ప్రజాస్వామ్యంలో ప్రజలే భూమిక. నేలని మరిచి గాలిలో విహరించేవాడు, బొక్కబోర్లా పడతాడు. జగన్‌కి జరిగింది ఇదే. ప్రజల్ని మరిచిపోయారు. ప్రజలు ఆయన్ని మరిచిపోయారు. ఫలితం ఘోర ఓటమి.
నిరంతరం ప్రజల కోసం బటన్ నొక్కాడు కదా, మరి ప్రజలకి దూరం ఎందుకయ్యాడు? పథకాలు మాత్రమే ప్రజలకి దగ్గర చేయవు. అదే నిజమైతే జగన్‌కి కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కేది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ ఎందుకు తిరస్కరించారు? జగన్‌ని జనం వద్దూ అని ఏక వాక్యంతో తీర్మానించారు. ఎందుకంటే గతంలోలా ఆయన ప్రజల మనిషి కాదు. జనానికి భిక్షం వేసి పబ్బం గడుపుకోవాలనుకుంటున్న నాయకుడని గ్రహించారు. తనని తాను చక్రవర్తిలా ఊహించుకుని తాడేపల్లి రాజభవనంలో విశ్రాంతి తీసుకునే పలాయనవాది అని అర్థం చేసుకున్నారు. అందుకే పథకాల లబ్ధిదారులు కూడా వెంట లేకుండా పోయారు.
అసలు జగన్ బలం ఏంటి? అందరూ అనుకున్నట్టు వైఎస్ వారసత్వం కాదు. అదే నిజమైతే షర్మిలకి కనీసం డిపాజిట్ దక్కేది. వారసుడిగా రంగంలోకి వచ్చిన ఆయన్ని వైఎస్ కుమారుడిగా మాత్రమే గుర్తించలేదు. సోనియాని ఎదుర్కొన్న ధైర్యశాలిగా మాత్రమే పరిగణించలేదు. సామాన్య జనంలో తిరిగే ఒక మంచి నాయకుడు, పేద జనాన్ని అక్కున చేర్చుకునే మానవతా వాది అని జనం నమ్మారు. దీనికి నిదర్శనంగా 2009 నుంచి 19 వరకూ రోడ్ల మీదే ఉన్నారు. పాదయాత్రలో తిరిగారు. జగన్ పథకాల కంటే, జగన్ తమ మనిషి, కష్టం చెప్పుకుంటే తీరుస్తాడని విశ్వసించారు. దీని ఫలితమే అఖండ విజయం.
అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తండ్రిలాగా ప్రజాదర్బార్ పెట్టి వుంటే జనం కష్టసుఖాలు విని వుంటే కథ వేరే వుండేది. 23 సీట్లతో ఓటమి పరాభవంతో ఉన్న చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని దూషించడం, ఎగతాళి చేయడంతో ప్రారంభమయ్యాడు. జగన్‌ని ఆరాధిస్తున్న వారు కూడా ప్రజావేదిక కూల్చివేత చూసి నివ్వెరపోయారు. అది ప్రభుత్వ ధనం. అక్రమ కట్టడం పేరుతో కూల్చేసే హక్కు లేదు. అదే నిజమైతే రాష్ట్రంలో ఉన్న అక్రమ కట్టడాలన్నీ కూల్చేసి వుండాలి. కూల్చారా? లేదు కదా!
అన్నిటికంటే పెద్ద తప్పు, పేద ప్రజలు ఈసడించుకున్నది అన్నా క్యాంటీన్ మూసివేత. అన్నా అనే పేరు ఇష్టం లేకపోతే వైఎస్ లేదా జగన్ క్యాంటీన్ అని పెట్టుకుంటే ఎవరడ్డు చెబుతారు? పేదవాళ్లకి నాణ్యంగా పెడుతున్న భోజనాన్ని అకారణంగా దూరం చేసి జనానికి ఇంకో అడుగు దూరం జరిగాడు.
పేద ప్రజలు తాగే మద్యం జోలికెళ్లడం ఇంకో తప్పు. మద్యం సిండికేట్లని రూపుమాపాలనుకుంటే కరెక్టే. కానీ జరిగింది వేరు. నాణ్యత లేని మద్యం అధిక రేట్లతో వచ్చింది. ధరలు పెంచితే మందు మానేస్తారా?
ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు హాహాకారాలు చేస్తూ వుంటే ఒక్క రోజైనా జగన్ జనం ముందుకొచ్చి గోడు విన్నాడా? క్షేత్రస్థాయి సమస్యలు అర్థం చేసుకుని పరిష్కారం దిశగా పూనుకున్నాడా?
తాడేపల్లి నుంచి బయటికి రాడు. వస్తే జనానికి అష్టకష్టాలు. షాపులు మూయించారు. చెట్లు నరికారు. పరదాలు కట్టారు. పోలీసుల్ని ఎంత దగ్గర పెట్టుకుంటే, జనం అంత దూరం అవుతారు. చిన్న లాజిక్, జగన్‌కి చెప్పేవాళ్లు లేరు. చెప్పినా వినే పరిస్థితి లేదు.
ఒక ప్రభుత్వం ప్రజల సొమ్ముని వేల కోట్లు ఖర్చు పెడితే, తర్వాత వచ్చే ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని గౌరవించి డబ్బు వృథా కాకుండా చూడాలి. ఎందుకంటే ప్రజల సొమ్ముకి జవాబుదారీగా వుంటారని మిమ్మల్ని ఎన్నుకుంటారు. కానీ జగన్ అమరావతిని పాడు పెట్టాడు. కోర్టులకి కోట్ల రూపాయలు తగలబెట్టి, అమరావతి బాధితుల్ని భిక్షగాళ్లని చేసి ఊరూరా తిప్పాడు.
ఒక భ్రమలో మునిగినప్పుడు వాస్తవం తలకెక్కదు. ఒక్కో వర్గాన్ని తెలివి తక్కువగా దూరం చేసుకుంటూ వచ్చిన జగన్, తన వెంట మైనార్టీలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని భ్రమకి గురయ్యారు. వాళ్లంతా కూడా మొదట ప్రజలు, తర్వాతే వర్గాలు.
జగన్ పుట్టుకతో చక్రవర్తి కాదు. పల్లవులో, కాకతీయులో, చోళుల రాజవంశం కాదు. ఆయన తాత ముత్తాతలు సాధారణ రైతులు. ప్రజాస్వామ్యం అనే బలమైన వ్యవస్థతో ముఖ్యమంత్రి అయ్యారు. దాన్ని గౌరవించని వాళ్లు నేలకు విసిరి పడతారు.
ఎవరైతే తన వెంట సైన్యంలా నిలిచారో, ఎవరు జేజేలు కొట్టారో, ఏ నాయకులైతే కష్టాలకు ఓర్చి జగన్‌ని భుజాల మీద ఎత్తుకున్నారో అందర్నీ మరిచి తాడేపల్లి నాలుగు గోడల మధ్య పాలన సాగించిన జగన్‌ని అందరూ కలిసి ఇంటికే పరిమితం చేశారు. ఇపుడు ఆయన బయటికొచ్చినా ఎవరికీ అవసరం లేదు. ప్రజలకి అవసరం అయినప్పుడు దూరమై, ఆయనకి అవసరమై దగ్గర అవుతానంటే జనం అంత తేలిగ్గా అంగీకరించరు.
దూరమైన అగ్రవర్ణాలు
ప్రధానంగా కమ్మ వర్గాన్ని జగన్ పూర్తిగా దూరం చేసుకున్నారు. ఎంత దూరం చేసుకున్నారు అంటే ఆయన వెనుక వున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి లాంటి నాయకుల ఇళ్లలో ఓట్లు కూడా వైకాపాకు పడి వుంటాయా? అంటే సందేహమే. ప్రపంచ వ్యాప్తంగా వున్న కమ్మ సామాజిక వర్గం అంతా ఒక్కటిగా మారింది. రామోజీ మీద కేసు, చంద్రబాబు అరెస్ట్ ఇవన్నీ మరింత ప్రేరేపించాయి. కమ్మవారు ఎవరికి వారు వారి వారి పరిథి మేరకు ప్రభుత్వం మీద ఎంతలా విరుచుకు పడాలో అంతా పడ్డారు. మెయిన్ స్ట్రిమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు. కమ్మవారంతా జగన్ కు ఎంత డ్యామేజ్ చేయాలో, ఎంత చేయించగలరో అంతా జరిగింది.
రఘురామకృష్ణం రాజు ఉదంతంతో క్షత్రియులు దూరం అయ్యారు. అశోక్ గజపతి, సింహాచలం దేవస్థానం ఉదంతం మరింత దూరం చేసింది. దీన్ని ఆసరాగా తెలుగుదేశం క్షత్రియులకు చెప్పుకోదగ్గ సీట్లు కేటాయంచింది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో క్షత్రియులంతా సాలిడ్ గా తెలుగుదేశం కూటమి వెనుక నిలబడ్డారు.
బ్రాహ్మణులు, వైశ్యుల విషయంలో జగన్ ఏ అన్యాయం చేయలేదు కానీ, భాజపా కారణంగా వారు కూటమి వైపు మొగ్గారు. క్రిస్టియన్ అనే ప్రచారం, కొన్ని చోట్ల హిందూ విగ్రహాలపై దాడులు అన్నీ కలిసి జగన్ ఖాతాను ఎంత తగ్గించాలో అంతా తగ్గించాయి.
రెడ్లు కూడా జగన్ తో సంతృప్తిగా లేరు. అధికారులు, కొంతమంది నాయకులకు పదవులు అందాయి. కానీ అలా అని చెప్పి, రెడ్లకు ఏమంతా అవకాశాలు కుప్పలుగా రాలేదు. జగన్ చుట్టూ వున్న కొంత మంది రెడ్లు మాత్రమే లాభపడ్డారు. తొలిసారి పల్నాడు ప్రాంతంలో సైతం రెడ్లు తమ పార్టీని కాదని కూటమికి ఓట్లు వేసారు.
ఇక మిగిలింది బిసి లు, ఎస్ సి, ఎస్టీ, మైనారిటీలు. వీళ్ల ఓట్లు యాభై నుంచి 70 శాతం జగన్ గు వచ్చాయి. అయితే కూటమి కలివిడిగా పోటీ చేయడంతో ఫలితం లేకపోయింది.
కూటమి నేత చంద్రబఆబు అందుకు భిన్నంగా వ్యవహరించారు. కమ్మ ఓట్లు ఎలాగూ వస్తాయని తెలుసు. కాపు ఓట్ల కోసం పవన్ ను ఎంత బుజ్జగించాలో, ఎంత గౌరవం ఇవ్వాలో, ఎంత వాడుకోవాలో అంతా చేసారు. అలాగే మిగిలిన వర్ణాలను, వర్గాలను చాలా పద్దతిగా లెక్కలు కట్టి మరీ దగ్గరకు వచ్చేలా చూసుకున్నారు.
జగన్ చుట్టూ పనికిమాలిన అధికారులు, కోటరీ
జగన్‌కు ఏదైనా చెబితే, ఆయన గుడ్డి విశ్వాసం, నమ్మకంతో ధనుంజయరెడ్డిని పిలిచి చెప్పేవాడన్నారు. ధనుంజయరెడ్డి చేతిలోకి ఏ కాగితం వెళ్లినా అంతే సంగతులన్నారు. ఒకట్రెండు కాదు, వందల సమస్యలు చెప్పొచ్చన్నారు. కొత్తగా గెలవడంతో ఏదైనా చేయాలనే తపనతో అధికారుల దగ్గరకు వెళితే, సరైన స్పందన లభించేది కాదని జక్కంపూడి రాజా ఆవేదన చెందారు. తండ్రికి మించి ప్రజలకు ఏదైనా చేయాలని జగన్ తపన పడే వారన్నారు. తాను మంచి చేసి వుంటేనే ఓటు వేయండి అని అడిగిన ఏకైక దమ్మున్న సీఎం జగన్ అని ఆయన అన్నారు. జగన్ గెలిచినా, ఓడినా రియల్ హీరో అన్నారాయన.
జగన్ చుట్టూ ఉన్న కోటరీ, పనికిమాలిన కొంత మంది అధికారులు కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టించారని జక్కంపూడి రాజా సంచలన ఆరోపణ చేశారు. జగన్‌ను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. జగన్‌ను ఒక ట్రాన్స్‌లో పెట్టే ప్రయత్నం చేశారని రాజా ఆవేదన వ్యక్తం చేశారు.
భజన, భజన, భజన..
జగన్ భజన బ్యాచ్‌తో తన్మయుడై వాళ్ల మాటలు, నివేదికలు, గణాంకాలు నమ్మి మునిగిపోయాడు. కోళ్ల గుంపులాంటి సలహాదారులను పెట్టుకుని వాస్తవాల్ని గుర్తించలేకపోయాడు. ఒక్క సలహాదారుడు కూడా పార్టీ గోదారిలో కలిసిపోతూ వుందని కనిపెట్టలేకపోయారు.
తిట్లు, శాపనార్థాలు, వల్గారిటీతో తెలుగుదేశాన్ని జయిస్తున్నామని అనుకున్నారు. కానీ జనం ఏవగించుకుంటున్నారని కనిపెట్టలేకపోయారు. పార్టీకి ఎవరు హానికరమో వాళ్లందరినీ అక్కున చేర్చుకున్నాడు. జగన్‌ని గుండెల్లో పెట్టుకున్న కార్యకర్తల్ని విసిరికొట్టారు. సోషల్ మీడియాలో యుద్ధం చేసిన వాళ్లని కరివేపాకుల్లాగా తీసి పారేశారు.
సాక్షిలో రాతగాళ్లని కాకుండా, మోతగాళ్లకి పెద్దపీట వేశారు. విద్వత్తు ఉన్న వాళ్లని పక్కన పెట్టి డోలు విద్వాంసుల్ని చేరదీశారు. చేవని మరిచి చెక్క భజనని వీనుల విందుగా విన్నారు. ఈ చిడతల బ్యాచ్ పార్టీకి పిడకలు కొట్టారు. పార్టీ కోసం, ప్రజల కోసం పని చేసే ఎమ్మెల్యేలకి కూడా జగన్ దర్శనం దక్కకుండా చేశారు. కార్యకర్తలుంటేనే ఎమ్మెల్యే. ఎమ్మెల్యేలు వుంటేనే ముఖ్యమంత్రి. ప్రజలుంటేనే వీళ్లంతా. ఈ అంచెల వారీ విధానాన్ని విస్మరించి తానే దేవుడనుకున్నాడు జగన్. చుట్టూ వున్న పూజారులు స్త్రోత్రాలు పాడి పార్టీని శాశ్వతంగా పవళింపు సేవకి పరిమితం చేశారు. కాకారాయుళ్లైన ఎమ్మెల్యే, ఎంపీలను నమ్మి, పార్టీలోని కాకలుతీరిన యోధుల్ని కూడా దూరం పెట్టారు.
ఈ ఐదేళ్లలో జగన్ ఏమీ సాధించలేదా? అంటే సాధించాడు. మీడియా మొహం చూడని తొలి ముఖ్యమంత్రి, లక్షల కోట్ల అప్పు, బటన్ ద్వారా పంపిణీ, ఛీప్ లిక్కర్ తాగేవాళ్లందరికీ ప్రెసిడెంట్ మెడల్, బూతుల మంత్రులకి భుజకీర్తులు, ఇసుక మాఫియా, భజన చేసిన వాళ్లకి చేసినంత ప్రసాదం. ఇదంతా పాలన అని ఆయన అనుకున్నాడు. జనం అనుకోలేదు.
సజ్జల భార్గవ్ 'షో'షల్ మీడియా
సోషల్ మీడియా గురించి బాగా తెలిసిన వ్యక్తుల చేతల్లో పెడుతుంటారు. కానీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూటే సపరేట్. తనకు బాగా తెలిసిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్‌కు తన పార్టీ సోషల్ మీడియాను అప్పగించారు. సజ్జల భార్గవ్‌కు సోషల్ మీడియా గురించి అద్భుతమైన పరిజ్ఞానం వుంటే ...జగన్ నిర్ణయాన్ని సమర్థించొచ్చు. కానీ ఫేస్‌బుక్‌లో, ట్విటర్‌లో కనీసం ఖాతా కూడా లేని సజ్జల భార్గవ్‌కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారంటే ఏమనుకోవాలి?
రెండేళ్ల క్రితం భార్గవ్‌కు వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు అప్పగిస్తున్న ఆయనకు తోడుగా చల్లా మధు, రత్నాకర్‌ను నియమించారు. అయినా వాళ్లతో కలిసి భార్గవ్ చేసింది ఏమైనా వుందా? అంటే... ఏమీ లేదనే సమాధానం వస్తోంది. కీలకమైన ఎన్నికల సమయంలో భార్గవ్ ఇతర సోషల్ మీడియా చానళ్లు, ప్రతినిధులను ఏ మేరకు వైసీపీ కోసం పని చేసేలా చక్రం తిప్పారంటే... దానికీ సమాధానం నిల్.
చంద్రబాబు మనిషిగా గుర్తింపు పొందిన ఒక మహిళా యాంకర్‌కు కోట్లాది రూపాయలు ముట్టచెప్పి, హమ్మయ్య ఇంతటితో తన బాధ్యత తీరిందని భార్గవ్ రిలాక్ష్ అయ్యారు. సదరు యాంకరమ్మ తనకు తోచినట్టుగా వైసీపీ నాయకులతో ఇంటర్వ్యూలు చేసి, కొంత మందితో చేయించి.... ఎన్నికల్లో మమ అనిపించారు. కోట్లాది రూపాయల్ని సొంతం చేసుకున్నారు. ఇదే వైసీపీ గెలుపు కోసం తాపత్రయ పడి తమకు తోచిన రీతిలో స్వచ్ఛందంగా పని చేసే వాళ్లను భార్గవ్ పట్టించుకున్న పాపాన పోలేదు.
భార్గవ్ పట్టించుకున్నదల్లా గోడ మీద పిల్లి లాంటి జర్నలిస్టులను. ఒకవైపు ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే, కూటమి భజన మొదలు పెట్టిన సోషల్ మీడియా ప్రభావశీల జర్నలిస్టులను గమనిస్తే... వారంతా భార్గవ్ డబ్బులిచ్చి పెంచి పోషించిన వ్యక్తులే కావడం గమనార్హం.
ఎన్నికల్లో వైసీపీపై వ్యతిరేకత పెంచే అంశాల్ని గుర్తించి, వాటిని సోషల్ మీడియా వేదికగా తిప్పి కొట్టడంలో భార్గవ్ నాయకత్వం పూర్తిగా విఫలమైంది. ఉదాహరణకు ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై టీడీపీ, జనసేన విస్తృతంగా దుష్ప్రచారం చేశాయి. కానీ వాటిని తిప్పి కొట్టడానికి వైసీపీ సోషల్ మీడియా చేసిన ప్రయత్నం చాలా స్వల్పం. మరి వైసీపీ సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని భార్గవ్ ఏం చేశారయ్యా అంటే... ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.
తన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే తనపై ప్రత్యర్థులు, లేదా సొంత పార్టీకి చెందిన వారెవరైనా విమర్శలు చేస్తే, పార్టీ సోషల్ మీడియా సైన్యంతో తీవ్ర ఎదురు దాడి చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాట వినని సొంత పార్టీ నాయకుల్ని జగన్‌ను కలవనీయకుండా చేసేవారు. అలాగే అలాంటి వాళ్లపై ఏదో ఒక సాకుతో కేసులు నమోదు చేయించి చిత్రహింసలు పెట్టించే వారు. ఇందుకు నిలువెత్తు ఉదాహరణ పిన్నెల్లి సోదరులే. పల్నాడులో మాచర్ల అంటే గిట్టని ఏఎస్పీకి పోస్టింగ్ వేయించి, ముప్పుతిప్పలు పెట్టించారనే ప్రచారం వుంది. ఇంకో ప్రచారం కూడా ఏంటంటే...సొంత పార్టీ నేతలపై ఎల్లో మీడియాలో వార్తలు రాయించడం వెనుక సజ్జల మార్క్ వుందని వైసీపీలో ఓ చర్చ వుంది. జగన్ రాజకీయ ప్రయోజనాలు పక్కకు పోయాయి. సజ్జల కుటుంబ గౌరవ, ప్రతిష్టలకే సోషల్ మీడియాలో భార్గవ్ పెద్దపీట వేశారనే విమర్శ వుంది.
సోషల్ మీడియాలో ప్రత్యర్థుల దుష్ప్రచారంపై తిప్పి కొట్టడానికి కావాల్సినంత కంటెంట్ ఉన్నప్పటికీ, సరైన రీతిలో ఉపయోగించడంలో భార్గవ్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పక తప్పదు. ఎవరినైనా డబ్బుతో నోళ్లు మూయించొచ్చనే ధ్యాస తప్ప, వైసీపీ గ్రాఫ్ పెంచే పని చేయడంపై దృష్టి సారించలేదన్న అభిప్రాయం వుంది. వైసీపీ అధికారంలో ఉండడం, సోషల్ మీడియాకు భారీ బడ్జెట్ కేటాయించడం అందరికీ తెలిసిందే. మరి ఈ డబ్బంతా ఎవరికిచ్చారు? ఎందుకిచ్చారు? ఏం చేశారనే చర్చకు తెరలేచింది.
వైసీపీ మండల, తాలూకా, జిల్లా సోషల్ మీడియా ప్రతినిధులకు కూడా భార్గవ్ రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవని చెబుతున్నారు. మనోడు కదా అని సజ్జల భార్గవ్‌కు సోషల్ మీడియా బాధ్యతల్ని అప్పగిస్తే, ఆ యువ నాయకుడు మాత్రం పార్టీ కోసం కాకుండా, ఇతరత్రా ఎక్కువ ఉపయోగించారని సంబంధిత యాక్టివిస్టులు చెబుతున్నారు. వైసీపీ ఘోర పరాజయంలో తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు... సోషల్ మీడియా హెడ్ భార్గవ్ పాత్ర కూడా వుందని మెజార్టీ అభిప్రాయం. రెండేళ్ల పాటు సజ్జల భార్గవ్ సోషల్ మీడియా వేదికగా ఏదో చేస్తున్నట్టు జగన్‌కు "షో" చూపించారు. జగన్ పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమవుతోంది.
సోషల్ మీడియా పేరుతో భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందిన సజ్జల భార్గవ్ కుటుంబం బాగుంది. ఇప్పుడు అధికారం పోగొట్టుకుని వీధినపడ్డది జగన్, ఆయన్ను నమ్ముకున్నోళ్లే.
వైసీపీ ఓటమికి కారణాలు!
- జగన్ మోహన్ రెడ్డి ఒంటెత్తు పోకడలు
- సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించటం
- ఎమ్మెల్యేలను, నేతలను జగన్ పట్టించుకోకపోవటం
- వైసీపీ ఎమ్మెల్యేలు కింది స్థాయి కార్యకర్తలను పట్టించుకోపోవటం, ఎదగనీయక పోవటం
- అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.అవినీతి, దోపిడీకి తెగబడటం.
- ఉద్యోగులపై అనుచిత వైఖరి
- అభ్యర్థులను ఇష్టమొచ్చినట్లు మార్చటం
- కొందరు మంత్రుల నోటి దురుసు
- మద్యం విధానంలో నిజాయితీ లోపించటం
- రాజకీయాలలో మిత్రుల అవసరాన్ని తక్కువగా అంచనా వేయటం
- టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక ప్రభావాన్ని అంచనా వేయకపోవటం
-పవన్‌కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రధానంగా జగన్ పదేపదే కించపరిచేలా మాట్లాడ్డం. కాపు, బలిజ సామాజిక వర్గీయులు తమను అవమానిస్తున్నారని భావించడం
- స్థానిక ఎన్నికల్లో అధికార బలంతో ఏకగ్రీవాలు చేసుకోవటం
- జగన్ తన సొంత కుటుంబంలోని సమస్యలనూ పరిష్కరించుకోకపోవటం
-షర్మిలకు మద్దతుగా విజయమ్మ వీడియో విడుదల చేయడం. సొంత తల్లే జగన్‌కు అండగా లేదనే సంకేతాలు వెళ్లడం
- నాయకుల కంటే వాలంటీర్ల వ్యవస్థ మీదే పూర్తిగా ఆధారపడటం
- భూముల పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకోవటం
- భూముల సర్వే వల్ల రైతుల్లో ఏర్పడిన భయం
-ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో భూముల్ని వైసీపీ నేతలు లాక్కుంటారనే ప్రత్యర్థుల ఆరోపణలకు బలం ఇచ్చేలా వైసీపీ సర్కార్ ప్రవర్తించడం
- సొంత సామాజిక వర్గంలో జగన్ మీద కోపం
- అర్హత లేని వారినే జగన్ అందలం ఎక్కించడం
-భజనపరులైతే చాలు... జగన్ పక్కన పెట్టుకుంటారనే అభిప్రాయం వైసీపీ నేతల్లో కలగడం
-ప్రతిదానికీ సజ్జల రామకృష్ణారెడ్డిని మీడియా ముందుకు పంపడం. అలాంటప్పుడు సీఎంగా జగన్ ఎందుకనే అసహనం ప్రజల్లో కలగడం
-ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైసీపీ మేనిఫెస్టో లేకపోవడం
ఇక అభివృద్ధి, రాజధాని అంశంలో జగన్ తన అభిప్రాయాలు ఏవైనా, తను చేసింది ఏదైనా.. దాన్ని పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేసుకోవడంలో దారుణంగా విఫలం అయ్యాడు! మూడు రాజధానుల ఫార్ములా ఏ ఒక్క ప్రాంతాన్నీ ఆకట్టుకోలేకపోయిందని ఫలితాలతో పూర్తిగా రుజువు అయ్యింది. అమరావతి రూపంలో చంద్రబాబు ఎన్ని అక్రమాలకు పాల్పడి ఉన్నా.. ఫర్వాలేదనే ప్రజలు అనుకున్నారు కానీ, రాజధాని అంటూ ఒకటి ఉండాలనే తీరునే వారు వ్యక్త పరిచారు, ఇది ఓటమి తర్వాత కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోలేకపోయింది. అలాగే రోడ్ల విషయంలో పచ్చబ్యాచ్ చేసిన యాగీని నియంత్రించలేకపోయింది. ఆఖరి వరకూ చిన్న చిన్న రిపేర్లను కూడా పెండింగ్ లో పెట్టి.. సోషల్ మీడియా ప్రచారాలను నమ్మే వాళ్ల చేతిలో ఎదురుదెబ్బలు ఎదుర్కొంది.
చంద్రబాబు చేసిందీ అప్పులే, జగన్ చేసిందీ అప్పులే.. అయితే చంద్రబాబు అప్పులు చేసి నీరుచెట్టు అంటూ పప్పు బెల్లాలు పంచినా మళ్లీ అలాంటి హామీలే ఇవ్వగలుగుతున్నారు! జగన్ మాత్రం అప్పుల విషయంలో మాత్రం విపరీతమైన నెగిటివ్ పబ్లిసిటీ జరిగింది. ఇదీ కూడా తీవ్రమైన నష్టాన్నే కలిగించింది.
తన తండ్రికంటే గొప్పగా సంక్షేమం చేసానని జగన్ అనుకుని ఉండొచ్చు. ఆయన అనుకున్నా అనుకోకపోయినా ఆయన అనుచరులు మాత్రం అంటూ ఉంటారు. కానీ జగన్ తన తండ్రి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
- సంక్షేమం, అభివృద్ధి- రెండింటినీ బ్యాలెన్స్ చేయడం.
- అగ్రకులాలు, ఇతర కులాలు అనే తేడా లేకుండా అందరి మనసుని గెలుచుకునేలా వ్యవహరించడం
- రాజకీయంగా వెన్నుదన్నుగా ఉండే సొంత వర్గానికి చెందిన రాజకీయనాయకులు, ఎన్నారైలు, హై నెట్ వర్త్ పీపుల్..ఇలా అందరినీ దగ్గరగా పెట్టుకోవడం.
- రాజకీయ ప్రత్యర్ధులతో ఛలోక్తులు, సున్నితమైన సెటైర్లు తప్ప కఠిన మాటలతో బాధపెట్టకుండా ఉండడం. ఒకవేళ అలా సొంత పార్టీ వాళ్లు ఎవరైనా వ్యవహరిస్తే వారిని మందలించడం.
- వయసుకి గౌరవమిస్తూ రాజకీయ ప్రత్యర్థులని సంబోధించడం.
లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను పెట్టినా, ప్రజలకే డైరెక్టుగా పథకాల లబ్ధి కలిగే ఏర్పాటు చేసినా, వాటిపై అతి విశ్వాసంతో, నష్టం కలుగుతున్న విషయాలను పూర్తిగా లైట్ తీసుకుని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది. తన పాలన లో మంచి జరిగి ఉంటేనే తనకు ఓటేయాలని జగన్ బాహాటంగా చెప్పాడు, ఆయన పార్టీ ఎంత ఓట్ల శాతాన్ని పొందినా, చిత్తుగా ఓటమి పాలైంది! కాబట్టి.. జగన్ పాలన నచ్చలేదంతే!
కర్ణుడి చావుకి వెయ్యి కారణాలంటారు..కానీ ఇక్కడ కోట్లాదిమంది అభిమానుల ఆశలకి పాతరేసింది మాత్రం ఒకే ఒక్కడు... దట్ ఇస్ ...
అవును జగన్ ఓటమికి కారణం .. జగన్
ReplyDelete