fvz

Wednesday, June 05, 2024

The Greatest Overconfidence Leader of All Times!


ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లే భూమిక‌. నేల‌ని మ‌రిచి గాలిలో విహ‌రించేవాడు, బొక్క‌బోర్లా ప‌డ‌తాడు. జ‌గ‌న్‌కి జ‌రిగింది ఇదే. ప్ర‌జ‌ల్ని మ‌రిచిపోయారు. ప్ర‌జ‌లు ఆయ‌న్ని మ‌రిచిపోయారు. ఫ‌లితం ఘోర ఓట‌మి.

నిరంత‌రం ప్ర‌జ‌ల కోసం బ‌ట‌న్ నొక్కాడు క‌దా, మ‌రి ప్ర‌జ‌ల‌కి దూరం ఎందుక‌య్యాడు? ప‌థ‌కాలు మాత్ర‌మే ప్ర‌జ‌ల‌కి ద‌గ్గ‌ర చేయ‌వు. అదే నిజ‌మైతే జ‌గ‌న్‌కి క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా అయినా ద‌క్కేది. ఉత్త‌రాంధ్ర నుంచి రాయ‌ల‌సీమ వ‌ర‌కూ ఎందుకు తిర‌స్క‌రించారు? జ‌గ‌న్‌ని జ‌నం వ‌ద్దూ అని ఏక వాక్యంతో తీర్మానించారు. ఎందుకంటే గ‌తంలోలా ఆయ‌న ప్ర‌జ‌ల మ‌నిషి కాదు. జ‌నానికి భిక్షం వేసి ప‌బ్బం గ‌డుపుకోవాల‌నుకుంటున్న నాయ‌కుడ‌ని గ్ర‌హించారు. త‌న‌ని తాను చ‌క్ర‌వ‌ర్తిలా ఊహించుకుని తాడేప‌ల్లి రాజ‌భ‌వ‌నంలో విశ్రాంతి తీసుకునే ప‌లాయ‌న‌వాది అని అర్థం చేసుకున్నారు. అందుకే ప‌థ‌కాల ల‌బ్ధిదారులు కూడా వెంట లేకుండా పోయారు.

అస‌లు జ‌గ‌న్ బ‌లం ఏంటి? అంద‌రూ అనుకున్న‌ట్టు వైఎస్ వార‌స‌త్వం కాదు. అదే నిజ‌మైతే ష‌ర్మిల‌కి క‌నీసం డిపాజిట్ ద‌క్కేది. వార‌సుడిగా రంగంలోకి వ‌చ్చిన ఆయ‌న్ని వైఎస్ కుమారుడిగా మాత్ర‌మే గుర్తించ‌లేదు. సోనియాని ఎదుర్కొన్న ధైర్య‌శాలిగా మాత్ర‌మే ప‌రిగ‌ణించ‌లేదు. సామాన్య జ‌నంలో తిరిగే ఒక మంచి నాయ‌కుడు, పేద జ‌నాన్ని అక్కున చేర్చుకునే మాన‌వ‌తా వాది అని జ‌నం న‌మ్మారు. దీనికి నిద‌ర్శ‌నంగా 2009 నుంచి 19 వ‌ర‌కూ రోడ్ల మీదే ఉన్నారు. పాద‌యాత్ర‌లో తిరిగారు. జ‌గ‌న్ ప‌థ‌కాల కంటే, జ‌గ‌న్ త‌మ మ‌నిషి, క‌ష్టం చెప్పుకుంటే తీరుస్తాడ‌ని విశ్వ‌సించారు. దీని ఫ‌లిత‌మే అఖండ విజ‌యం.

అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే జ‌గ‌న్ తండ్రిలాగా ప్ర‌జాద‌ర్బార్ పెట్టి వుంటే జ‌నం క‌ష్ట‌సుఖాలు విని వుంటే క‌థ వేరే వుండేది. 23 సీట్ల‌తో ఓట‌మి ప‌రాభ‌వంతో ఉన్న చంద్ర‌బాబుని, తెలుగుదేశం పార్టీని దూషించ‌డం, ఎగ‌తాళి చేయ‌డంతో ప్రారంభ‌మ‌య్యాడు. జ‌గ‌న్‌ని ఆరాధిస్తున్న వారు కూడా ప్ర‌జావేదిక కూల్చివేత చూసి నివ్వెర‌పోయారు. అది ప్ర‌భుత్వ ధ‌నం. అక్ర‌మ క‌ట్ట‌డం పేరుతో కూల్చేసే హ‌క్కు లేదు. అదే నిజ‌మైతే రాష్ట్రంలో ఉన్న అక్ర‌మ క‌ట్ట‌డాల‌న్నీ కూల్చేసి వుండాలి. కూల్చారా? లేదు క‌దా!

అన్నిటికంటే పెద్ద త‌ప్పు, పేద ప్ర‌జ‌లు ఈస‌డించుకున్న‌ది అన్నా క్యాంటీన్ మూసివేత‌. అన్నా అనే పేరు ఇష్టం లేక‌పోతే వైఎస్ లేదా జ‌గ‌న్ క్యాంటీన్ అని పెట్టుకుంటే ఎవ‌ర‌డ్డు చెబుతారు? పేద‌వాళ్ల‌కి నాణ్యంగా పెడుతున్న భోజ‌నాన్ని అకార‌ణంగా దూరం చేసి జ‌నానికి ఇంకో అడుగు దూరం జ‌రిగాడు.

పేద ప్ర‌జ‌లు తాగే మ‌ద్యం జోలికెళ్ల‌డం ఇంకో త‌ప్పు. మ‌ద్యం సిండికేట్ల‌ని రూపుమాపాల‌నుకుంటే క‌రెక్టే. కానీ జ‌రిగింది వేరు. నాణ్య‌త లేని మ‌ద్యం అధిక రేట్ల‌తో వ‌చ్చింది. ధ‌ర‌లు పెంచితే మందు మానేస్తారా?

ఇసుక దొర‌క్క భ‌వ‌న నిర్మాణ కార్మికులు హాహాకారాలు చేస్తూ వుంటే ఒక్క రోజైనా జ‌గ‌న్ జ‌నం ముందుకొచ్చి గోడు విన్నాడా? క్షేత్ర‌స్థాయి స‌మ‌స్య‌లు అర్థం చేసుకుని ప‌రిష్కారం దిశ‌గా పూనుకున్నాడా?

తాడేప‌ల్లి నుంచి బ‌య‌టికి రాడు. వ‌స్తే జ‌నానికి అష్ట‌క‌ష్టాలు. షాపులు మూయించారు. చెట్లు న‌రికారు. ప‌ర‌దాలు క‌ట్టారు. పోలీసుల్ని ఎంత ద‌గ్గ‌ర పెట్టుకుంటే, జ‌నం అంత దూరం అవుతారు. చిన్న లాజిక్‌, జ‌గ‌న్‌కి చెప్పేవాళ్లు లేరు. చెప్పినా వినే ప‌రిస్థితి లేదు.

ఒక ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల సొమ్ముని వేల కోట్లు ఖ‌ర్చు పెడితే, త‌ర్వాత వ‌చ్చే ప్ర‌భుత్వం ఆ నిర్ణ‌యాన్ని గౌర‌వించి డ‌బ్బు వృథా కాకుండా చూడాలి. ఎందుకంటే ప్ర‌జ‌ల సొమ్ముకి జ‌వాబుదారీగా వుంటార‌ని మిమ్మ‌ల్ని ఎన్నుకుంటారు. కానీ జ‌గ‌న్ అమ‌రావ‌తిని పాడు పెట్టాడు. కోర్టుల‌కి కోట్ల రూపాయ‌లు త‌గ‌ల‌బెట్టి, అమ‌రావ‌తి బాధితుల్ని భిక్ష‌గాళ్ల‌ని చేసి ఊరూరా తిప్పాడు.

ఒక భ్ర‌మ‌లో మునిగిన‌ప్పుడు వాస్త‌వం త‌ల‌కెక్క‌దు. ఒక్కో వ‌ర్గాన్ని తెలివి త‌క్కువ‌గా దూరం చేసుకుంటూ వ‌చ్చిన జ‌గ‌న్‌, త‌న వెంట మైనార్టీలు, మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీలు ఉన్నార‌ని భ్ర‌మ‌కి గుర‌య్యారు. వాళ్లంతా కూడా మొద‌ట ప్ర‌జ‌లు, త‌ర్వాతే వ‌ర్గాలు.

జ‌గ‌న్ పుట్టుక‌తో చ‌క్ర‌వ‌ర్తి కాదు. ప‌ల్ల‌వులో, కాక‌తీయులో, చోళుల రాజ‌వంశం కాదు. ఆయ‌న తాత ముత్తాత‌లు సాధార‌ణ రైతులు. ప్ర‌జాస్వామ్యం అనే బ‌ల‌మైన వ్య‌వ‌స్థ‌తో ముఖ్య‌మంత్రి అయ్యారు. దాన్ని గౌర‌వించ‌ని వాళ్లు నేల‌కు విసిరి ప‌డ‌తారు.

ఎవ‌రైతే త‌న వెంట సైన్యంలా నిలిచారో, ఎవ‌రు జేజేలు కొట్టారో, ఏ నాయ‌కులైతే క‌ష్టాలకు ఓర్చి జ‌గ‌న్‌ని భుజాల మీద ఎత్తుకున్నారో అంద‌ర్నీ మరిచి తాడేప‌ల్లి నాలుగు గోడ‌ల మ‌ధ్య పాల‌న సాగించిన జ‌గ‌న్‌ని అంద‌రూ క‌లిసి ఇంటికే ప‌రిమితం చేశారు. ఇపుడు ఆయ‌న బ‌య‌టికొచ్చినా ఎవ‌రికీ అవ‌స‌రం లేదు. ప్ర‌జ‌ల‌కి అవ‌స‌రం అయిన‌ప్పుడు దూర‌మై, ఆయ‌న‌కి అవ‌స‌ర‌మై ద‌గ్గ‌ర అవుతానంటే జ‌నం అంత తేలిగ్గా అంగీక‌రించ‌రు.

దూరమైన అగ్రవర్ణాలు

ప్రధానంగా కమ్మ వర్గాన్ని జగన్ పూర్తిగా దూరం చేసుకున్నారు. ఎంత దూరం చేసుకున్నారు అంటే ఆయన వెనుక వున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి లాంటి నాయకుల ఇళ్లలో ఓట్లు కూడా వైకాపాకు పడి వుంటాయా? అంటే సందేహమే. ప్రపంచ వ్యాప్తంగా వున్న కమ్మ సామాజిక వర్గం అంతా ఒక్కటిగా మారింది. రామోజీ మీద కేసు, చంద్రబాబు అరెస్ట్ ఇవన్నీ మరింత ప్రేరేపించాయి. కమ్మవారు ఎవరికి వారు వారి వారి పరిథి మేరకు ప్రభుత్వం మీద ఎంతలా విరుచుకు పడాలో అంతా పడ్డారు. మెయిన్ స్ట్రిమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు. కమ్మవారంతా జగన్ కు ఎంత డ్యామేజ్ చేయాలో, ఎంత చేయించగలరో అంతా జరిగింది.

రఘురామకృష్ణం రాజు ఉదంతంతో క్షత్రియులు దూరం అయ్యారు. అశోక్ గజపతి, సింహాచలం దేవస్థానం ఉదంతం మరింత దూరం చేసింది. దీన్ని ఆసరాగా తెలుగుదేశం క్షత్రియులకు చెప్పుకోదగ్గ సీట్లు కేటాయంచింది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో క్షత్రియులంతా సాలిడ్ గా తెలుగుదేశం కూటమి వెనుక నిలబడ్డారు.

బ్రాహ్మణులు, వైశ్యుల విషయంలో జగన్ ఏ అన్యాయం చేయలేదు కానీ, భాజపా కారణంగా వారు కూటమి వైపు మొగ్గారు. క్రిస్టియన్ అనే ప్రచారం, కొన్ని చోట్ల హిందూ విగ్రహాలపై దాడులు అన్నీ కలిసి జగన్ ఖాతాను ఎంత తగ్గించాలో అంతా తగ్గించాయి.

రెడ్లు కూడా జగన్ తో సంతృప్తిగా లేరు. అధికారులు, కొంతమంది నాయకులకు పదవులు అందాయి. కానీ అలా అని చెప్పి, రెడ్లకు ఏమంతా అవకాశాలు కుప్పలుగా రాలేదు. జగన్ చుట్టూ వున్న కొంత మంది రెడ్లు మాత్రమే లాభపడ్డారు. తొలిసారి పల్నాడు ప్రాంతంలో సైతం రెడ్లు తమ పార్టీని కాదని కూటమికి ఓట్లు వేసారు.

ఇక మిగిలింది బిసి లు, ఎస్ సి, ఎస్టీ, మైనారిటీలు. వీళ్ల ఓట్లు యాభై నుంచి 70 శాతం జగన్ గు వచ్చాయి. అయితే కూటమి కలివిడిగా పోటీ చేయడంతో ఫలితం లేకపోయింది.

కూటమి నేత చంద్రబఆబు అందుకు భిన్నంగా వ్యవహరించారు. కమ్మ ఓట్లు ఎలాగూ వస్తాయని తెలుసు. కాపు ఓట్ల కోసం పవన్ ను ఎంత బుజ్జగించాలో, ఎంత గౌరవం ఇవ్వాలో, ఎంత వాడుకోవాలో అంతా చేసారు. అలాగే మిగిలిన వర్ణాలను, వర్గాలను చాలా పద్దతిగా లెక్కలు కట్టి మరీ దగ్గరకు వచ్చేలా చూసుకున్నారు.

జ‌గ‌న్ చుట్టూ ప‌నికిమాలిన అధికారులు, కోట‌రీ

జ‌గ‌న్‌కు ఏదైనా చెబితే, ఆయ‌న గుడ్డి విశ్వాసం, న‌మ్మ‌కంతో ధ‌నుంజ‌య‌రెడ్డిని పిలిచి చెప్పేవాడ‌న్నారు. ధ‌నుంజ‌య‌రెడ్డి చేతిలోకి ఏ కాగితం వెళ్లినా అంతే సంగ‌తుల‌న్నారు. ఒక‌ట్రెండు కాదు, వంద‌ల స‌మ‌స్య‌లు చెప్పొచ్చ‌న్నారు. కొత్త‌గా గెల‌వ‌డంతో ఏదైనా చేయాల‌నే త‌ప‌న‌తో అధికారుల ద‌గ్గ‌ర‌కు వెళితే, స‌రైన స్పంద‌న ల‌భించేది కాద‌ని జ‌క్కంపూడి రాజా ఆవేద‌న చెందారు. తండ్రికి మించి ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేయాల‌ని జ‌గ‌న్ త‌ప‌న ప‌డే వార‌న్నారు. తాను మంచి చేసి వుంటేనే ఓటు వేయండి అని అడిగిన ఏకైక ద‌మ్మున్న సీఎం జ‌గ‌న్ అని ఆయ‌న అన్నారు. జ‌గ‌న్ గెలిచినా, ఓడినా రియ‌ల్ హీరో అన్నారాయ‌న‌.

జ‌గ‌న్ చుట్టూ ఉన్న కోట‌రీ, ప‌నికిమాలిన కొంత మంది అధికారులు క‌లిసి వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని జ‌క్కంపూడి రాజా సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. జ‌గ‌న్‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని ఆరోపించారు. జ‌గ‌న్‌ను ఒక ట్రాన్స్‌లో పెట్టే ప్ర‌య‌త్నం చేశార‌ని రాజా ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

భ‌జ‌న, భ‌జ‌న, భ‌జ‌న..

జ‌గ‌న్  భ‌జ‌న బ్యాచ్‌తో త‌న్మయుడై వాళ్ల మాట‌లు, నివేదిక‌లు, గ‌ణాంకాలు న‌మ్మి మునిగిపోయాడు. కోళ్ల గుంపులాంటి స‌ల‌హాదారుల‌ను పెట్టుకుని వాస్త‌వాల్ని గుర్తించ‌లేక‌పోయాడు. ఒక్క స‌ల‌హాదారుడు కూడా పార్టీ గోదారిలో క‌లిసిపోతూ వుంద‌ని క‌నిపెట్ట‌లేక‌పోయారు.

తిట్లు, శాప‌నార్థాలు, వల్గారిటీతో తెలుగుదేశాన్ని జ‌యిస్తున్నామ‌ని అనుకున్నారు. కానీ జ‌నం ఏవ‌గించుకుంటున్నార‌ని క‌నిపెట్ట‌లేకపోయారు. పార్టీకి ఎవ‌రు హానిక‌ర‌మో వాళ్లంద‌రినీ అక్కున చేర్చుకున్నాడు. జ‌గ‌న్‌ని గుండెల్లో పెట్టుకున్న కార్య‌క‌ర్త‌ల్ని విసిరికొట్టారు. సోష‌ల్ మీడియాలో యుద్ధం చేసిన వాళ్ల‌ని క‌రివేపాకుల్లాగా తీసి పారేశారు.

సాక్షిలో రాత‌గాళ్ల‌ని కాకుండా, మోత‌గాళ్ల‌కి పెద్ద‌పీట వేశారు. విద్వ‌త్తు ఉన్న వాళ్ల‌ని ప‌క్క‌న పెట్టి డోలు విద్వాంసుల్ని చేర‌దీశారు. చేవ‌ని మ‌రిచి చెక్క భ‌జ‌న‌ని వీనుల విందుగా విన్నారు. ఈ చిడత‌ల బ్యాచ్ పార్టీకి పిడ‌క‌లు కొట్టారు. పార్టీ కోసం, ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసే ఎమ్మెల్యేల‌కి కూడా జ‌గ‌న్ ద‌ర్శ‌నం ద‌క్క‌కుండా చేశారు. కార్య‌క‌ర్త‌లుంటేనే ఎమ్మెల్యే. ఎమ్మెల్యేలు వుంటేనే ముఖ్య‌మంత్రి. ప్ర‌జ‌లుంటేనే వీళ్లంతా. ఈ అంచెల వారీ విధానాన్ని విస్మ‌రించి తానే దేవుడ‌నుకున్నాడు జ‌గ‌న్‌. చుట్టూ వున్న పూజారులు స్త్రోత్రాలు పాడి పార్టీని శాశ్వ‌తంగా ప‌వ‌ళింపు సేవ‌కి ప‌రిమితం చేశారు. కాకారాయుళ్లైన ఎమ్మెల్యే, ఎంపీల‌ను న‌మ్మి, పార్టీలోని కాక‌లుతీరిన యోధుల్ని కూడా దూరం పెట్టారు.

ఈ ఐదేళ్ల‌లో జ‌గ‌న్ ఏమీ సాధించ‌లేదా? అంటే సాధించాడు. మీడియా మొహం చూడ‌ని తొలి ముఖ్య‌మంత్రి, ల‌క్ష‌ల కోట్ల అప్పు, బ‌ట‌న్ ద్వారా పంపిణీ, ఛీప్ లిక్క‌ర్ తాగేవాళ్లంద‌రికీ ప్రెసిడెంట్ మెడ‌ల్‌, బూతుల మంత్రుల‌కి భుజ‌కీర్తులు, ఇసుక మాఫియా, భ‌జ‌న చేసిన వాళ్ల‌కి చేసినంత ప్ర‌సాదం. ఇదంతా పాల‌న అని ఆయ‌న అనుకున్నాడు. జ‌నం అనుకోలేదు. 

స‌జ్జ‌ల భార్గ‌వ్ 'షో'ష‌ల్ మీడియా

సోష‌ల్ మీడియా గురించి బాగా తెలిసిన వ్య‌క్తుల చేత‌ల్లో పెడుతుంటారు. కానీ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రూటే స‌ప‌రేట్‌. త‌న‌కు బాగా తెలిసిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కుమారుడు స‌జ్జ‌ల భార్గ‌వ్‌కు త‌న పార్టీ సోష‌ల్ మీడియాను అప్ప‌గించారు. స‌జ్జ‌ల భార్గ‌వ్‌కు సోష‌ల్ మీడియా గురించి అద్భుత‌మైన ప‌రిజ్ఞానం వుంటే ...జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించొచ్చు. కానీ ఫేస్‌బుక్‌లో, ట్విట‌ర్‌లో క‌నీసం ఖాతా కూడా లేని స‌జ్జ‌ల భార్గ‌వ్‌కు సోష‌ల్ మీడియా బాధ్య‌త‌లు అప్ప‌గించారంటే ఏమ‌నుకోవాలి?

రెండేళ్ల క్రితం భార్గ‌వ్‌కు వైసీపీ సోష‌ల్ మీడియా బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్న ఆయ‌న‌కు తోడుగా చ‌ల్లా మ‌ధు, ర‌త్నాక‌ర్‌ను నియ‌మించారు. అయినా వాళ్ల‌తో క‌లిసి భార్గ‌వ్ చేసింది ఏమైనా వుందా? అంటే... ఏమీ లేద‌నే స‌మాధానం వ‌స్తోంది. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో భార్గ‌వ్ ఇత‌ర సోష‌ల్ మీడియా చాన‌ళ్లు, ప్ర‌తినిధుల‌ను ఏ మేర‌కు వైసీపీ కోసం ప‌ని చేసేలా చ‌క్రం తిప్పారంటే... దానికీ స‌మాధానం నిల్‌.

చంద్ర‌బాబు మ‌నిషిగా గుర్తింపు పొందిన ఒక మ‌హిళా యాంక‌ర్‌కు కోట్లాది రూపాయ‌లు ముట్ట‌చెప్పి, హ‌మ్మ‌య్య ఇంత‌టితో త‌న బాధ్య‌త తీరింద‌ని భార్గ‌వ్ రిలాక్ష్ అయ్యారు. స‌ద‌రు యాంక‌ర‌మ్మ త‌న‌కు తోచిన‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌తో ఇంట‌ర్వ్యూలు చేసి, కొంత మందితో చేయించి.... ఎన్నిక‌ల్లో మ‌మ అనిపించారు. కోట్లాది రూపాయ‌ల్ని సొంతం చేసుకున్నారు. ఇదే వైసీపీ గెలుపు కోసం తాపత్ర‌య ప‌డి త‌మ‌కు తోచిన రీతిలో స్వ‌చ్ఛందంగా ప‌ని చేసే వాళ్ల‌ను భార్గ‌వ్ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు.

భార్గ‌వ్ ప‌ట్టించుకున్న‌దల్లా గోడ మీద పిల్లి లాంటి జ‌ర్న‌లిస్టుల‌ను. ఒక‌వైపు ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌క ముందే, కూట‌మి భ‌జ‌న మొద‌లు పెట్టిన సోష‌ల్ మీడియా ప్ర‌భావ‌శీల జ‌ర్న‌లిస్టుల‌ను గ‌మ‌నిస్తే... వారంతా భార్గ‌వ్ డ‌బ్బులిచ్చి పెంచి పోషించిన వ్య‌క్తులే కావ‌డం గ‌మ‌నార్హం.

ఎన్నిక‌ల్లో వైసీపీపై వ్య‌తిరేక‌త పెంచే అంశాల్ని గుర్తించి, వాటిని సోష‌ల్ మీడియా వేదిక‌గా తిప్పి కొట్ట‌డంలో భార్గ‌వ్ నాయ‌క‌త్వం పూర్తిగా విఫ‌ల‌మైంది. ఉదాహ‌ర‌ణ‌కు ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై టీడీపీ, జ‌న‌సేన విస్తృతంగా దుష్ప్ర‌చారం చేశాయి. కానీ వాటిని తిప్పి కొట్ట‌డానికి వైసీపీ సోష‌ల్ మీడియా చేసిన ప్ర‌య‌త్నం చాలా స్వ‌ల్పం. మ‌రి వైసీపీ సోష‌ల్ మీడియాను అడ్డు పెట్టుకుని భార్గ‌వ్ ఏం చేశార‌య్యా అంటే... ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూస్తున్నాయి.

త‌న తండ్రి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, అలాగే త‌న‌పై ప్ర‌త్య‌ర్థులు, లేదా సొంత పార్టీకి చెందిన వారెవ‌రైనా విమ‌ర్శ‌లు చేస్తే, పార్టీ సోష‌ల్ మీడియా సైన్యంతో తీవ్ర ఎదురు దాడి చేయ‌డానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట విన‌ని సొంత పార్టీ నాయ‌కుల్ని జ‌గ‌న్‌ను క‌ల‌వ‌నీయ‌కుండా చేసేవారు. అలాగే అలాంటి వాళ్లపై ఏదో ఒక సాకుతో కేసులు న‌మోదు చేయించి చిత్ర‌హింస‌లు పెట్టించే వారు. ఇందుకు నిలువెత్తు ఉదాహ‌ర‌ణ పిన్నెల్లి సోద‌రులే. ప‌ల్నాడులో మాచ‌ర్ల అంటే గిట్ట‌ని ఏఎస్పీకి పోస్టింగ్ వేయించి, ముప్పుతిప్ప‌లు పెట్టించార‌నే ప్ర‌చారం వుంది. ఇంకో ప్ర‌చారం కూడా ఏంటంటే...సొంత పార్టీ నేత‌ల‌పై ఎల్లో మీడియాలో వార్త‌లు రాయించ‌డం వెనుక స‌జ్జ‌ల మార్క్ వుంద‌ని వైసీపీలో ఓ చ‌ర్చ వుంది. జ‌గ‌న్ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌కు పోయాయి. స‌జ్జ‌ల కుటుంబ గౌర‌వ‌, ప్ర‌తిష్టల‌కే సోష‌ల్ మీడియాలో భార్గ‌వ్ పెద్ద‌పీట వేశార‌నే విమ‌ర్శ వుంది.

సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌ర్థుల దుష్ప్ర‌చారంపై తిప్పి కొట్ట‌డానికి కావాల్సినంత కంటెంట్ ఉన్న‌ప్ప‌టికీ, స‌రైన రీతిలో ఉప‌యోగించ‌డంలో భార్గ‌వ్ పూర్తిగా విఫ‌ల‌మయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎవ‌రినైనా డ‌బ్బుతో నోళ్లు మూయించొచ్చ‌నే ధ్యాస త‌ప్ప‌, వైసీపీ గ్రాఫ్ పెంచే ప‌ని చేయ‌డంపై దృష్టి సారించ‌లేద‌న్న అభిప్రాయం వుంది. వైసీపీ అధికారంలో ఉండ‌డం, సోష‌ల్ మీడియాకు భారీ బ‌డ్జెట్ కేటాయించ‌డం అంద‌రికీ తెలిసిందే. మ‌రి ఈ డ‌బ్బంతా ఎవ‌రికిచ్చారు? ఎందుకిచ్చారు? ఏం చేశార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

వైసీపీ మండ‌ల‌, తాలూకా, జిల్లా సోష‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌కు కూడా భార్గ‌వ్ రూపాయి కూడా ఇచ్చిన దాఖ‌లాలు లేవ‌ని చెబుతున్నారు. మ‌నోడు క‌దా అని స‌జ్జ‌ల భార్గ‌వ్‌కు సోష‌ల్ మీడియా బాధ్య‌త‌ల్ని అప్ప‌గిస్తే, ఆ యువ నాయ‌కుడు మాత్రం పార్టీ కోసం కాకుండా, ఇత‌ర‌త్రా ఎక్కువ ఉప‌యోగించారని సంబంధిత యాక్టివిస్టులు చెబుతున్నారు. వైసీపీ ఘోర ప‌రాజ‌యంలో తిలా పాపం త‌లా పిడికెడు అన్న‌ట్టు... సోష‌ల్ మీడియా హెడ్ భార్గ‌వ్ పాత్ర కూడా వుంద‌ని మెజార్టీ అభిప్రాయం. రెండేళ్ల పాటు స‌జ్జ‌ల భార్గ‌వ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏదో చేస్తున్న‌ట్టు జ‌గ‌న్‌కు "షో" చూపించారు. జ‌గ‌న్ ప‌రిస్థితి చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చంద‌మ‌వుతోంది.

సోష‌ల్ మీడియా పేరుతో భారీగా ఆర్థిక ప్ర‌యోజ‌నాలు పొందిన స‌జ్జ‌ల భార్గ‌వ్ కుటుంబం బాగుంది. ఇప్పుడు అధికారం పోగొట్టుకుని వీధిన‌ప‌డ్డ‌ది జ‌గ‌న్‌, ఆయ‌న్ను న‌మ్ముకున్నోళ్లే.

వైసీపీ ఓటమికి కారణాలు!

- జగన్ మోహన్ రెడ్డి ఒంటెత్తు పోకడలు
- సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించటం
- ఎమ్మెల్యేల‌ను, నేతలను జగన్ పట్టించుకోకపోవటం
- వైసీపీ ఎమ్మెల్యేలు కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోపోవటం, ఎదగనీయక పోవటం
- అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎమ్మెల్యేలు, వారి అనుచ‌రులు ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.అవినీతి, దోపిడీకి తెగబడటం.
- ఉద్యోగులపై అనుచిత వైఖరి
- అభ్యర్థులను ఇష్టమొచ్చినట్లు మార్చటం
- కొందరు మంత్రుల నోటి దురుసు
- మద్యం విధానంలో నిజాయితీ లోపించటం
- రాజకీయాలలో మిత్రుల అవసరాన్ని తక్కువగా అంచనా వేయటం
- టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కలయిక ప్రభావాన్ని అంచనా వేయకపోవటం
-ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్య‌క్తిగ‌త జీవితాన్ని ప్ర‌ధానంగా జ‌గ‌న్ ప‌దేప‌దే కించప‌రిచేలా మాట్లాడ్డం. కాపు, బ‌లిజ సామాజిక వ‌ర్గీయులు త‌మ‌ను అవ‌మానిస్తున్నార‌ని భావించ‌డం
- స్థానిక ఎన్నికల్లో అధికార బలంతో ఏకగ్రీవాలు చేసుకోవటం
- జగన్ తన సొంత కుటుంబంలోని సమస్యలనూ పరిష్కరించుకోకపోవటం
-ష‌ర్మిల‌కు మ‌ద్ద‌తుగా విజ‌య‌మ్మ వీడియో విడుద‌ల చేయ‌డం. సొంత త‌ల్లే జ‌గ‌న్‌కు అండ‌గా లేద‌నే సంకేతాలు వెళ్ల‌డం
- నాయకుల కంటే వాలంటీర్ల వ్యవస్థ మీదే  పూర్తిగా ఆధారపడటం
- భూముల పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకోవటం
- భూముల సర్వే వల్ల  రైతుల్లో ఏర్పడిన భయం
-ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో భూముల్ని వైసీపీ నేత‌లు లాక్కుంటార‌నే ప్ర‌త్య‌ర్థుల ఆరోప‌ణ‌లకు బ‌లం ఇచ్చేలా వైసీపీ స‌ర్కార్ ప్ర‌వ‌ర్తించ‌డం
- సొంత సామాజిక వర్గంలో జగన్ మీద కోపం
- అర్హ‌త లేని వారినే జ‌గ‌న్ అంద‌లం ఎక్కించ‌డం
-భ‌జ‌న‌ప‌రులైతే చాలు... జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టుకుంటార‌నే అభిప్రాయం వైసీపీ నేత‌ల్లో క‌ల‌గ‌డం
-ప్ర‌తిదానికీ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని మీడియా ముందుకు పంప‌డం. అలాంట‌ప్పుడు సీఎంగా జ‌గ‌న్ ఎందుకనే అస‌హ‌నం ప్ర‌జ‌ల్లో క‌ల‌గ‌డం
-ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా వైసీపీ మేనిఫెస్టో లేక‌పోవ‌డం

ఇక అభివృద్ధి, రాజ‌ధాని అంశంలో జ‌గ‌న్ త‌న అభిప్రాయాలు ఏవైనా, త‌ను చేసింది ఏదైనా.. దాన్ని పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేసుకోవ‌డంలో దారుణంగా విఫ‌లం అయ్యాడు! మూడు రాజ‌ధానుల ఫార్ములా ఏ ఒక్క ప్రాంతాన్నీ ఆక‌ట్టుకోలేక‌పోయిందని ఫ‌లితాల‌తో పూర్తిగా రుజువు అయ్యింది. అమ‌రావ‌తి రూపంలో చంద్ర‌బాబు ఎన్ని అక్ర‌మాల‌కు పాల్ప‌డి ఉన్నా.. ఫ‌ర్వాలేద‌నే ప్ర‌జ‌లు అనుకున్నారు కానీ, రాజ‌ధాని అంటూ ఒక‌టి ఉండాల‌నే తీరునే వారు వ్య‌క్త ప‌రిచారు, ఇది ఓట‌మి త‌ర్వాత కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోలేక‌పోయింది. అలాగే రోడ్ల విష‌యంలో ప‌చ్చ‌బ్యాచ్ చేసిన యాగీని నియంత్రించ‌లేక‌పోయింది. ఆఖ‌రి వ‌ర‌కూ చిన్న చిన్న రిపేర్ల‌ను కూడా పెండింగ్ లో పెట్టి.. సోష‌ల్ మీడియా ప్ర‌చారాల‌ను న‌మ్మే వాళ్ల చేతిలో ఎదురుదెబ్బ‌లు ఎదుర్కొంది. 

చంద్ర‌బాబు చేసిందీ అప్పులే, జ‌గ‌న్ చేసిందీ అప్పులే.. అయితే చంద్ర‌బాబు అప్పులు చేసి నీరుచెట్టు అంటూ ప‌ప్పు బెల్లాలు పంచినా మ‌ళ్లీ అలాంటి హామీలే ఇవ్వ‌గ‌లుగుతున్నారు! జ‌గ‌న్ మాత్రం అప్పుల విష‌యంలో మాత్రం విప‌రీత‌మైన నెగిటివ్ ప‌బ్లిసిటీ జ‌రిగింది. ఇదీ కూడా తీవ్ర‌మైన న‌ష్టాన్నే క‌లిగించింది.

తన తండ్రికంటే గొప్పగా సంక్షేమం చేసానని జగన్ అనుకుని ఉండొచ్చు. ఆయన అనుకున్నా అనుకోకపోయినా ఆయన అనుచరులు మాత్రం అంటూ ఉంటారు. కానీ జగన్ తన తండ్రి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 

- సంక్షేమం, అభివృద్ధి- రెండింటినీ బ్యాలెన్స్ చేయడం. 
- అగ్రకులాలు, ఇతర కులాలు అనే తేడా లేకుండా అందరి మనసుని గెలుచుకునేలా వ్యవహరించడం
- రాజకీయంగా వెన్నుదన్నుగా ఉండే సొంత వర్గానికి చెందిన రాజకీయనాయకులు, ఎన్నారైలు, హై నెట్ వర్త్ పీపుల్..ఇలా అందరినీ దగ్గరగా పెట్టుకోవడం. 
- రాజకీయ ప్రత్యర్ధులతో ఛలోక్తులు, సున్నితమైన సెటైర్లు తప్ప కఠిన మాటలతో బాధపెట్టకుండా ఉండడం. ఒకవేళ అలా సొంత పార్టీ వాళ్లు ఎవరైనా వ్యవహరిస్తే వారిని మందలించడం.
- వయసుకి గౌరవమిస్తూ రాజకీయ ప్రత్యర్థులని సంబోధించడం. 

లెక్క‌లేన‌న్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను పెట్టినా, ప్ర‌జ‌ల‌కే డైరెక్టుగా ప‌థ‌కాల ల‌బ్ధి క‌లిగే ఏర్పాటు చేసినా, వాటిపై అతి విశ్వాసంతో, న‌ష్టం క‌లుగుతున్న విష‌యాల‌ను పూర్తిగా లైట్ తీసుకుని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ ప‌రాజ‌యాన్ని ఎదుర్కొంది. త‌న పాల‌న లో మంచి జ‌రిగి ఉంటేనే త‌న‌కు ఓటేయాల‌ని జ‌గ‌న్ బాహాటంగా చెప్పాడు, ఆయ‌న పార్టీ ఎంత ఓట్ల శాతాన్ని పొందినా, చిత్తుగా ఓట‌మి పాలైంది! కాబ‌ట్టి.. జ‌గ‌న్ పాల‌న న‌చ్చ‌లేదంతే! 

కర్ణుడి చావుకి వెయ్యి కారణాలంటారు..కానీ ఇక్కడ కోట్లాదిమంది అభిమానుల ఆశలకి పాతరేసింది మాత్రం ఒకే ఒక్కడు... దట్ ఇస్ ...

Monday, May 13, 2024

Andhra Pradesh At A Glance

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖచిత్రం










ఆంధ్రులు అత్యంత ప్రాచీనులు. క్రీ.పూ.1000 ఏళ్ల నాటి ఐతరేయ బ్రాహ్మణంలో, రామాయణ, మహాభారతాల్లో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. మహాభారతం ప్రకారం పాండవుల్లో ఒకడైన సహ దేవుడు ఆంధ్ర ప్రాంతాన్ని జయించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన పోరాడినట్లు తెలుస్తోంది. రామాయణంలో సీతాన్వేషణ సమయంలో రాముడు జటాయువు అనే పక్షితో సంభాషించినట్లు, లే పక్షీ అనేది నేటి లేపాక్షి (అనంతపురం) అయినట్లు జనశృతిలో కథనం ఉంది.


ఆంధ్రులు ద్రావిడులైనా ఆర్య సంస్కృతి లక్షణాలు అధికం. అగస్త్యుడు ఆర్య సంస్కృతిని దక్షిణానికి వ్యాపింపజేశాడు. గ్రీకు రాయబారి మెగస్తనీస్‌ తన ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు 30 దుర్గాలున్నాయని పేర్కొన్నాడు. అశోకుడి శిలాశాసనాల్లో ఆంధ్రుల ప్రసక్తి ఉంది. వాటిలో 13వ, ఎర్రగుడిపాడు, రాజులమందగిరి శిలా శాసనాలు ప్రముఖమైనవి.


సునశ్శేనుడు అనే వ్యక్తిని విశ్వామిత్రుడు దత్తత తీసుకోగా అందుకు అతని కుమారులు అంగీకరించలేదు. అందుకు కోపించిన విశ్వామిత్రుడు పుండ్ర, సవర, పుళింద, మూతిబ జాతులతో వారిని కలిసిపొమ్మన్నాడని కథనం. మత్స్య, వాయు పురాణాల్లో కూడా ఆంధ్ర ప్రాంత ప్రస్తావన ఉంది. ఆంధ్రకు సంబంధించి లిఖిత పరంగా లభిస్తున్న తొలి ఆధారాలు అశోకుడి శిలా శాసనాలు.


భౌగోళిక పరిశీలన 

‘తాళపు చెవి’ లేదా ‘వీణ’ఆకారంలో ఉన్న ప్రస్తుత నవ్యాంధ్రప్రదేశ్‌ విశాలమైన తీరప్రాంతాన్ని (శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 974 కి.మీ.) కలిగి ఉంది. 12ని–37’–19ని–07’ ఉత్తర అక్షాంశాలు, 76ని–46’–84ని–46’ తూర్పు రేఖాంశాల మధ్య నవ్యాంధ్రప్రదేశ్‌ విస్తరించి ఉంది. విస్తీర్ణం పరంగా దేశ వైశ్యాలంలో 8వ స్థానంలో నిలుస్తుంది. ఏపీ వైశాల్యం 1,62,760 చ.కి.మీ. అక్షరాస్యతా శాతం 67.41%. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, బంగాళాఖాతం సరిహద్దులుగా కలిగి ఉంది.


కోస్తాలో 9 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలు ఉన్నాయి. కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర, వంశధార, గుండ్లకమ్మ తదితర నదులతో దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా ఆంధ్రప్రదేశ్‌ భాసిల్లుతోంది. ఈ రాష్ట్రంలో 56% వర్షపాతం నైరుతి రుతుపవనాల వల్ల, 32% వర్షపాతం ఈశాన్య రుతుపవనాల వల్ల, మిగిలింది వేసవి వర్షాల వల్ల సంభవిస్తోంది. కొల్లేరు అతిపెద్ద మంచినీటి సరస్సు. పులికాట్‌ ఉప్పునీటి సరస్సు తమిళనాడు సరిహద్దుగా ఉంది.


భౌగోళిక సహజ మండలాలు 

నైసర్గికంగా ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు కనుమలు, పీఠభూమి ప్రాంతం, తూర్పు తీర మైదానం ముఖ్యమైనవి.


తూర్పు కనుమలు

సముద్ర మట్టానికి వెయ్యి నుంచి మూడు వేల అడుగుల ఎత్తున తూర్పు కనుమలున్నాయి. శ్రీకాకుళంలో తూర్పు కనుమల్ని మహేంద్రగిరులని అంటారు. ఇవి చాలా ఎత్తైవి. విశాఖ జిల్లాలోని బాలకొండలోయల్లో బొర్రా గుహలు, అరకు లోయ ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టు. తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదికి ఇరువైపులా అందమైన ప్రకృతి దృశ్యాలతో ‘పాపికొండలు’న్నాయి. దట్టమైన అడవుల్లో వివిధ రకాల పక్షులు, జంతువులు, జలపాతాలు, వివిధ రకాల గనులు, నల్లరేగడి నేలలు, పత్తి, వరి పంటలకు తూర్పు కనుమలు గుర్తింపు సాధించాయి. తూర్పు కనుమల్లో గిరిజన తెగలైన సవరులు, గదబులు, కోయలు, చెంచులున్నారు. 


కృష్ణా జిల్లాలో కొండపల్లి, సీతానగరం కొండలు, గుంటూరు జిల్లాలోని కొండవీడు, కొండపల్లి, నాగార్జున కొండలు ప్రసిద్ధి. సీతానగరం కొండను చీల్చుకొని విజయవాడ వద్ద కృష్ణానది ప్రవహిస్తుంది. ఈ నదికి దక్షిణంగా నల్లమలై, ఎర్రమలై అనే రెండు పర్వత శ్రేణులున్నాయి. నల్లమలై పర్వత శ్రేణులు కర్నూలు - మహబూబ్‌నగర్ జిల్లాల్లోకి విస్తరించాయి. నల్లమలై - ఎర్రమలై రెండు పర్వత శ్రేణుల మధ్య సారవంతమైన ‘నంద్యాలలోయ’ ఏర్పడింది. ఈ నల్లమల పర్వత శ్రేణుల్లో దట్టమైన అడవీ ప్రాంతం ఉంది. చెంచు జాతులు, కొండ తెగల వారికి ఈ పర్వత శ్రేణులు ఆశ్రయమిస్తున్నాయి. నల్లమలైకు సమాంతరంగా కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ‘వెలిగొండలు, పాలకొండలు, శేషాచలం’ పర్వత శ్రేణులున్నాయి. కర్నూలు జిల్లా నల్లమలై కొండలపై శ్రీశైలం, అహోబిలం పుణ్య క్షేత్రాలున్నాయి. చిత్తూరు జిల్లా శేషాచలం కొండలపై ‘తిరుపతి’ క్షేత్రం ఉంది. శేషాచలం అడవుల్లోని ఎర్ర చందనం వృక్షాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి.


పీఠభూమి

తూర్పు కనుమలకు పశ్చిమ దిశలో సువిశాలమైన చారిత్రక దక్కను పీఠభూమి విస్తరించి ఉంది. ఇది సముద్ర మట్టానికి 480 - 600 మీటర్ల ఎత్తున ఉంది. ఇది అగ్ని పర్వత సంబంధ కఠిన శిలా ప్రాంతం.  దాదాపు రాయలసీమ ఈ పీఠభూమిలోనే ఉంది. కృష్ణా, తుంగభద్రా నదీ లోయ ప్రాంతంలో దీని ఎత్తు 300 - 450 మీటర్లు. దక్కను పీఠభూమికి తుంగభద్రా - కృష్ణా నదీ లోయ ప్రాంతాలు దక్షిణ దిశలో సరిహద్దు ప్రాంతంగా ఉంటాయి. చారిత్రక ప్రాముఖ్యత సంతరించుకున్న ‘రాయచూర్ దోబ్’ ఇదే ప్రాంతంలో ఉంది. 


మధ్యపీఠభూమిలో నల్ల సీసపు రాయి, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ‘పలుగురాతి పొరలు’ కనిపిస్తాయి. కడప, కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సున్నపురాయి పొరలుంటాయి. కడప, కర్నూలులో ఇనుము విస్తారంగా లభిస్తుంది. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో మాంగనీస్, నెల్లూరులో అభ్రకం, గుంటూరు జిల్లాల్లో రాగి, కడప, కర్నూలుల్లో ఆస్‌బెస్టాస్, అనంతపురం జిల్లాలో వజ్రాలు (వజ్రకరూరు), వివిధ రకాల ఖనిజాలు లభిస్తున్నాయి. దక్కను పీఠభూమి వాయవ్య దిశ నుంచి ఆగ్నేయ దిశకు వాలి ఉన్నందున కృష్ణా, గోదావరి తదితర నదులన్నీ తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.


నదులు


గోదావరి: ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నది పెద్దది. ఇది సహ్యాద్రి కొండలు - పశ్చిమ కనుమల్లో ‘నాసిక్’ సమీపంలో త్రయంబకం’ వద్ద పుట్టింది. ‘గోదావరి’ అంటే ‘నీరు, పాడి ఆవులిచ్చేదని’ అర్థం.  ఈ నది సుమారు 900 మైళ్లు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి ఉపనదుల్లో ‘మంజీర, ప్రాణహిత, శబరి, ఇంద్రావతి’  ముఖ్యమైనవి. ‘కూనవరం’ వద్ద ‘శబరి నదిని’ కలుపుకొన్న తర్వాత పాపికొండల ద్వారా ప్రవహించి, ఏడుపాయలుగా చీలుతుంది. అవి తుల్యభాగ, ఆత్రేయ, గౌతమి, వృద్ధ గౌతమి, భరద్వాజ, కౌశిక, వశిష్ట. ఈ ఏడుపాయలను కలిపి సప్త గోదావరి అంటారు. వీటిలో గౌతమి, వశిష్ట పెద్దవి. గౌతమి యానాం వద్ద, వశిష్ట నర్సాపురం సమీపంలో అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తాయి. గోదావరి డెల్టా ప్రాంతం ‘రాజమహేంద్రవరం’ నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో అనేక లంక గ్రామాలున్నాయి.


కృష్ణానది: ఇది మహారాష్ర్టలోని పడమటి కనుమల్లో  దాదాపు 4500 అడుగుల ఎత్తున ఆవిర్భవిస్తుంది. కొంతదూరం దక్షిణంగా ప్రవహించి, తరువాత తూర్పు దిశగా మహారాష్ర్ట, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌లో హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. కృష్ణానది పొడవు దాదాపు 800 మైళ్లు. దీనికి ఎడమ భాగాన 15, కుడివైపున నాలుగు ఉపనదులున్నాయి. మహారాష్ట్రలో కృష్ణానదిని ‘కృష్ణాబాయి’గా పిలుస్తారు. నల్లరేగడి భూముల మీదుగా ప్రవహిస్తున్నందువల్ల దీన్ని ‘కృష్ణభూమి’ అని, ‘కరేనాడు’ అని కూడా పిలుస్తారు.


ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఈ నదీ పరీవాహక ప్రాంతాలు. తుంగభద్ర, మూసీ, భీమ, ఘటప్రభ, మలప్రభ దీని ఉపనదులు. కృష్ణానది డెల్టా విజయవాడ నుంచి ప్రారంభమవుతుంది.


పెన్నానది: కర్ణాటకలోని నందిదుర్గం దగ్గర చెన్నకేశవ గిరి దీని జన్మస్థానం. ఈ నదికి పినాకిని అని మరో పేరు. పొడవు 570 కి.మీ. అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు  జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది. జయమంగళ, కుందేరు, పాపాఘ్ని, చిత్రావతి దీని ఉపనదులు. నెల్లూరు సంగం వద్ద పెన్నానదిపై ఆనకట్ట నిర్మించారు. నెల్లూరుకు దక్షిణ దిశలో ఊటుకూరు వద్ద పెన్నానది సముద్రంలో కలుస్తుంది.


వంశధార: దీని జన్మస్థానం ఒడిశాలోని ‘నిమ్మగిరి’ కొండలు. ఇది శ్రీకాకుళం జిల్లా గుండా ప్రవహించి, కళింగపట్నం సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. తూర్పు కనుమల్లో పుట్టి, బంగాళాఖాతంలో కలిసే నదుల్లో వంశధార పెద్దది. ఈ నది ఒడ్డునే శ్రీ ముఖలింగ దేవాలయం, శాలిహుండం బౌద్ధ స్థూపం బయల్పడ్డాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో సుమారు 17 నదులు ప్రవహిస్తున్నాయి. బహుదా, లాంగుళ్య (నాగావళి), శారద, గోస్తనీ, మాడుగుల కొండల్లో ముచికుంద ముఖ్యమైనవి.  నెల్లూరు జిల్లాలో స్వర్ణముఖి, గుండ్లకమ్మ నల్లమల కొండల్లో పుట్టి, గుంటూరు, ప్రకాశం జిల్లాల గుండా 235 కి.మీ. ప్రవహించి కొత్తపట్నం వద్ద సముద్రంలో కలుస్తున్నాయి. ఇవే కాకుండా అనేక చిన్న చిన్న నదులు కూడా ఉన్నాయి.


తీరమైదానం

తూర్పు కనుమలు - తీరానికి మధ్య 60 కి.మీ. వెడల్పుతో ఈ తీర మైదానం ఉంది. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల డెల్టాలు ఈ మైదానంలో ఉన్నాయి. ఈ మైదాన తీరం సారవంతమైన ఒండ్రు నేలలతో కూడి ఉంది. గుప్త గోదావరీ ప్రాంతంలో విస్తరించిన లంకలున్నాయి. ఈ ప్రాంతాన్నే ‘కోనసీమ’ అంటారు.  తీర మైదాన ప్రాంతంలో వర్షపాతం ఎక్కువ. తూర్పు తీర మైదానంలో కొల్లేరు, ‘పులికాట్’ వంటి పెద్ద సరస్సులున్నాయి. 


కృష్ణా - గోదావరి డెల్టాల మధ్యలో కొల్లేరు మంచినీటి సరస్సు ఉంది. బుడమేరు, తమ్మిలేరు వంటి వాగులు ఇందులో కలుస్తాయి. నెల్లూరు జిల్లాలోని ‘పులికాట్ సరస్సు ఉప్పునీటి సరస్సు. భారత ప్రభుత్వం ఇక్కడ శ్రీహరికోట వద్ద కృత్రిమ ఉపగ్రహ ప్రయోగశాలను నెలకొల్పింది. ఆంధ్రప్రదేశ్‌కు సుమారు వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అయినా ఓడరేవులు తక్కువ. విశాఖపట్నం వద్ద ‘డాల్ఫిన్‌సనోస్’ కొండ వద్ద ‘విశాఖ ఓడరేవు’ సహజసిద్ధంగా ఏర్పడింది.


భౌగోళిక పరిస్థితులు - చరిత్రపై దాని ప్రభావం

సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఆంధ్రులు స్వల్పకాలం మాత్రమే ఏకఛత్రాధిపత్యం కింద మనగలిగారు. భౌతిక, నైసర్గిక భిన్నత్వం వల్ల సంస్కృతి, సంప్రదాయాలు, ఆర్థిక వ్యత్యాసాల్లో మార్పులొచ్చాయి. దీని ఫలితంగా చారిత్రక కాల గమనంలో సర్కారు, రాయలసీమ, తెలంగాణ, తూర్పాంధ్ర అనే ప్రాంతీయ భావాలు చోటుచేసుకున్నాయి. దాని ఫలితంగా తెలుగు దేశంలో భిన్నత్వంలో ఏకత్వం లోపించింది. దక్షిణాపథంలో పశ్చిమ ప్రాంతంలో అనేక రాజవంశాలు తీరాంధ్రాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించాయి.


ముఖ్యంగా కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న ‘రాయచూర్ దోబ్’ (అంతర్వేది) ప్రాంతంపై పల్లవులు, పశ్చిమ -చాళుక్యులు, రాష్ర్ట కూటులు, చోళులు, కళ్యాణీ చాళుక్యులు, విజయనగర, బహమనీ రాజుల మధ్య అనేక సంఘర్షణలు జరిగాయి. ఈ దండయాత్రల వల్ల ద్రావిడ, కన్నడ, మరాఠా, కళింగ (ఒడిశా) ప్రజలు అధిక సంఖ్యలో వలస వచ్చి ఆంధ్రదేశంలో స్థిరపడ్డారు. ఫలితంగా ఆంధ్రజాతిలో భౌతికమైన వైవిధ్యం, సంస్కృతీ సంప్రదాయాలు సమ్మిళితం అయ్యాయి.


మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రలో శాతవాహనుల యుగం నుంచి విజయనగర రాజుల వరకు, తూర్పు కనుమల్లో గోల్కొండ, కొండపల్లి, కొండవీడు, దేవరకొండ, గుత్తి, గండికోట, పెనుగొండ, మహేంద్రగిరి వంటి కొండ ప్రాంతాల్లో అనేక దుర్గాలు ఏర్పడ్డాయి. ఇవి కూడా కొంత వరకు ఆంధ్రదేశ రాజకీయ అనైక్యతకు దారితీశాయి. 


ఈ దుర్గాలతోపాటు, గోదావరీ, కృష్ణానదీ తీర ప్రాంతాల్లో శ్రీ పర్వతం, శ్రీశైలం, యాదగిరి గుట్ట, అహోబిలం, సింహాచలం, విజయవాడ, తిరుపతి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో సూదికొండ, పాపికొండ, శాలిహుండం, అరసవల్లి ఆదిత్యుడు, శ్రీకూర్మం, ముఖలింగం వంటి అనేక క్షేత్రాలు వెలిశాయి. ఈ క్షేత్రాలు ఒక విధంగా దేశ వ్యాప్తంగా సమైక్యానికి తోడ్పడ్డాయని చెప్పొచ్చు. దక్కను (దక్షిణాపథం) రాజ్యమేలిన రాజులు ప్రపంచ చరిత్రలో చోటు దక్కించుకొని, స్థూపాలు, చైత్యాలు, విహారాలు (బౌద్ధం), అనేక హిందూ, జైన ఆలయాలు నిర్మించి ప్రపంచ చరిత్రలో చిరస్మరణీయులయ్యారు.


ప్రముఖులు- ఆంధ్రకు చేసిన సేవలు..


ఆంధ్రులే కాకుండా, విదేశీయులు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను వేనోళ్ల కొనియాడారు. సంగీతం, సాహిత్యం, కట్టడాల నిర్మాణం మొదలగు సేవా ప్రక్రియలతో వారు నేటికీ వివిధ ప్రాంతాలలో ఆరాధనా మూర్తులుగా పూజించబడతారు. రాయలసీమ ప్రాంతంలో తమ పిల్లలకు మన్రోలప్ప, మన్రోలమ్మి అనే పేర్లు థామస్ మన్రో మీద ప్రేమను వ్యక్తీకరించుటకు గల కారణం.


వివిధ గ్రంథాలు, శాసనాలు, కైఫియత్‌లు ఆధారంగా వార్తా పత్రికల కథనాల ప్రకారం ఈ కింది మేథావులైన ఆంధ్రులు, విదేశీయులు ఆంధ్రదేశ చరిత్ర, సంస్కృతికి శక్తి వంచన లేకుండా సేవ చేశారు. అటువంటి వారిలో ఈ కింది ప్రముఖుల సేవ మరువలేనిది, చిరస్మరణీయమైంది. సువర్ణాక్షరాలతో లిఖించదగింది.


రాబర్ట్ బ్రూస్‌పుట్: చారిత్రక పూర్వ యుగాన్ని వెలుగులోనికి తీసుకుని వచ్చి వివరించారు. ఈయనను ‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్రి హిస్టరీ’ అంటారు.


ప్లీనీ: ‘నాచురల్ హిస్టరీ’ అనే గ్రంథాన్ని రాశారు. రోమ్ సంపద బంగారం రూపంలో భారతదేశానికి తరలిపోతుంది అని వాపోయారు. 


టాలమీ: ‘గెడ్ టు జాగ్రఫీ’ అనే గ్రంథాన్ని రాశారు. ‘ట్రిలింగాన్’ అనే పదాన్ని వాడారు.


మెగస్తనీస్: ఆంధ్రులకు 30 దుర్గాలు (కోటలు) ఉన్నాయి అని తన ‘ఇండికా’ గ్రంథంలో రాశారు. ఇండికా గ్రీక్ భాషా గ్రంథం.


మార్కోపోలో: ‘ది ట్రావెల్స్’ అనే గ్రంథాన్ని రాశారు. ‘పయనీర్ అమాంగ్ ట్రావెలర్స్’ అని ఈయనకు పేరు.  మోటుపల్లి ఓడరేవు ప్రత్యేకతను వివరించారు.


హుయాన్‌త్సాంగ్: వేంగీ చాళుక్య రాజ్యాన్ని గురించి తన గ్రంథం ‘సి-యూ-కీ’లో రాశారు. ఈయన వేంగి రాజు కుబ్జ విష్ణువర్థునునికి సమకాలీనుడు


ఇత్సింగ్: క్రీ.శ. 7వ శతాబ్ధంలో భారత్ వచ్చాడు. నాగార్జున కొండలో ‘స్ఫుహ్రుల్లేఖ’ గ్రంథాన్ని విద్యార్థులు వల్లెవేస్తూండేవారు అని రాశారు.



శ్రీకాకుళం జిల్లా


  • సూర్యనారాయణ ఆలయం (అరసవెల్లి) ఈ జిల్లాలో ఉంది.
  • కూర్మనాథాలయం (శ్రీకూర్మం – ఇక్కడ 2 ధ్వజస్తంభాలున్నాయి)
  • సూర్యుడికి, కూర్మనాథుడికి ఆలయం గల ఏకైక జిల్లా శ్రీకాకుళం.
  • ఇక్కడి మహేంద్రగిరి గొప్ప పర్యాటక కేంద్రం, ఎల్తైనది.
  • వంశధార నదీ తీరాన ఉన్న శ్రీముఖలింగం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం.
  • బౌద్ధులకు ప్రసిద్ధి చెందిన శాలిహుండం వంశధార నదీ తీరంలో ఉంది.
  • వంశధార, నాగావళి, వేగావతి మొదలైన నదులు ఈ జిల్లాలో ప్రవహిస్తున్నాయి.
  • మథుకేశ్వరాలయం ఉంది.
  • ‘పొందూరు’ ఖద్దరు ప్రసిద్ధి చెందింది.
  • నక్సలైట్‌ ఉద్యమం ఈ జిల్లాలోనే ప్రారంభమైంది.
  • శ్రీకాకుళం లాంగుల్యా నదీ తీరాన ఉంది.
  • కళింగపట్నం, టెక్కెలిపాడు, సారవల్లి బౌద్ధ శిథిల ప్రాంతాలు.
  • డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం ఉంది.


విజయనగరం జిల్లా


  • పైడితల్లి సిరిమానోత్సవం జరుగుతుంది.
  • సంగీత పరికరాలు బొబ్బిలిలో తయారు చేస్తారు.
  • నాగావళి, చంపావతి, శారద, జంఝావతి, గోముఖీ నదులు ప్రవహిస్తున్నాయి.
  • గజపతుల చారిత్రక కోటను గో«థిక్‌ శైలిలో నిర్మించారు.
  • కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ ఉంది.
  • భగవద్గీత సారం ఆధారంగా నిర్మించిన ఆలయం గోవిందాపురంలో ఉంది.
  • 1757లో బొబ్బిలి యుద్ధం జరిగింది.
  • నెల్లిమర్ల మాంగనీసు ఖనిజానికి కేంద్రం.
  • జనపనార ఉత్పత్తిలో ఆంధ్రాలో అగ్రగామి జిల్లా.


విశాఖపట్నం జిల్లా


  • దీనికి కుళోత్తుంగ చోళపట్టణం, వీరకూటం అనే ప్రాచీన నామాలు ఉన్నాయి.
  • సింహాచలంలో నారసింహ క్షేత్రం ఉంది.
  • వైశాఖ శుద్ధ తదియ రోజు నారసింహుడి నిజరూప దర్శనం ఉంటుంది. దీన్ని చందనోత్సవం అంటారు.
  • సింహాచల నారసింహాలయాన్ని కుళోత్తుంగ చోళుడు నిర్మించాడు.
  • శ్రీకృష్ణదేవరాయలు విజయ స్తంభం నాటించాడు.
  • కప్ప స్తంభాన్ని కౌగిలించుకొనే ఆచారం సింహాచలంలో ఉంది.
  • ఆంధ్ర విశ్వకళా పరిషత్తు (ఆంధ్రా విశ్వవిద్యాలయం) ఉంది.
  • సింహాద్రి అప్పన్నకు ఎద్దులు, ఆవులను కానుకగా సమర్పిస్తారు.
  • బొజ్జనకొండ గొప్ప బౌద్ధ క్షేత్రం.
  • ఈ జిల్లాలో కైలాసగిరి పార్కు ఉంది.
  • విశాఖ జిల్లాలో గిరిజనులు చేసే దైవ సంబంధ నృత్యం – థింసా నృత్యం.
  • అరకులోయ ప్రసిద్ధ వేసవి విడిది ప్రాంతం.
  • పర్యాటక కేంద్రం లంబసింగి ఈ జిల్లాలో ఉంది.
  • హిందుస్తాన్‌ షిప్‌యార్డ్, కోరమండల్‌ ఎరువుల కర్మాగారం ప్రసిద్ధి చెందాయి.
  • ఇందిరా జువాలాజికల్‌ పార్కు ఉంది.
  • రామకృష్ణ బీచ్‌ ప్రాధాన్యత పొందింది.
  • బొర్రా గుహలు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం.
  • దక్షిణ భారతదేశంలో తొలి మున్సిపాలిటీ భీమిలి.
  • ఇక్కడ గల భవనాశి సరస్సును దక్షిణాది బద్రీనాథ్‌ అంటారు
  • విశాఖ ఓడరేవు సహజసిద్ధమైంది.
  • బెల్లం తయారీకి అనకాపల్లి ప్రసిద్ధి చెందింది.


తూర్పుగోదావరి జిల్లా


  • అన్నవరంలో సత్యనారాయణస్వామి ఆలయం ఉంది.
  • రాజమండ్రి/రాజమహేంద్రవరంను ఆంధ్రుల సాంస్కృతిక రాజధానిగా పేర్కొంటారు.
  • పాపికొండలు పర్యాటక కేంద్రం.
  • పిఠాపురంలో సంగీత పరికరాలు తయారు చేస్తారు.
  • ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ ప్రసిద్ధి చెందింది.
  • తునిలో తలుపులమ్మ జాతర నిర్వహిస్తారు. ఈ దేవతను లలితాంబిక అంటారు.
  • ద్రాక్షారామం, కొమరారామం ఈ జిల్లాలో ఉన్నాయి.
  • కడియం నర్సరీ దేశంలోనే ప్రసిద్ధి చెందింది.
  • అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ ఆలయం ఈ జిల్లాలోని ద్రాక్షారామంలో ఉంది.
  • తిలతైలాభిషేకాలు నిర్వహించే శనీశ్చరస్వామి ఆలయం మందపల్లిలో ఉంది.
  • మరిడమ్మ ఆలయం పెద్దాపురంలో ఉంది.
  • జగన్మోహినీ కేశవస్వామి ఆలయం ర్యాలీలో ఉంది.
  • ముందు, వెనుక పూజలు చేసే విగ్రహం గల ఆలయం ర్యాలీ జగన్మోహినీ ఆలయం.
  • ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాజమండ్రిలో ఉంది.


పశ్చిమగోదావరి జిల్లా


  • గుంటుపల్లి బౌద్ధమత క్షేత్రం (అలెగ్జాండర్‌ రే కనుగొన్నారు) ఈ జిల్లాలో ఉంది.
  • పెనుగొండలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇది వైశ్యుల ఆరాధనా కేంద్రం.
  • భీమవరంలో సోమేశ్వరాలయం (సోమారామం) ఉంది. ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటి.
  • పాలకొల్లులో క్షీరారామాలయం ఉంది. ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటి.
  • ద్వారకా తిరుమలలో వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. దీన్ని చిన్న తిరుపతి అని పిలుస్తారు.
  • పట్టిసీమలో వీరేశ్వరుడు కొలువై ఉన్న ఆలయం ఉంది.
  • అంతరిక్ష పరిశోధనలకు వాడే ఇంధనాన్ని తణుకులో, చక్కెర పరిశ్రమలో తయారు చేస్తారు.
  • వరి అధికంగా ఈ జిల్లాలో పండుతుంది.
  • తణుకులో ఆంధ్రా షుగర్స్‌ ఫ్యాక్టరీ ఉంది.
  • కొల్లేరు సరస్సు పర్యాటక ప్రాంతం.


కృష్ణా జిల్లా


  • కూచిపూడి/కుశలవపురం/కుచేలపురం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సిద్ధేంద్ర కళాక్షేత్రం ఉంది.
  • వేదాద్రి (జగ్గయ్యపేట సమీపంలో) నరసింహస్వామి ఆలయం పేర్గాంచింది.
  • కొల్లేరు సరస్సు, కొండపల్లి దుర్గం ప్రసిద్ధి చెందాయి.
  • ఘంటసాల (కంటకసాల)లో జలంధరేశ్వరాలయం ఉంది. బుద్ధుడి గుర్రం కంటక పేరు మీద ఈ ఊరికి ఆ పేరు వచ్చింది.
  • భవానీ ద్వీపం అనే పర్యాటక కేంద్రం ప్రసిద్ధి చెందింది.
  • శ్రీకాకుళాంధ్ర మహా విష్ణువు ఆలయం శ్రీకాకుళంలో ఉంది. ఆముక్తమాల్యదను రాయడానికి శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడే శ్రీకారం చుట్టాడు.
  • గాంధీ కొండ విజయవాడలో ఉంది.
  • మచిలీపట్నం (బందరు) ప్రముఖ, ప్రాచీన ఓడరేవు ప్రాంతం.
  • విజయవాడకు సమీపాన మొగల్రాజపురంలో ఉండవల్లి గుహలు ఉన్నాయి. అనంతశయనశాయి, అర్ధనారీశ్వర, పూర్ణ కుంభం శిల్పాలు ఇక్కడే చెక్కారు.
  • కొండపల్లి బొమ్మలకు ఈ జిల్లా ప్రసిద్ధి (తెల్లపొణిక కర్రతో వీటిని తయారు చేస్తారు)
  • ఆంధ్రుల ఆర్థిక రాజధానిగా విజయవాడను వ్యవహరిస్తారు.
  • మంగినపూడి, చిలకలపూడి బీచ్‌లు ఉన్నాయి.
  • ప్రకాశం బ్యారేజీని కృష్ణానదిపై నిర్మించారు.
  • కనకదుర్గాలయం ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉంది.
  • మచిలీపట్నం కలంకారీ పరిశ్రమకు కేంద్రం.
  • నూజివీడు మామిడి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.


గుంటూరు జిల్లా


  • దీని ప్రాచీన నామం కర్మ రాష్ట్రం.
  • కృష్ణానది తీరాన ఆంధ్రుల రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతోంది.
  • హాయ్‌లాండ్‌ వినోద ప్రాంతం ఉంది.
  • మిర్చి పరిశోధనా కేంద్రం ‘లాం’లో ఉంది.
  • అమరావతిలోని అమరేశ్వరాలయం పంచారామాల్లో ఒకటిగా కీర్తి పొందింది.
  • ఉప్పలపాడులో సహజ పక్షుల కేంద్రం ఉంది.
  • పల్నాటి యుద్ధం జరిగిన కారెంపూడి ఈ జిల్లాలో ఉంది.
  • జీయర్‌ వేద విశ్వవిద్యాలయం ఉంది.
  • పొగాకు బోర్డు గుంటూరులో ఉంది.
  • కొండవీటి దుర్గం కీర్తిగాంచింది.
  • అమరావతిలో కాలచక్ర ఉత్సవాలు బౌద్ధ ధర్మం ప్రకారం జరిగాయి.
  • మాచెర్ల చెన్నకేశవాలయం, ఎత్తిపోతల ఈ జిల్లాలో ఉన్నాయి.
  • మంగళగిరిలో పానకాలస్వామి ఆలయం ఉంది. (ఇది దక్షిణాదిలో రెండో అతిపెద్ద గోపురం గల ఆలయం)
  • గుత్తికొండ బిలం, చీకటి మల్లన్న ఆలయం ఉన్నాయి.
  • చేబ్రోలులో బ్రహ్మాలయాన్ని వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు నిర్మించారు.
  • కళ్లకు గంతలు కట్టిన శనీశ్చరాలయం మాచర్లలో ఉంది.
  • చేజెర్లలోని కపోతేశ్వరాలయం ప్రసిద్ధి చెందింది.
  • త్రికూటేశ్వరాలయం కోటప్ప కొండలో ఉంది.
  • ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈ జిల్లాలో ఉంది.
  • పృథ్వీతిలక్‌ బసది (జైన) సత్తెనపల్లిలో ఉంది.


ప్రకాశం జిల్లా


  • చందవరం బౌద్ధారామం ప్రసిద్ధి చెందింది.
  • మోటుపల్లి ఓడరేవు ప్రసిద్ధి చెందింది. మోటుపల్లి అసలు పేరు దేశీయకొండ పట్టణం.
  • మోటుపల్లిలో వీరభద్రేశ్వరాలయం ఉంది.
  • చీమకుర్తి గ్రానైట్‌కు ప్రసిద్ధి.
  • మొగిలిచర్లలో దత్తాత్రేయ ఆలయం ఉంది. (మాలికొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది)
  • కనిగిరి కోట, అందులో నేలమాళిగలు ప్రసిద్ధి చెందాయి.
  • భైరవకోనలో 8 గుహలున్నాయి.
  • భైరవకోనలో త్రిముఖ దుర్గ శిల్పం ఉంది.
  • త్రిపురాంతకంలో త్రిపురాంతకేశ్వరాలయం ఉంది.
  • మార్కాపురం పలకల తయారీకి ప్రసిద్ధి.
  • సింగరాయకొండలో ప్రసన్నాంజనేయస్వామి ఆలయం ఉంది.
  • పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
  • మైపాడు బీచ్‌ పర్యాటక కేంద్రం.
  • స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ నిర్వహిస్తారు.
  • పులికాట్‌ (పాలిక్కడ్‌) సరస్సు ఉంది.
  • నేలపట్టు పక్షుల అభయారణ్యం ప్రసిద్ధి చెందింది.
  • కవిబ్రహ్మ తిక్కన స్మారక నిర్మాణం పెన్నానదీ తీరాన ఉంది.
  • సతీష్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోటలో ఉంది.
  • గూడూరు ‘మైకా’కు ప్రసిద్ధి.
  • జై ఆంధ్ర ఉద్యమ స్థూపం నెల్లూరు పట్టణంలో నిర్మించారు.
  • సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయం ప్రసిద్ధి చెందింది.
  • బారాషాహిద్‌ దర్గా, కసుమూరు దర్గాలు పేరుగాంచాయి.
  • కృష్ణపట్నం, దుగరాజ పట్నం ఓడరేవు ప్రాంతాలు.
  • గాంధీజీ ప్రారంభించిన పల్లెపాడు ఆశ్రమం ఉంది.
  • పెన్నానదీ తీరంలో తల్పగిరి రంగనాథస్వామి ఆలయం ఉంది. ఇక్కడ రంగనాథ స్వామి శయనిస్తున్నట్లు ఉంటాడు.
  • అవధూత భగవాన్‌ వేంకయస్వామి ఆలయం ఉంది.
  • వేదగిరి నరసింహస్వామి ఆలయం, పెంచలకోన లక్ష్మీనరసింహాలయం ఉన్నాయి.
  • నర్రవాడ వెంగమాంబ జాతర జరుగుతుంది.
  • జరీ చీరలకు వెంకటగిరి ప్రసిద్ధి.
  • జొన్నవాడ కామాక్షితాయి ఆలయం పెన్నానదీ తీరాన ఉంది.
  • విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉంది.
  • వెంకటగిరి పోలేరమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తారు.


చిత్తూరు జిల్లా


  • చంద్రగిరిలో మానవ కేశాల నుంచి తైలం తీసే ఫ్యాక్టరీ ఉంది. దీన్ని జపాన్‌ సాయంతో నిర్మించారు.
  • కౌండిన్య వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉంది.
  • శ్రీవేంకటేశ్వర అభయారణ్యం ఉంది.
  • కళ్యాణి డ్యాం గొప్ప పర్యాటక స్థలం.
  • గోవిందరాజస్వామి ఆలయం తిరుపతిలో ఉంది.
  • తిరుమలలో శిలాతోరణం ఉంది.
  • రాహు– కేతు ప్రత్యేక పూజలు శ్రీకాళహస్తిలో నిర్వహిస్తారు. ఈ ఆలయం స్వర్ణముఖి నదీ తీరాన ఉంది.
  • పాపానాయుడు పేటలో గాజులు తయారు చేస్తారు.
  • ఏర్పేడు వ్యాసాశ్రమాన్ని మలయాళ స్వామి స్థాపించారు.
  • భారతదేశంలోనే అతి ప్రాచీన, ప్రథమ శివాలయంగా పేర్కొనే ఆలయం – గుడిమల్లంలోని పరశురామేశ్వరాలయం.
  • కాణిపాక వరసిద్ధి వినాయకాలయం ప్రసిద్ధి చెందింది.
  • తొలి రైలు పుత్తూరు – రేణిగుంటల మధ్య 1862లో నడిచింది.
  • తలకోన జలపాతం, చంద్రగిరి కోట, కైలాసకోన ప్రముఖ పర్యాటక ప్రాంతాలు.
  • శేషాచలం కొండల్లో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (తిరుమల) ప్రపంచ ప్రసిద్ధి చెందింది.
  • తిరుచానూరులో అలిమేలు మంగమ్మ ఆలయం ఉంది. (ముస్లింలు ఈ దేవతను బీబీ నాంచారమ్మగా పూజించారు)
  • హార్సిలీహిల్స్‌ (ఏనుగు మల్లమ్మ కొండలు) వేసవి విడిది ప్రాంతం.
  • తిరుపతి పట్టణంలో గంగమ్మ జాతర నిర్వహిస్తారు.
  • పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, ద్రవిడ విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఈ జిల్లాలో ఉన్నాయి.
  • నారాయణవనంలో కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది.


అనంతపురం జిల్లా


  • ఆంధ్రాలో అతిపెద్ద జిల్లా.
  • లేపాక్షి నంది విగ్రహం దేశంలోనే అతి పెద్దది.
  • తాడిపత్రిలో చింతల వెంకటరమణస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది.
  • దత్త మండలాలకు ప్రధాన కేంద్రం అనంతపురం.
  • భగవాన్‌ సత్యసాయిబాబా ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో ఉంది.
  • విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన అరవీటి వంశస్తుల రాజధానిగా
    పెనుగొండ వర్ధిల్లింది.
  • ధర్మవరం చీరలు ప్రసిద్ధి.
  • విజయనగర రాజుల చిత్రకళకు లేపాక్షి ప్రసిద్ధి.
  • పట్టు పరిశ్రమలో ఆంధ్రాలో ఈ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది.
  • అతిపెద్ద కుంభకర్ణుడి విగ్రహం పెనుగొండ సమీపంలో ఉంది.
  • బంగారు గనులకు ప్రసిద్ధిగాంచిన జిల్లా.
  • వజ్రాలకు ప్రసిద్ధి చెందింది.
  • కదిరిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది.
  • రాయదుర్గం కోట ఈ జిల్లాలో ఉంది.
  • తిమ్మమ్మ మర్రిమాను గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కింది (కదిరి సమీపంలో ఉంది).
  • శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉంది.


వైఎస్‌ఆర్‌ కడప జిల్లా


  • ప్రాచీన కాలంలో హిరణ్య రాష్ట్రం అని పిలిచేవారు.
  • తాళ్లపాక అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాక.
  • బంగారు ఆభరణాల తయారీ పరంగా ప్రొద్దుటూరును రెండో బొంబాయిగా పేర్కొంటారు.
  • కందిమల్లయపల్లెలో బ్రహ్మంగారి జీవ సమాధి ఉంది.
  • ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది.
  • పోతన తన ఆంధ్ర మహాభాగవతాన్ని ఒంటిమిట్ట రాముడికి అంకితమిచ్చాడని ప్రతీతి.
  • రాష్ట్రంలోని ఏకైక అద్వైత పీఠం పెన్నానది ఒడ్డున ఉన్న పుష్పగిరి. దీన్ని విద్యారణ్య స్వామి స్థాపించారు.
  • పీర్‌సాహెబ్‌ దర్గా ఈ జిల్లాలో ఉంది.
  • గండికోట గొప్ప పర్యాటక కేంద్రం.
  • కలివికోడి అనే అత్యంత అరుదైన పక్షి శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో కనిపిస్తుంది.
  • సురభి నాటక సమాజం ప్రసిద్ధి చెందింది.
  • యోగి వేమన విశ్వవిద్యాలయం ఉంది.
  • ఉల్లి పరిశోధనా కేంద్రం ఎర్రగుంట్లలో ఉంది.


కర్నూలు జిల్లా


  • అశోకుడి శిలా శాసనం ఎర్రగుడిపాడులో ఉంది.
  • శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి.
  • శ్రీభ్రమరాంబిక (శ్రీశైలం) ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి.
  • ధూళిదర్శనం (కాళ్లు కడుక్కోకుండా జ్యోతిర్లింగ దర్శనం) శ్రీశైలంలో కనిపిస్తుంది.
  • అగస్త్యుడు, లోపాముద్ర విగ్రహాలు గల ప్రాంతం హఠకేశ్వరం.
  • రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రంలో బట్టమేక పక్షి అరుదుగా సంచరిస్తోంది.
  • యాగంటి బసవన్న ఆలయం ప్రసిద్ధి చెందింది.
  • బెలూం గుహలు ప్రముఖ పర్యాటక ప్రదేశం.
  • తుంగభద్రా నదీ తీరాన మంత్రాలయ రాఘవేంద్రస్వామి ఆలయం ఉంది.
  • అహోబిల నృసింహ క్షేత్రం గొప్ప పుణ్యక్షేత్రం.
  • శివలింగంపై ఆవు గిత్త గుర్తు ఉన్న ఆలయం మహానందిలోని శివాలయం.
  • సాక్షి గణపతి ఆలయం ఉన్న ప్రాంతం హఠకేశ్వరం.




 

Prince Ys Jagan (PYJ) © 2009 - 2024. All Rights Reserved | Contact | Powered by Telugu Brains

back to top