సొంతం చేసుకోవటమే కాకుండా, యానాం చుట్టుపక్కల బినామీ పేర్లతో కొన్ని వందల ఎకరాలు కొన్నాడని పార్టీ వాళ్ళే ఒకరికొకరు చెప్పుకున్న విషయం.
ఇక హెరిటేజ్ పబ్లిక్ ఇష్యూలలో ఆరున్నర కోట్ల రూపాయలు సమీకరించాడు. ఈ పరిశ్రమలో తనకు 76 లక్షల 15 వేల రూపాయల విలువ గల వాటాలున్నట్టు, భార్య భువనేశ్వరికి ఒక కోటి 21 లక్షల 31 వేల రూపాయల విలువైన వాటాలున్నట్టు, లోకేష్ పేర 3 లక్షల 15 వేల రూపాయల వాటాలు న్నట్టు 1994లో ప్రకటించాడు. అప్పటికే జూబ్లీహిల్స్‌లో ఒక భవనం, పంజాగుట్టలో ఒక భవనం ఉన్న విషయం గమనించాలి. ఏ పదవీ లేకుండా 1992 నాటికే అతని కుటుంబ ఆస్తులు పెరిగాయన్నది స్పష్టంగా తెలుస్తున్నది.
1995 ఆగస్టు నెలలో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పదవి నుండి దించేసి సెప్టెంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి అతని ఆస్తులు ఆకాశమే హద్దుగా పెరిగి పోవటం, దేశంలోనే నంబర్‌వన్ స్థాయి అవినీతి పరునిగా విమర్శలు రావడం జరిగింది. తెహల్కా డాట్‌కామ్ మొదలు అనేకమంది రాజకీయ నాయకులు, మీడియా అతని అవినీతిని ప్రశ్నించటం జరిగింది.
1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యిన దగ్గర్నుండి పారదర్శకత, నిజాయితీ గురించి ఎక్కువగా ఉపన్యాసాలివ్వడం ప్రారంభించాడు. శాసనసభలో ఎథిక్స్ కమిటీ ఏర్పాటుకు దోహదకారులైన తోటి శాసనసభ్యుల వలే తను కూడా తన ఆస్తిపాస్తుల వివరాలు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ప్రతి సంవత్సరం ప్రకటించడం మొదలు పెట్టాడు. అతని ప్రకటన ప్రకారం చంద్ర బాబు కుటుంబ ఆస్తుల విలువ 30 కోట్ల వరకు చేరింది.
ఆ ప్రకటనలో నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం ‘నిందలి గ్రామం’లో తన పేర 26.43 ఎకరాలు, భార్యకు 10.23 ఎకరాలు, కుమారునికి 9.32 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు ప్రకటించాడు. వివిధ కంపెనీలలో కుమారుడికి ఒక కోటి 67 లక్షల 15 వేల రూపాయల విలువగల వాటాలు, భార్య భువనేశ్వరి పేరున మొత్తం 3 కోట్ల 4 లక్షల 1 వేయి రూపాయల విలువ గలిగిన వాటాలు, తనకు ఒక కోటి 40 లక్షల 15 వేల 65 రూపాయల విలువ కలిగిన వాటాలు ఉన్నట్లు చెప్పాడు.
భవనాలు, వాహనాలు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు మొదలైన వివరాలు కూడా వెల్లడి చేశాడు. వాటి విలువను తక్కువగా చూపించడం గమనార్హం. 1994లో ప్రకటించిన హెరిటేజ్ డైరీ ప్రాస్పెక్టస్‌లో కూడా తనకు వేరే కంపెనీలతో లావాదేవీలు గానీ ఇత రత్రా ఆదాయ వనరులు గానీ లేనట్లు ప్రకటించి, కంపెనీల రిజి స్ట్రార్ సమక్షంలో అంతకుముందు తాను ఆర్థికపర, క్రిమినల్ నేరారోపణ లను ఎదుర్కొనలేదని పేర్కొన్నాడు. మరి 1988లో సాలీనా తన గరిష్ఠ ఆదాయం లక్షన్నర రూపాయలే అని చెప్పిన పెద్ద మనిషికి ఒక్క సారిగా ఇన్ని ఆస్తులు అకస్మాత్తుగా ఎలా పెరిగాయి? ఆనాటి ప్రశ్నకు ఈరోజు సీఐడీ కేసుల ద్వారా సమాధానం లభించింది.
చంద్రబాబు పేర్కొన్న ఆస్తిపాస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సిందిగా అప్పటి పీసీసీ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర రెడ్డిగారు డిమాండ్ చేయటం జరిగింది. అతడిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించాల్సిందిగా 1999 జూన్ 5న రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పలువురు కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర గవర్నర్‌కు ఒక విజ్ఞాపన పత్రం సమర్పించారు. నిజానికి 90 మంది శాసన సభ్యులకు నాయకుడైన రాజశేఖర రెడ్డి గారి విజ్ఞాపనకు గవర్నరు ప్రతిస్పందించటం కనీస ధర్మం. అప్పటికే ప్రతి వ్యవస్థను తనకు అనుకూలంగా మార్చుకోవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడయ్యాడు. గవర్నర్ మారు మాట్లాడలేదు.
గత్యంతరం లేని పరిస్థితిలో 1999 జూలై 12వ తేదీన హైకోర్టును ఆశ్రయించి ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేసేందుకు చట్టప్రకారం అవసరమైన అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్‌ను ఆదేశించాలని కోరారు. అందుకు హైకోర్టు 1999 నవంబర్ 2వ తేదీన ఒక సుదీర్ఘ తీర్పులో తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ దరఖాస్తును కొట్టేసింది. గవర్నర్ గారి పదవీ బాధ్యతల నిర్వహణ మీద సమీక్ష జరిపే అధికారం రాజ్యాంగం ప్రకారం కోర్టులకు ఉండదని ఆ జడ్జిమెంట్ సారాంశం.
హైకోర్టు తీర్పు మీద (నేడు టీడీపీ పార్టీలో ఉన్న) కన్నా లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ సీనియర్ లీడర్ ‘ఆమోస్’ గార్లు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు. అయినప్పటికీ సుప్రీంకోర్టు హైకోర్టులోనే తేల్చుకోమని ఆ కేసు కొట్టేసింది. దాని మీద వారు హైకోర్టులో ఏ కేసు వేసినప్పటికీ తమకు న్యాయం జరగట్లేదనీ, చంద్రబాబుకు అనుకూలంగా తీర్పులొస్తున్నాయనీ నివేదించినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం వినిపించుకోలేదు. అడ్వకేట్ జనరల్ రామచంద్ర రావు ఈ కేసును వాదిస్తూ, రాష్ట్ర హైకోర్టు మీద చంద్రబాబు నాయుడి ప్రభావం పనిచేస్తున్నదంటూ బ్రిటన్‌లోని ‘ససెక్స్’ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ జేమ్స్ మైనర్ ఇచ్చిన రిపోర్టును ప్రస్తావించినా బెంచ్ తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు.
డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి
వ్యాసకర్త ఆంధ్రపదేశ్ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్
No comments:
Post a Comment